సీరమ్ టీకా ధరకు భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ధరకు మధ్య తేడా ఎంత?

Update: 2021-01-13 03:45 GMT
నెలల తరబడి ఎదురుచూస్తున్న రోజులు వచ్చేశాయి. అనుకున్నట్లే దేశంలో రెండు ఫార్మా కంపెనీలు తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. కంపెనీ గోదాముల్లో నుంచి రాష్ట్రాల్లోకి రావటమే కాదు.. షెడ్యూల్ లో భాగంగా మరో మూడు రోజుల్లో (జనవరి 16న) కరోనా వ్యాక్సిన్ ను వేయటం షురూ చేయనున్నారు. ప్రస్తుతానికి దేశంలోని రెండు అగ్ర సంస్థలకు చెందిన వ్యాక్సిన్ ను వేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.

సీరమ్ కంపెనీ తయారు చేసిన కోవిషీల్డ్.. భారత్ బయోటెక్ రూపొందించిన కోవ్యాగ్జిన్ వ్యాక్సిన్ లకు సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలు తాజాగా బయటకు వచ్చాయి. మంచినీళ్ల బాటిల్ ధర కంటే తక్కువగానే తమ వ్యాక్సిన్ ధర ఉంటుందని చెప్పిన భారత్ బయోటెక్.. తమ కోవాగ్జిన్ వ్యాక్సిన్ ధరను.. సీరమ్ కంటే ఎక్కువగా ఉంచటం గమనార్హం. తొలిదశలో ధర ఎక్కువగా ఉన్నప్పటికీ.. రానున్న కాలంలో దీని ధర తగ్గుతుందని చెబుతున్నారు.

సీరమ్ వ్యాక్సిన్ ఒక్కో డోసు రూ.200లుగా ఫిక్స్ చేస్తే.. భారత్ బయోటెక్ టీకా రూ.295గా డిసైడ్ చేశారు. సీరమ్ వ్యాక్సిన్ ను కేంద్రం 1.10కోట్ల డోసులకు ఆర్డర్ ఇస్తే. .భారత్ బాయోటెక్ కు 55లక్షల డోసులు ఆర్డర్ ఇచ్చారు. అయితే.. తాను చేసుకున్న ఒప్పందంలో భాగంగా భారత్ బయోటెక్ 16.50లక్షల డోసుల్ని ఉచితంగా ఇవ్వనుంది. దీంతో.. అది పంపిణీ చేసే మొత్తం డోసుల్లో 38.5లక్షల డోసులకు మాత్రమే చెల్లింపులు జరుపుతారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని.. దాని గురించి ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కు గురైనోళ్లు చాలా చాలా తక్కువని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ చెబుతున్నారు. 
Tags:    

Similar News