ఆ ఎనిమిది మంది ఎంపీలు ఏమ‌య్యారు? వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం!

Update: 2020-09-21 13:00 GMT
ప్ర‌స్తుతం పార్ల‌మెంటు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఎంపీలు ఢిల్లీలో క‌దా.. ఉండాలి! రాష్ట్రం త‌ర‌ఫున క‌దా.. పోరాడాలి..! మీడియా స‌మావేశాలు పెట్టాలి! కానీ.. లెక్క‌కు మిక్కిలిగా ఉన్న వైసీపీ ఎంపీల్లో 8 మంది జాడ క‌నిపించ‌డం లేదు. వారు ఎక్క‌డ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అస‌లు ఢిల్లీలోనే ఉన్నారా? లేక‌.. ఇంటికి ప‌రిమిత‌మ‌య్యారా? ఇవ‌న్నీ కాక‌.. ఢిల్లీలోనే ఉండి ప్ర‌త్యేక అజెండాతో ఏమైనా ప‌నిచేస్తున్నారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనిపై సీఎం జ‌గ‌న్ కూడా ఆరా తీస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ ప‌రిణామాల‌తో అస‌లు వైసీపీ ఎంపీలు ఎంత మంది ఉన్నారు? ఏం చేస్తున్నార‌నే విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అత్యంత కీల‌క‌మైన పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. ఈ స‌మావేశాల్లో ఏపీకి సంబంధించిన గ‌ళాన్ని బ‌లంగా వినిపించాల‌ని సీఎం జ‌గ‌న్‌.. త‌న పార్టీ ఎంపీల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ పెట్టి మ‌రీ సూచించారు. పేరు పేరునా ఆయ‌న ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్ర‌ధానంగా.. పోల‌వ‌రం పెండింగు నిధులు, - మండ‌లి ర‌ద్దు - జీఎస్టీ బ‌కాయిలు - వెనుక బ‌డిన జిల్లాల అభివృద్ది నిధులు, -ప్ర‌త్యేక హోదా.. వంటి ముఖ్యమైన అంశాల‌పై పార్ల‌మెంటులో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి.. సాధించేలా ప్ర‌య‌త్నం చేయాల‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ మాట్లాడాల‌ని కూడా జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు.

మ‌రి అధినేత జ‌గ‌న్ ఆదేశాల‌ను వైసీపీ ఎంపీలు పాటిస్తున్నారా? ఢిల్లీలో జ‌గ‌న్ ఆదేశాల‌కు అనుగుణంగా బ‌ల‌మైన గ‌ళం వినిపిస్తున్నారా? అంటే.. సందేహ‌మే తెర‌మీదికి వ‌స్తోంది. ఎందుకంటే.. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో మొత్తం 25 ఎంపీ స్థానాల‌కు గాను వైసీపీ 22 స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కింది. అంటే.. 22 మంది లోక్‌ స‌భ స‌భ్యులు ఉన్నారు. వీరిలో తిరుప‌తి ఎంపీ దుర్గాప్ర‌సాద్ ఇటీవ‌ల మృతి చెందారు. దీంతో ఈ సంఖ్య 21కి చేరింది. వీరంతా.. పార్ల‌మెంటులో క‌నిపించాలి. అయితే, వీరిలో ముగ్గురికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. స‌త్య‌వ‌తి..(అన‌కాప‌ల్లి) - గొట్టేటి మాధ‌వి(అర‌కు) - రంగ‌య్య‌(అనంతపురం) క‌రోనా నేప‌థ్యంలో పార్ల‌మెంటుకు వెళ్ల‌డం లేదు.

ఏలూరు పార్ల‌మెంటు స‌భ్యుడు.. కోట‌గిరి శ్రీధ‌ర్‌.. అమెరికాలోనే ఉండిపోయారు. దీంతో లోక్‌ స‌భ స‌భ్యుల సంఖ్య 17కు చేరింది. ఇక‌, వీరిలోనూ న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఎగ‌స్పార్టీగా మారిపోయారు. దీంతో లోక్‌ స‌భ‌లో వైసీపీకి ఇప్ప‌టికిప్పుడు ఉన్న స‌భ్యుల సంఖ్య 16 - ఇక‌, రాజ్య‌స‌భ‌లో ఇటీవ‌ల ఎన్నికైన స‌భ్యుల‌తో క‌లిపి మొత్తంగా ఆరుగురు ఉన్నారు. దీంతో మొత్తం స‌భ్యుల సంఖ్య 22. మ‌రి వీరంతా ఢిల్లీలో ఉన్నారా? పార్ల‌మెంటుకు వెళ్తున్నారా? ఏపీకి సంబంధించిన స‌మ‌స్య‌లపై పోరాడుతున్నారా? అంటే.. ఇటీవ‌ల గాంధీ విగ్ర‌హం వ‌ద్ద జ‌రిగిన రాజ‌ధాని భూముల‌పై సీబీఐ విచార‌ణ‌కు సంబంధించిన కార్య‌క్ర‌మంలో కేవ‌లం 14 మంది పాల్గొన్నారు.

మ‌రి మిగ‌తా 8 మంది ఎంపీల ప‌రిస్థితి ఏంటి? వారు ఎక్క‌డ ఉన్నారు? పార్టీకి దూరంగా ఉంటున్నారా? లేక ఏదైనా సొంత అజెండా పెట్టుకున్నారా? ఇప్పుడు ఈ సందేహాలే.. అటు ఢిల్లీలోనూ - ఇటు ఏపీలోనూ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. మ‌రోప‌క్క వీరి విష‌యంపై సీఎం జ‌గ‌న్ కూడా ఆరా తీస్తున్నార‌ని స‌మాచారం.

ఇదిలావుంటే - వీరేమైనా.. బీజేపీతో ట‌చ్‌ లో ఉన్నారా? అనే కోణంలోనూ వైసీపీ కూపీలాగుతున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ ఎనిమిది మంది ఎంపీల క‌థ.. ఎటు మ‌లుపుతిరుగుతుందో చూడాలి.



Tags:    

Similar News