కీలక జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే ఎక్కడ?

Update: 2022-10-25 05:18 GMT
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు విజయ ఢంకా మోగించాలని వైఎస్సార్సీపీ ఉవ్విళ్లూరుతోంది. లెక్కకు మిక్కిలిగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను విజయ తీరాలకు చేరుస్తాయని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నుంచి చోటా నేతల వరకు గట్టిగా నమ్ముతున్నారు. 175కి 175 అసెంబ్లీ సీట్లు సాధించాలని వైఎస్‌ జగన్‌.. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు, కార్యకర్తలకు ఉద్భోదిస్తున్నారు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు ఇంటి ఇంటికీ తిరుగుతున్నారు.

ఆయా నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి ఈ మూడేళ్లలో ప్రభుత్వం చేసిన మేలును ఎమ్మెల్యేలు వివరిస్తున్నారు. పనిలో పనిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాసిన లేఖను కూడా ప్రజల చేతుల్లో పెడుతున్నారు.  
 
ఈ నేపథ్యంలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సీఎం జగన్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడే వారి పైన చర్యలు మొదలు పెట్టారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై వేటు వేస్తున్నారు. మరోవైపు ప్రతి నియోజకవర్గం నుంచి ఎంపిక చేసిన వంద మంది కార్యకర్తలతో మాట్లాడుతున్నారు.

అయితే కొన్ని చోట్ల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సరిగా జరగడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ చాలా గట్టిగా చెబుతున్నారు. ఇప్పటికే పలు సమావేశాల్లో సరిగా ఈ కార్యక్రమాన్ని చేయనివారిపైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి.

ఈ నేపథ్యంలో తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులోనూ వైసీపీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస నాయుడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని లైట్‌ తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి.

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పడిన నిడదవోలులో నాటి ఎన్నికల్లో టీడీపీ నుంచి బూరుగుపల్లి శేషారావు గెలుపొందారు. 2014లోనూ టీడీపీ అభ్యర్థి బూరుగపల్లి శేషారావే విజయం సాధించారు. ఇక 2019లో మాత్రం వైసీపీ గాలిలో శ్రీనివాస నాయుడు గెలిచారు.


కానీ అప్పటి నుంచి శ్రీనివాస నాయుడు తన వ్యాపారాలపైనే దృష్టి పెట్టారని అంటున్నారు. నియోజకవర్గ ప్రజలకు, వైసీపీ నేతలకు, శ్రేణులకు అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా తన సొంత వ్యాపారాలపైనే దృష్టి సారించారని నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారని అంటున్నారు.


ఎన్నికల సమయంలో ఇచ్చిన కనీస హామీలను కూడా నెరవేర్చలేకపోయారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పోనీ ఎమ్మెల్యే తన వ్యాపారాల్లో బిజీగా ఉన్నా తన తరఫున పనులు చక్కబెట్టడానికి ఎవరైనా ప్రతినిధిని పెట్టారా అంటే అదీ లేదని అంటున్నారు.  

గడప గడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు పాల్గొనడం కూడా తక్కువేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గం ఏర్పడ్డాక వరుసగా రెండుసార్లు గెలుపొందిన టీడీపీ మరోమారు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.

వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున బూరుగుపల్లి శేషారావే పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇక వైసీపీ వచ్చే ఎన్నికల్లో నిడదవోలులో నెగ్గాలంటే మాత్రం కొత్త అభ్యర్థిని పెట్టుకోవాల్సిందేననే చర్చ నియోజకవర్గంలో సాగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News