టెక్నాలజీ యుద్ధం ఎటూ వైపు దారితీస్తుందో..!

Update: 2022-12-17 05:30 GMT
ప్రపంచవ్యాప్తంగా సెమికండక్టర్ ఇండస్ట్రీలో చైనాదే ఆధిపత్యం కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ల నుంచి ఆయుధాల తయారీ వరకు కూడా సెమికండక్టర్ (చిప్స్) ను విరివిగా వినియోగిస్తున్నారు. అయితే అమెరికా చైనా ఆధిపత్యానికి గండికొట్టే ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా టూల్స్.. సాప్ట్ వేర్లను వాడుతూ చిప్ లను తయారు చేస్తున్న కంపెనీలు వాటిని చైనాకు ఎగుమతి చేయకుండా ఇటీవల నిర్ణయం తీసుకుంది.

దీని వల్ల ఇకపై అమెరికా సాప్ట్ వేర్.. టూల్స్ వినియోగించిన చిప్ లను ప్రపంచంలో ఎక్కడ తయారు చేశారన్నది సంబంధం లేకుండా ఎగుమతులు చేయాలంటే మాత్రం సదరు కంపెనీలు తప్పనిసరిగా లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. గత అక్టోబర్ నెలలో వైట్ హౌస్ తీసుకొచ్చిన ఈ నిర్ణయం వల్ల చైనీస్ చిప్ కంపెనీల్లో పని చేసే అమెరికన్ పౌరులు.. గ్రీన్ కార్డు హోల్టర్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే అమెరికా ఆంక్షలపై చైనా ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)లో ఫిర్యాదు చేసింది. అమెరికా అధ్యక్షుడిగా బెడైన్ పదవీకి వచ్చాక అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా చైనా చేసిన తొలి ఫిర్యాదు ఇదేనని కావడం గమనార్హం. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని సాధించేందుకు ఎగుమతులపై ఆంక్షలు పెడుతూ వాణిజ్య నిబంధనలను ఉల్లంఘిస్తోందని చైనా ఆరోపిస్తోంది. ఈ వ్యవహారం వల్ల గ్లోబల్ ఇండస్ట్రియల్ సప్లయి చెయిన్‌లో అస్థిరత్వమవుతుందని చైనా ఆందోళన వ్యక్తం చేసింది.

చైనా చేస్తున్న ఆరోపణలను అమెరికా కొట్టిపారేస్తుంది. దేశ భద్రతకు ముప్పు కలిగించే సమస్యను పరిష్కరించుకునేందుకు ట్రేడ్ బాడీ సరైనది కాదని వెల్లడించింది. అమెరికా భద్రతా దృష్ట్యా రీత్య అధునాతన టెక్నాలజీల యాక్సస్‌ను నిలిపివేసే చర్యలు తీసుకున్నట్లు అమెరికా ఎక్స్‌పోర్టు అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన కామర్స్ అసిస్టెంట్ సెక్రటరీ థియా కెండ్లర్ తెలిపారు.    

చైనా ద్వారా కొనుగోలు చేసిన సెన్సిటివ్ టెక్నాలజీలను మిలటరీ కార్యకలాపాల్లో వాడకుండా ఉండేందుకు అమెరికా ఇలా చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే దీనిని చైనా మాత్రం ‘టెక్నాలజీ టెర్రరిజం’ అంటూ అభివర్ణిస్తుంది. అమెరికా ఎగుమతులు ఆంక్షలు విధించడంపై చిప్‌లను తయారు చేసే తైవాన్.. సింగపూర్.. దక్షిణ కొరియా వంటి ఆసియా దేశాలూ సైతం ఆందోళన చెందుతున్నాయి.

డబ్ల్యూటీవోకు చైనా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అమెరికా సమస్యను పరిష్కరించడానికి 60 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ లోపల అమెరికా సమస్యను పరిష్కరించలేకపోతే  చైనా ఈ కేసును సమీక్షించాలని ప్యానల్‌కు అభ్యర్థన పెట్టుకునేందుకు అనుమతి లభించనుంది. ఇదిలా ఉంటే జపాన్.. నెదర్లాండ్ సైతం చైనా ఎగుమతులపై నిషేధం విధించేలా కన్పిస్తున్నాయి. ఏది ఏమైనా చిప్ టెక్నాలజీలో పైచేయి సాధించేందుకు అమెరికా-చైనాలు ఆంక్షలకు దిగుతుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News