హుజూరాబాద్ నగరా మోగేది అప్పుడేనా?

Update: 2021-07-04 13:48 GMT
కేంద్రంలోని బీజేపీ ఇటీవ‌ల తీసుకున్న నిర్ణ‌యం ఒక‌టి.. దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. ఇత‌ర పార్టీల‌ను డైల‌మాలో ప‌డేసింది. మ‌రికొంద‌రిని ఫుల్లుగా టెన్ష‌న్ కు గురిచేస్తోంది. అందులో ముఖ్య‌మంత్రులు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కీ ఆ విష‌యం ఏమంటే.. ఇప్ప‌ట్లో ఉప ఎన్నిక‌లు లేవు అని సంకేతాలు ఇవ్వ‌డం!

రెండు రోజుల క్రిత‌మే.. ఉత్త‌రాఖండ్ సీఎం తీర‌థ్ సింగ్ రావ‌త్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీనికి కార‌ణం ఏమంటే.. ఆయ‌న ఎమ్మెల్యే కాకుండానే ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. రాజ్యాంగం ప్ర‌కారం.. ఎమ్మెల్యేగా గెల‌వ‌క‌పోయిన‌ప్ప‌టికీ సీఎం కావొచ్చు. కానీ.. ఆరు నెల‌ల్లో రాష్ట్రంలోని ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించాల్సి ఉంది. లేదంటే..ఎమ్మెల్సీగానైనా ఎన్నిక కావాలి. అలా కాని ప‌క్షంలో ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఆటోమేటిగ్గా ర‌ద్దైపోతుంది.

ఇదే కార‌ణంతోనే తీర‌థ్ సింగ్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇప్ప‌ట్లో ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించే అవ‌కాశం లేద‌ని చెప్పి, ఆయ‌న్ను త‌ప్పించింది బీజేపీ అధిష్టానం. క‌రోనా కార‌ణంగానే కేంద్రం ఈ త‌ర‌హా ఆలోచ‌న చేస్తోంద‌నే సంకేతాలు పంపిస్తోంది. ఇదే నిజ‌మైతే అప్పుడు.. మిగిలిన రాష్ట్రాల్లోనూ ప‌రిస్థితి ఇలాగే ఉంటుంది క‌దా? అనే చ‌ర్చ మొద‌లైంది.

తెలంగాణ‌లో మాజీ మంత్రి ఈట‌ల ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో.. హుజూరాబాద్ లో ఉప ఎన్నిక జ‌ర‌గాల్సి ఉంది. అధికార టీఆర్ఎస్ తోపాటు విప‌క్ష బీజేపీకి ఈ ఎన్నిక అత్యంత ప్ర‌తిష్టం కానుంది. ఈట‌ల క‌మ‌లం గూటికి చేర‌డంతో.. త‌న బ‌లం నిరూపించుకోవ‌డానికి ఆయ‌న గెలిచి తీరాలి. అదే స‌మ‌యంలో.. టీఆర్ఎస్ బ‌లం చెక్కు చెద‌ర‌లేద‌ని చాట‌డానికి గులాబీ గెలిచి తీరాలి. ఈ విధంగా.. రెండు పార్టీలూ హుజూరాబాద్ లో మ‌కాం వేశాయి. ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఉప ఎన్నిక జ‌రిగే అవ‌కాశం లేద‌నే వార్త క‌ల‌క‌లం రేపుతోంది.

ఈ వార్త బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీని సైతం ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో మ‌మ‌తా ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. అయినా.. ఆమె ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టారు. ఉప ఎన్నిక‌లో గెలిచి తీరుతాన‌ని ప‌గ్గాలు అందుకున్నారు. మ‌రి, క‌రోనా నేప‌థ్యంలో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌క‌పోతే.. ఆమె కూడా రాజీనామా చేయాల్సి వ‌స్తుంది. దీంతో.. ఏం జ‌రుగుతుందో అనే ఉత్కంఠ అంద‌రిలోనూ నెల‌కొంది.

జరుగుతున్న ప్రచారం ప్రకారం.. వచ్చే  ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలతో కలిపి అన్ని ఉప ఎన్నికలూ నిర్వహించాలని చూస్తోందట కేంద్రం. మ‌రికొన్ని రోజులు గ‌డిస్తేగానీ క్లారిటీ వ‌చ్చేలా లేదు.
Tags:    

Similar News