పోల‌వ‌రం పూర్తికి ఇంకెన్ని ద‌శాబ్దాలో? కేంద్రం భారీ దెబ్బ‌!

Update: 2022-02-09 16:36 GMT
ఏపీ ప్ర‌జ‌ల జీవ‌నాడి.. పోల‌వ‌రం బ‌హుళార్థ‌సాథ‌క ప్రాజెక్టు ఎప్పుడు పూర్త‌వుతుంది?  గ‌త ప్ర‌భుత్వం 2018కినీళ్లిస్తామ‌ని చెప్పింది. త‌ర్వాత వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం 2020 చివ‌రి నాటికి నీటికి ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని తెలిపింది. త‌ర్వాత 2021కి టైం మార్చింది. ఇప్పుడు 2022కూడా వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ.. ఈ ప్రాజెక్టు ప‌రిస్థితి త్రిశంకు స్వ‌ర్గంలో ఊగిస‌లాడుతూనే ఉంది. ప్ర‌స్తుత ప్ర‌బుత్వ హ‌యాంలో.. నిర్మాణం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. డ్యాం నిర్మాణ పనులు ఇప్పటికే రెండు సార్లు గడువు ముగియగా, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు.

పోలవరం నిర్మాణానికి ఇప్పుడు మ‌రింత పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర‌ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించే వాటాను తగ్గించుకుంది. జాతీయ నీటిపారుదల ప్రాజెక్టులకు కొత్త నిబంధనలను నిర్దేశిస్తూ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది, ఇకపై అన్ని జాతీయ నీటిపారుదల ప్రాజెక్టులకు, భారత ప్రభుత్వం 60 శాతం ఆర్థిక వనరులను అందజేస్తుంది.  మిగిలిన వాటిని సంబంధిత రాష్ట్రాలు భ‌రించాల‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో కీల‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం ప‌నులు ముందుకు సాగ‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే. రాష్ట్ర ప్ర‌భుత్వం దీనిపై పెట్టుబడులు పెట్టే ప‌రిస్థితిలో క‌నిపించ‌డం లేదు.

వాస్తవానికి పోల‌వ‌రం ప్రాజెక్టుకు కేంద్రం 90 శాతం నిధులు ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. అయితే.. ఏళ్లు గ‌డిచినా.. నిధుల విష‌యంలో మెలిక‌లు పెడుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా.. దీనిలో 30 శాతానికి కోత పెట్టింది. అంటే ఇక‌, 60 శాతం నిధులు మాత్ర‌మే కేంద్రం ఇవ్వ‌నుంది. ఈ మేర‌కు కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి అన్ని రాష్ట్రాల‌కూ లేఖ‌లు రాశారు. దీనిలో ఆంద్ర‌ప్ర‌దేశ్ కూడా ఉండడం గ‌మ‌నార్హం. అంతేకాదు.. ఈ కొత్త మార్గ ద‌ర్శ‌కాలం ప్ర‌కారం.. రాష్ట్రాలు ముందుగా ఆయా ప్రాజెక్టుల‌కు నిధులు కేటాయించిన త‌ర్వాత‌.. ఖ‌ర్చుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను స‌మ‌ర్పిస్తేనే కేంద్రం త‌న వాటా  నిధులు  అంద‌జేస్తుంది.  

ఈ స‌వ‌ర‌ణ ప్ర‌తిపాద‌న‌లు.. ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న‌.. భ‌విష్య‌త్తులో నిర్మాణం చేప‌ట్ట‌నున్న అన్ని ప్రాజెక్టుల‌కు వ‌ర్తించ‌నుంది. దీనిలో పోల‌వ‌రం కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. ఇక‌పై ఎంతో ప్రాధాన్యం.. అవ‌స‌రం ఉంటే త‌ప్ప‌.. కేంద్ర ప్ర‌భుత్వం ప్రాజెక్టుల‌ను చేప‌ట్టే ప‌రిస్థితి ఉండ‌దు. అయితే.. ఈ తాజా నిబంధ‌న‌ల నుంచి ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు, ఉత్త‌రాఖండ్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, కేంద్ర పాలిత ప్రాంతాలైన జ‌మ్ము కశ్మీర్‌, ల‌ద్దాక్‌ల‌కు మిన‌హాయించ‌డం గ‌మ‌నార్హం.  

తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న స‌మ‌యం మించి.. మ‌రింత ఆల‌స్య మయ్యే అవ‌కాశం ఉంటుంది. ఎందుకంటే.. కేంద్ర ప్ర‌భుత్వం త‌ను ఇచ్చే వాటాల‌ను త‌గ్గించుకోవ‌డంతో దీనికి సంబంధించిన నిధుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం కేటాయించే అవ‌కాశం లేదు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే.. భారీ ఎత్తున అప్పుల్లో ఉండ‌డ‌మే కార‌ణంగా క‌నిపిస్తోంది. పోల‌వ‌రం పూర్తికి మ‌రింత గా అప్పులు చేయాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే అప్పులు పుట్ట‌క అల్లాడుతున్న ప్ర‌భుత్వానికి పోల‌వ‌రం మ‌రింత భారంగా మార‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ఆర్థిక నిపుణులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 
Tags:    

Similar News