నిమ్మగడ్డ కొత్త ఎత్తుకు జగన్ సర్కార్ పైఎత్తు?

Update: 2021-01-30 17:30 GMT
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ ఇవ్వడానికి రెడీ అయినట్లు ప్రచారం సాగుతోంది.. పంచాయితీ ఎన్నికలతో చిచ్చుపెట్టిన నిమ్మగడ్డ... ఇక మిగిలిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలను కూడా పూర్తి చేయాలని   స్కెచ్ గీసినట్టు అమరావతి వర్గాల్లో చర్చ జరుగుతోంది.. ఇందుకోసం తన పదవీకాలాన్ని సైతం పొడిగించుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

రాష్ట్రంలో అన్ని రకాల లోకల్ ఎన్నికలను పూర్తి చేసే దాకా పదవిలో ఉండేందుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఆయన ప్రయత్నాలకు ఆదిలోనే గండికొట్టేందుకు జగన్ సర్కార్ కూడా పైఎత్తులు ప్రారంభించినట్లు అమరావతి వర్గాల్లో చెప్పుకుంటున్నారు.

వరుస ఎన్నికలతో కనీసం రెండు నెలల పదవీకాలాన్ని పొడిగించుకునేందుకు నిమ్మగడ్డ ప్రయత్నాలు షూరూ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చితో ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ పదవీకాలం ముగియబోతోంది. వచ్చేనెల 21వ తేదీతో పంచాయితీ ఎన్నికలు ముగుస్తాయి. వెంటనే 22న మున్సిపల్ ఎన్నికలకు నిమ్మగడ్డ నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీ అయినట్లు సమాచారం.  అది ముగిసేలోగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తారని తెలుస్తోంది.  దీనికి నెలరోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.

ఓసారి ఎన్నికలు మొదలయ్యాక వాటి కొనసాగింపు కోసం తనకు అవకాశం ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించేందుకు నిమ్మగడ్డకు వీలుంటుంది. దీంతో కోర్టు అనుమతితో ఏపీ ప్రభుత్వాన్ని మరోసారి ఇరుకునపెట్టేలా ఆయన వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. పదవీకాలం పొడిగింపు కోసం నిమ్మగడ్డ వరుసగా ఎన్నికలు నిర్వహించేందుకు స్కెచ్ గీస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

నిమ్మగడ్డను పదవి నుంచి దించిన సమయంలో రెండు నెలలు ఆయన కోర్టుల్లో న్యాయపోరాటం చేశాడు. ఆ కాలాన్ని పొడిగించాలని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఆ రెండు నెలల కాలానికి రాష్ట్రప్రభుత్వం జీతం ఇచ్చిందని.. ఈ కారణంగా ఆయన పదవీకాలం పొడిగింపు సాధ్యంకాదని ఏపీ ప్రభుత్వం వర్గాలు అంటున్నాయి.

మార్చి 31 తర్వాత ఒక్కరోజు కూడా నిమ్మగడ్డ పదవిలో కొనసాగకుండా చేసేందుకు అన్ని ప్రయత్నాలు ప్రభుత్వం చేయనుందని సమాచారం. మొత్తం మీద ఎన్నికల నిర్వహణపైనే కాకుండా నిమ్మగడ్డ పదవీకాలంపై కూడా జగన్ సర్కార్ సమరం చేసేందుకు  రెడీ అవుతోంది.
Tags:    

Similar News