ఆ ముఖ్యమంత్రి మాదిరి..తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎప్పుడు చేస్తారో?

Update: 2021-10-10 04:35 GMT
ఒకరికొకరు ఏ మాత్రం తీసిపోకుండా.. తాము ఉన్నదే ప్రజల కోసమన్నట్లుగా మాటలు చెప్పటం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నోటి నుంచి తరచూ వినిపిస్తూ ఉంటుంది. ప్రజల మీద అంత ప్రేమ ఉన్న వారు.. కొన్ని విషయాల్లో మిగిలిన ముఖ్యమంత్రులకు భిన్నంగా వ్యవహరించొచ్చు కదా? అని ప్రశ్నిస్తే మాత్రం సైలెంట్ అయిపోతారు. ఎక్కడిదాకానో ఎందుకు.. ఈ మధ్యనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది మొదలు.. ఇప్పటివరకు తమిళనాడు ముఖ్యమంత్రులు ఎవరో వ్యవహరించని రీతిలో వ్యవహరిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి స్టాలిన్.

తమిళనాడు రాజకీయాలు ఎంతలా ఉంటాయో తెలిసిందే. ప్రత్యర్థి పార్టీని కలలో కూడా సానుకూల వ్యాఖ్య చేయటానికి ఇష్టపడరు. అలాంటిది స్టాలిన్ పుణ్యమా అని ఆ సీన్ మారిపోతోంది. ప్రత్యర్థి పార్టీల వారు సైతం స్టాలిన్ తీసుకుంటున్న నిర్ణయాలకు ఫిదా అవుతున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే.. తమిళ ప్రజలకు కొత్త తరహా రాజకీయ అనుభవాన్ని ఆయన పరిచయం చేస్తున్నారని చెప్పాలి. తాజాగా ఆయన తన కాన్వాయ్ లోని వాహన శ్రేణిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ప్రజలకు ఇబ్బంది లేకుండా.. టాఫిక్ ఎక్కడా ఆపకుండా ఆయన వాహనాలు వెళ్లేలా ఆయన చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన కాన్వాయ్ లో పదికి పైగా వాహనాలు ఉండేవి. నగరాల్లో ఆయన పర్యటించే వేళలో.. తన వాహన శ్రేణిని సగానికి తగ్గిస్తూ నిర్ణయం తసీుకున్నారు. అంతేకాదు.. ఆయన ప్రయాణించే మార్గాల్లో సీఎం కాన్వాయ్ వస్తుందని వాహనశ్రేణిని ఆపేయటం అన్నది ఇకపై ఉండదు. ప్రజలవాహనాలతోకలిసి ఆయన కాన్వాయ్ సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కొత్త విధానం ఈ రోజు (ఆదివారం) నుంచి ప్రారంభం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులు తమ కాన్వాయ్ వెళ్లే వేళలో.. ప్రజల వాహనాల్ని నిలిపివేయటం తెలిసిందే.

 ఏపీ సీఎం వాహన శ్రేణి రోడ్డు మీదకు వచ్చిందంటే.. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్న పరిస్థితి. ఆ మాటకు వస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ ప్రగతిభవన్ నుంచి ఫాంహౌస్ కు వెళ్లి రావటం తరచూ ఉంటుంది. ఆ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో వాహనాల్ని నిలిపివేసి.. సీఎం కాన్వాయ్ ట్రాఫిక్ లో చిక్కుకోకుండా జాగ్రత్తలు తీసుకోవటం తెలిసిందే. దీని కారణంగా.. ప్రజలు తీవ్ర అవస్థలకుగురవుతున్నారు. ప్రజా సంక్షేమం కోసం.. వారి బాగోగులు నిజంగా కాక్షించే ముఖ్యమంత్రులు ఎవరైనా.. తమిళనాడు సీఎం స్టాలిన్ మాదిరి వ్యవహరిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. ఆయన్ను ఫాలో అయ్యే ధైర్యం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేస్తారా?
Tags:    

Similar News