టీడీపీ యంగ్ మినిస్ట‌ర్ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ ఏంటో..!

Update: 2022-07-04 06:51 GMT
ఆయ‌న యువ‌కుడు. మాజీ మంత్రి కూడా. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కింది లేదు. ఆయ‌నే కిడారి శ్రావ‌ణ్ కుమార్‌. గ‌త 2014లో ఆయ‌న తండ్రి కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు వైసీపీ త‌ర‌ఫున గెలిచి 2017లో టీడీపీ పంచ‌న చేరిపోయారు. త‌ర్వాత‌.. మావోయిస్టు కాల్పుల్లో మృతి చెందారు. ఆ త‌ర్వాత‌..తండ్రి వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన శ్రావ‌ణ్‌కు చంద్ర‌బాబు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. అప్ప‌టికి కేవ‌లం ఆరు మాసాల ముందే.. ఎన్నిక‌లు వుండ‌డంతో ఆయ‌న ప్ర‌జ‌ల్లో గెల‌వాల్సిన ప‌రిస్థితి లేకుండా పోయింది. అయితే.. త‌ర్వాత వ‌చ్చిన 2019 ఎన్నిక‌ల్లో క‌నీసం డిపాజిట్లు కూడా ద‌క్కించుకోలేదు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఆయ‌న దూకుడు ఎలా ఉంది?  వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించు కున్నారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఎందుకంటే.. గిరిజ‌న ప్రాంతాల‌ను చూసుకుంటే.. ఇప్పుడు వైసీపీకి అనుకూల ప‌వ‌నాలు క‌నిపించ‌డం లేదు. గ‌తంలో జ‌గ‌న్ పాద‌యాత్ర చేసిన‌ప్పుడు.. డోలీలు క‌ట్టుకు ని వ‌స్తున్నామ‌ని, త‌మ‌కు రోడ్డు స‌దుపాయాలు ఇవ్వాల‌ని.. ఇళ్లు ఇవ్వాల‌ని.. కోరారు. దీనికి ఆయ‌న స‌మ్మ‌తించారు. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది. అస‌లు వారిని ప‌ట్టించుకోవ‌డం లేదు.

దీంతో గిరిజ‌న ప్రాంతాల్లో ఒక‌ప్పుడు ఉన్న వైసీపీ హ‌వా ఇప్పుడు త‌గ్గుతూ వ‌స్తోంది. అదే స‌మ‌యంలో ఎంతో మంది గిరిజ‌న నాయ‌కులు ఉన్నా.. త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని.. గిరిజ‌నులు వాపోతున్నారు.దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌.. మాజీ డిప్యూటీ సీఎం .. పుష్ప శ్రీవాణికి ఇటీవ‌ల ఎదురైన ప‌రాభ‌వ‌మే. ఆమె గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో వెళ్ల‌గా.. గిరిజ‌నులు త‌మ ప్రాంతానికి రావొద్ద‌ని చెప్పారు. అదేవిధంగా అర‌కులోనే చెట్టి ఫ‌ల్గుణ‌ను కాల‌ర్ ప‌ట్టుకుని నిల‌దీశారు. మా వాడ‌ల‌కు రావొద్ద‌ని గిరిజ‌న మ‌హిళ‌లు తెగేసి చెప్పారు. అంటే.. వైసీపీ ప‌ట్ల గిరిజ‌నులు విశ్వాసం కోల్పోయారు.

మ‌రి ఈ స‌మ‌యంలో కిడారి  వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తే.. త‌న ప‌ట్ల గిరిజ‌నులు అభిమానం పెంచుకునేందుకు స‌ర్వేశ్వ‌ర‌రావు సింప‌తీని సంపాదించుకునేందుకు యువ నాయ‌కుడిగా ఆయ‌న‌కు అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు  చెబుతున్నారు. కానీ,  త‌ర‌హా రాజ‌కీయాలు ఇక్క‌డ క‌నిపించ‌డం లేదు. ఇక్క‌డ మ‌రో చిత్ర‌మైన విష‌యం ఏంటంటే.. ప‌నిచేద్దామ‌ని అనుకుంటున్న కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కుల‌కు చంద్ర‌బాబు టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేస్తారో లేదో .అనే చింత ఉంది.

కానీ, అర‌కులో అలాంటి ప‌రిస్థితి లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో శ్రావ‌ణ్‌కే టికెట్ ద‌క్కుతుంది. అయినా.. ఆయ‌న మీన మేషాలు లెక్కిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇప్ప‌టికైనా.. ఆయ‌న పుంజుకుంటే.. గెలుపు గుర్రం ఎక్క‌డ ఈజీ అవుతుంద‌ని.. లేక‌పోతే శ్రావ‌ణ్ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ న‌డిసంద్రంలో మునిగిన‌ట్టే అవుతుందంటున్నారు.
Tags:    

Similar News