వైసీపీలో సమరమే : ఎంపీలూ ఎమ్మెల్యేల మధ్య ఏం జరుగుతోంది...?

Update: 2022-06-11 15:30 GMT
ఒకే పార్టీకి చెందిన వారు అంతా ఉన్నారు. కనీసం విమర్శ చేసుకునేందుకు సోది లోకి అయినా ప్రత్యర్ధి పార్టీ మనిషి గెలిచిన దాఖలా లేదు. జిల్లాలకు జిల్లాలూ వైసీపీ పరం అయ్యాయి. వారే ఎంపీలు, వారే ఎమ్మెల్యేలు, ఆఖరుకు టాప్ టూ బాటం చూస్తే సర్పంచు నుంచి వార్డు మెంబర్ వరకూ వారిదే హవా. నిజంగా ఇంతటి రాజకీయ అనుకూలత గతంలో ఎప్పుడూ చూడలేదు. అంతా ఒక్క చోట చేరి పచ్చగా హాయిగా ఉండాల్సిన పరిస్థితి.

కానీ జరుగుతున్నది మాత్రం వేరుగా ఉంది. ఒకే పార్టీలో ఉన్నా కత్తులు వేరుగా ఉన్నరు. ఒకే ఒరలో ఆ రెండు కత్తులు ఒదగనంటున్నాయి. ఎలాగో పంటి బిగువున మూడేళ్ల పాటు బిగపట్టిన అసంతృప్తి, బాధ, వ్యధ అన్నీ కూడా ఇపుడు బయటపెట్టేసుకుంటున్నారు. నీదా నాదా అడ్డా అంటూ పందేలు కాస్తున్నారు. బస్తీమే సవాల్ అని ఒకరిని ఒకరు కాలు దువ్వి మరీ రచ్చకీడుస్తున్నారు.

మచిలీపట్నం వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి వర్సెస్ మాజీ మంత్రి పేర్ని నాని ఎపిసోడ్ ఏపీలో వైసీపీ ప్రస్తుత రాజకీయ పరిస్థితితి అద్దం పడుతోంది. ఒక విధంగా ఇది మొత్తం ఏపీలో జరుగుతున్న ఈ తరహా వివాదాలను తెర ముందుకు తెచ్చిన ఒక ఉదాహరణగానే అంతా చూస్తున్నారు. పేర్ని నాని మంచిలీపట్నాన్ని తన అడ్డాగా చేసుకున్నారని బాలశౌరి ఆరోపిస్తున్నారు. బందరు ఆయన జాగీరా అని కూడా ప్రశ్నిస్తున్నారు.

అంతే కాదు తాను అక్కడే ఉంటాను, ఒక ఎంపీగా తనను అడ్డుకోవడం సొంత పార్టీ ఎమ్మెల్యేకు తగునా అని కూడా హూంకరిస్తున్నారు. ఇక పేర్ని నాని టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావుకు ప్రాధాన్యత ఇస్తూ ఆయనతో తిరుగుతున్నారని, సొంత పార్టీ వారిని నిరాదరణకు గురి చేస్తున్నారని కూడా బాలశౌరి బాంబులాంటి వార్తనే పేల్చారు.

ఇదే కనుక నిజమైతే వైసీపీ హై కమాండ్ చూపు సారించాల్సిందే అని కూడా అంటున్నారు సరే బందరు ఇష్యూ ఇపుడు మీడియా సాక్షిగా బయటపడింది కాబట్టి హై కమాండ్ ఫోకస్ పెట్టవచ్చు. ఇద్దరినీ పిలిపించి మాట్లాడవచ్చు. కానీ ఏపీలో అన్ని చోట్లా ఇదే రకమైన పరిస్థితి ఉంది. అనకాపల్లి జిల్లాలో చూస్తే యువ మంత్రి గుడివాడ అమరనాధ్ కి అనకాపల్లి ఎంపీ సత్యవతికి అసలు పడదు. ఈ ఇద్దరు మధ్యన కూడా పచ్చగడ్డి వేస్తే మండుతోంది అంటారు.

మాది తల్లీకొడుకుల అనుబంధం, ఆమెతో తనకు వైరం ఏంటి అని యువ మంత్రి గుడివాడ అంటున్నా ఆచరణలో మాత్రం పొసగడంలేదు అనే చెబుతారు. ఒక ఆహ్వాన పత్రికలో ఎంపీ ఫోటోను గుడివాడ వర్గీయులు కావాలనే తీయించేశారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇక అరకు ఎంపీ గొడ్డేటి మాధవికి పాడేరు ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మికి కూడా పడడంలేదు అన్న ప్రచారం ఉంది

ఈ ఇద్దరు మహిళా నేతలు ముఖాముఖాలు చూసుకోరని కూడా అంటారు. పక్కా ఆధిపత్య పోరు ఇద్దరు మధ్యన నడుస్తోందని అంటారు. దాంతో ఎడముఖం పెడముఖంగా అల్లూరి జిల్లా ఏజెన్సీ రాజకీయాలు సాగుతున్నాయని అంటారు. ఈ వివాదం అలాగే ఇప్పటికీ ఉందని కూడా చెబుతారు.

గోదావరి జిల్లాలలో చూస్తే రాజమండ్రీ ఎంపీ మార్గాని భరత్ కి స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు మధ్య గొడవలు చాలా కాలంగా ఉన్నాయి. ఆయన మాట ఈయన వినరు, ఈయన తోవలోకి ఆయన రారు. ఈ ఇద్దరు మధ్యన అధినాయకత్వం పంచాయతీ పెట్టి మరీ అప్పట్లో రాజీ కుదిర్చినా కూడా ఇంకా సీన్ అలాగే ఉంది అంటారు. అలాగే కాకినాడ ఎంపీ వంగా గీతకు లోకల్ ఎమ్మెల్యేలతో విభేదాలు ఉన్నాయి.

పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తన నియోజకవర్గంలో ఎంపీ పర్యటించడం మీద అభ్యంతరాలు చెబుతూ ఉంటారు. నా నియోజకవర్గంలో భాగమైన పిఠాపురంలో నేను టూర్ చేయడానికి ఒకరి అనుమతి అవసరమా అని ఎంపీ గీత గద్దిస్తున్నారు అని టాక్. ఆమె చూపు పిఠాపురం సీటు మీద ఉందనే ఇలా ఎమ్మెల్యే గరం గరం అవుతున్నారు అని కూడా ప్రచారంలో ఉంది.

ఇక నరసారావుపేట ఎంపీ లావు శ్రీక్రిష్ణదేవరాయలకూ లోకల్ ఎమ్మెల్యేలకు మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. ఎంపీని ఏ కార్యక్రమానికి పిలవడంలేదని పట్టించుకోవడంలేదని వాపోతుంటారు. ఆయన ఈ మధ్య మంత్రుల బస్సుయాత్రలో భాగంగా నరసారావుపేటలో జరిగిన సభకు సైతం డుమ్మా కొట్టారు. ఆయనకూ మంత్రి విడదల రజనీకి మధ్య కూడా గ్యాప్ ఉంది అంటారు.

మరో వైపు చూస్తే నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డికి లోకల్ ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఉంది అంటారు. ఆయన కూడా కేవలం ఎంపీ కావడం కోసమే వైసీపీలోకి ఫిరాయించి మరీ గెలిచారు కానీ వైసీపీ ఎంపీగా లోకల్ లీడర్లతో ఎపుడూ కలసిపోయే ప్రయత్నం చేయడంలేదు అని అంటారు. ఆయన చూపు టీడీపీ మీద ఉందని కూడా టాక్ నడుస్తోంది.

ఇక ప్రకాశం జిల్లా విషయానికి వస్తే అక్కడ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా స్థానిక ఎమ్మెల్యేలు తనతో కలసి సాగడంలేదని, దేనికీ పిలవడం లేదని అంటూ ఉంటారు. ఆయన కూడా ఇపుడు ఫుల్ సైలెంట్ గా ఉంటున్నారు. రానున్న రోజులల్లో పరిస్థితులకు అనుగుణంగా తన రాజకీయాన్ని చేసుకోవాలని చూస్తున్నట్లుగా చెబుతారు.

చిత్తూరు జిల్లాలో ఎంపీ ఎన్ రెడ్డప కూడా ప్రోటోకాల్ వివాదం విషయంలో ఎపుడూ ఆవేదన చెందుతూ ఉంటారని అంటారు. లోకల్ ఎమ్మెల్యేలు ఏ సమాచారం ఇవ్వడంలేదని కూడా ఆయన అనుచరులు మధన పడుతూ ఉంటారు. కొన్ని సార్లు ఇది బాహాటం అయింది కూడా. సీమ జిల్లాల్లో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కి లోకల్ ఎమ్మెల్యేలకు ఎడం ఉంది. అలాగే అనంతపురం ఎంపీ తలారి రంగయ్య అయినా కర్నూల్ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ అయినా ఎమ్మెల్యేలతో కలసి సాగలేక మౌన ముద్ర దాలుస్తున్నారు అంటే గ్యాప్ అయితే ఉందనే అంటారు.

మరి ఎంపీకి అదే నియోజకవర్గం, ఎమ్మెల్యేదీ అదే చోటు. కానీ అధికారాలు, వర్గాలు పేరిట రచ్చ రాజుకుంటూనే ఉంటుంది. ఇంకో వైపు కొందరు ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీకి సేఫ్ జోన్ గా సీట్లు ఎంపిక చేసుకోవడం వల్ల కూడా వివాదాలు పెచ్చరిల్లుతున్నాయి మొత్తానికి చూస్తే ఒకే పార్టీ ఒకే జెండా ఒకే నీడన ఉన్నా ప్రత్యర్ధుల కంటే దారుణంగా మాటల బాంబులు పేల్చుతున్నారు. ఇదే తీరు కనుక కొనసాగితే ఇద్దరికీ ముప్పే, అంతిమంగా పార్టీకే అతి పెద్ద రాజకీయ ప్రమాదం ఏర్పడుతుంది అంటున్నారు వైసీపీ వర్గాలు. సో అధినాయకత్వం జోక్యం చేసుకోవాల్సిందే అంటున్నారు.
Tags:    

Similar News