భారత్‌లో ఎప్పుడు ఆర్థిక మాంద్యం వచ్చింది?

Update: 2022-08-05 14:30 GMT
రుతుప‌వ‌నాల మంద‌గ‌మ‌నం, ఆశించినంత‌గా వ‌ర్షాలు ప‌డ‌క‌పోవ‌డం, యుద్ధాలు, మాన‌వాళిని క‌బ‌ళిస్తున్న క‌రోనా వంటి వైర‌స్‌లు, ఇత‌ర వ్యాధులు ఆర్థిక మాంద్యానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. ప్ర‌పంచంలో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ అయిన అమెరికానే ప్ర‌స్తుతం ఆర్థిక మాంద్యంతో అల్లాడుతోంది.

దాదాపు రెండేళ్లు కరోనాతో అమెరికా విలవిల్లాడింది. ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు.. అక్కడే నమోదయ్యాయి. కరోనా సంక్షోభం తర్వాత గాడినపడుతుందనుకున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అధిక ధరలతో అల్లాడుతోంది. ద్రవ్యోల్భణాన్ని నియంత్రించేందుకు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయాలు మార్కెట్లను మరింత సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయ‌ని చెబుతున్నారు. ఈ ఏడాది, వచ్చే సంవత్సరం అమెరికా వృద్ధిరేటును కుదించి, గోల్డ్‌మన్‌శాక్స్‌ ఆర్థిక వేత్తలు అంచనాలు వెలువరించడం కూడా ఆందోళన కలిగిస్తోంది.

మ‌న‌దేశంలోనూ ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న‌దేశంలో నాలుగుసార్లు ఆర్థిక మాంద్యం సంభ‌వించింది. ఇది అధికారిక లెక్కల ప్ర‌కార‌మే సుమా. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతున్న‌దాని ప్ర‌కారం.. భార‌త‌దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మొత్తం నాలుగుసార్లు భార‌త‌దేశం ఆర్థిక మాంద్యం బారిన‌ప‌డింది. ఆర్బీఐ చెబుతున్న‌దాని ప్ర‌కారం భార‌త‌దేశంలో 1958, 1966, 1973, 1980లలో ఆర్థిక మాంద్యం వచ్చింది.

1957-58లో తొలిసారి స్వతంత్ర భారత దేశంలో ఆర్థిక మాంద్యం వచ్చింది. అప్పట్లో వృద్ధి రేటు మైనస్‌ల్లోకి ప‌డిపోయింది. మైనస్ 1.2గా నమోదై తీవ్ ఆందోళ‌న రేకెత్తించింది. ఎగ‌మతులు కంటే దిగుమ‌తులు ఎక్కువ కావ‌డం, ఇందుకోసం భారీగా వ్య‌యం చేయాల్సి రావ‌డం ఆర్థిక మాంద్యానికి కార‌ణ‌మైంది. అప్ప‌ట్లో భార‌త ఎగుమ‌తులు, దిగుమ‌తులు స‌మానంగా ఉండటం గ‌మ‌నార్హం.

ఇక 1965-66లో దేశంలో తీవ్రమైన కరవు సంభ‌వించింది. రుతుప‌వ‌నాలు మంద‌గించాయి. భార‌త వ్య‌వ‌సాయానికి మూలాధార‌మైన నైరుతి రుత‌ప‌వ‌నాలు ముఖం చాటేయ‌డంతో ఆశించినంతగా పంట‌లు పండ‌లేదు. దీంతో ఆహార ధాన్యాల‌కు కొర‌త ఏర్ప‌డింది. వాటి ధ‌ర‌లు హెచ్చాయి. దీంతో భారత్ మ‌రోసారి ప్ర‌తికూల వృద్ధిరేటు న‌మోదు చేసింది. ఆ ఏడాది ఏకంగా మైనస్ 3.66 శాతంగా వృద్ధి రేటు నమోద‌వ్వ‌డం గ‌మ‌నార్హం.

ఆ తర్వాత 1972-73లో అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం భార‌త్ లో ఆర్థిక మాంద్యానికి కార‌ణంగా నిలిచింది. ఇజ్రాయెల్ కు మ‌ద్ద‌తిచ్చిన దేశాల‌కు అర‌బ్ పెట్రోలియం ఎగుమ‌తి దేశాల స‌మాఖ్య (ఓఏపీఈసీ) చమురు దిగుమతులను ఆపేసింది. దీంతో చ‌మురుకు కొర‌త ఏర్ప‌డింది. చమురు ధ‌ర‌లు భ‌గ్గుమ‌న్నాయి. ప్ర‌పంచ మార్కెటులో చమురు ధ‌ర‌లు ఏకంగా 400 శాతానికి పెరిగాయి. దీంతో 1972-73లోనూ భారత్ ప్ర‌తికూల వృద్ధిరేటును న‌మోదు చేసింది. మైన‌స్ 0.3 శాతం ప్ర‌తికూల వృద్ధిరేటు న‌మోదైంది.

ఇక నాలుగోసారి 1980లో ఇరాన్‌లో విప్లవం వల్ల ప్రపంచంలోని చాలా దేశాలకు చమురు దిగుమతులు నిలిచిపోయాయి. ఎందుకంటే ప్ర‌పంచంలో చ‌మురును అత్య‌ధికంగా ఉత్ప‌త్తి చేస్తున్న దేశాల్లో ఇరాన్ కూడా ఉండ‌ట‌మే దీనికి కార‌ణం. దీంతో అంతర్జాతీయ విపణిలో మళ్లీ చమురు ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి. భారత్‌లాంటి వ‌ర్థ‌మాన దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. చమురు దిగుమతుల బిల్లు రెట్టింపు అయ్యింది. దీంతో 1980లో కూడా మైనస్ 5.2 శాతంగా వృద్ధి రేటు నమోదైంది.
Tags:    

Similar News