ఇంట్లోనే ఈగల మోత.. వీధిలో పల్లకి మోత సంగతేంది కేసీఆర్?

Update: 2022-02-16 17:30 GMT
తెలంగాణ రాష్ట్రంను దాదాపుగా సెట్ చేసేశా.. ఇక చూపంతా జాతీయ రాజకీయమే.. దేశాన్ని బాగు చేయాలి. మోడీ అండ్ కో దుష్ట శక్తుల నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు అవసరమైతే యుద్ధం చేయటానికైనా సిద్ధమన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకు బయట రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలువురు సానుకూలంగా స్పందించటం.. ఫోన్లో చర్చలు షురూ చేయటం తెలిసిందే. జాతీయ స్థాయిలో మోడీ అండ్ కోపై ఫైట్ చేసేందుకు జట్టును సెట్ చేస్తున్న కేసీఆర్.. అందులో భాగంగా తొలుత మహారాష్ట్రకు పయనమవుతున్నారు.

ఈ నెల 20న ఆయన ముంబయికి వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో భేటీ కానున్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు మీద కస్సుముంటున్న ఆయన ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ఇంట్లో ఈగల మోత.. వీధిలో పల్లకి మోత అన్న సామెతకు చందంగా పరిస్థితి ఉంది. ఇటీవల కేసీఆర్ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని మార్చాలన్న వ్యాఖ్య చేయటంపై పలువురు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. మరోవైపు ఉద్యోగాల నోటిఫికేషన్ మీద కేసీఆర్ సర్కారు అనుసరిస్తున్న విధానాన్ని పలువురు తప్పు పడటం తెలిసిందే.

గతానికి భిన్నంగా ఇప్పుడు తెలంగాణలో నిత్యం ఏదో ఒక అంశం మీద రచ్చ నడుస్తూనే ఉంది. గతంలో కేసీఆర్ మీద గళం విప్పటానికి జంకే వారు సైతం వెనుకా ముందు చూడకుండా విరుచుకుపడుతున్నారు. ఇక.. ప్రజాసంఘాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన్ను విమర్శిస్తున్న కొందరు ప్రముఖుల మాటల్ని చూస్తే.. విషయం ఇట్టే అర్థం కావటమేకాదు.. ప్రభుత్వాధినేతగా ఆయన వైఫల్యాల్ని ఏకరువు పెడుతున్నారు.

‘‘రాజ్యాంగం మార్చాలన్న కేసీఆర్ మాటల్లో అంబేడ్కర్ పేరును కనుమరగు చేయడానికి. దేశంలో సామాజిక  న్యాయాన్ని హరించడానికి అన్నట్లుగా ఉన్నాయి. కేసీఆర్ అహంకారంగా.. అవగహన రాహిత్యంగా మాట్లాడుతారు. ప్రశ్నించే మీడియాపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. మీడియా సోదరులను బెదిరిస్తే ఒక్క జర్నలిస్ట్ సంఘం మాట్లాడక పోవడం బాదాకారం. సీఎం కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడినా అవే నిజాలుగా రాస్తున్నారు. 80 వేలు పుస్తకాలు చదివిన కేసీఆర్ రాజ్యాంగంలోని ప్రవేశిక కుడా చదవలేదు.  రిజర్వేషన్ల పై కనీస అవగాహన లేని వ్యక్తి సీఎం.  కొన్ని రాష్ట్రాల్లో ఎస్సిలు, ఎస్టీలు లేరు. అక్కడ రిజర్వేషన్లు ఉండవు. ఈ అవగాహన కూడా కెసిఆర్ కు లేదు. కేసిర్  హయాంలో స్థానిక సంస్థల్లో ఉన్న రిజర్వేషన్లు సగానికి సగం తగ్గించారు. పార్లమెంట్ లో పెండింగ్ లో మహిళల రిజర్వేషన్లు గురించి ఎందుకు చొరవ తీసుకోవడం లేదు’’ అని మంద క్రిష్ణ మాదిగ ప్రశ్నిస్తున్నారు.

రాజ్యాంగం మీద కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మేధావులుగా పేరున్న హరగోపాల్ లాంటి ప్రముఖులు పైతం మండిపడుతున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘రాజ్యాంగం  కొన్ని కులాలకే పరిమితం కాదు. దేశములో అందరి కోసం రాసింది. రాజ్యాంగాన్ని రక్షించుకోకుంటే మరిన్ని సమస్యలు ఖాయం. కేసీఆర్ ను ఇలాగే వదిలేస్తే రానున్న రోజుల్లో ఇలాంటి వ్యతిరేకులు మరింత రెచ్చి పోతారు. అందుకే కేసీఆర్ పై పోరాటానికి పార్టీలకు అతీతంగా కలిసి రావాలి. రాష్ట్ర పతి, ఉపరాష్ట్రపతి, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు.....రాజ్యాంగ బద్దంగా ఉన్న అన్ని కమిషన్లను కలుస్తాం’’ అని హరగోపాల్ పేర్కొన్నారు.

వీరే కాక పలు రాజకీయ పక్షాల నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు.  కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు తెలంగాణలో నిర్వహిస్తున్నట్లుగా ప్రజా సంఘాలు పేర్కొంటున్నాయి. ఆ షెడ్యూల్ ను చూస్తే..

-  20న అన్ని మహిళా సంఘాలతోరౌండ్ టేబుల్ సమావేశం

-  21 అన్ని విద్యార్థి సంఘాల సమావేశం

-  22 వికలాంగుల సమావేశం

-  23 న మేధావుల సమావేశం

-  24 బిసి సంఘాల సదస్సు

-  25 న ఎస్టీ సంఘాల ఆద్వర్యంలో సదస్సు

-  26న  మైమార్టీ సంఘాల సదస్సు

-  27న వరంగల్ లో  రాష్ట్ర స్థాయి మహాసభ
Tags:    

Similar News