వైర‌స్‌కు నివార‌ణ మందుకు డ‌బ్ల్యూహెచ్ఓ గ్రీన్ సిగ్న‌ల్‌

Update: 2020-06-23 17:30 GMT
వైర‌స్ రోగుల పాలిట సంజీవనిగా స్టెరాయిడ్ డెక్సామిథాసోన్ భావిస్తోంది. ఈ మందు వైర‌స్ బాధితుల‌కు వేయ‌వ‌చ్చ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ) తెలిపింది. ఈ క్ర‌మంలోనే ఆ మందుల ఉత్పత్తిని పెంచాలని డ‌బ్ల్యూహెచ్ఓ సోమవారం ఆయా సంస్థ‌ల‌కు సూచించింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వైరస్ రోగులకు ఈ ఔషధాన్ని వాడడంతో మరణాల సంఖ్య తగ్గుతుందని డబ్ల్యూహెచ్‌ఓ వివ‌రించింది. ఈ మందు వైర‌స్ నివార‌ణ‌కు వినియోగించ‌వ‌చ్చ‌ని ప్ర‌క‌టించింది.

దీనిపై స్పందించిన డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడారు. బ్రిటీష్‌ ట్రయల్‌లో స్టెరాయిడ్ డెక్సామిథాసోన్ ఔషధం మంచి ఫలితాన్ని ఇచ్చినట్లు నిరూపితమైంద‌ని వివ‌రించారు. దీంతో డెక్సామిథాసోన్‌కు ఇప్పటికే డిమాండ్ బాగా పెరిగిందని.. ఉత్పత్తిని వేగవంతం చేయాలని సూచించారు. ఈ మందును గ‌త వారం ఆక్స్‌ఫర్డ్ విశ్వ‌విద్యాల‌య బృందం నేతృత్వంలోని పరిశోధకులు ప్ర‌యోగంగా ప‌రీక్షించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 2 వేల మంది రోగులకు ఈ ఔషధం ఇవ్వ‌గా మరణాల సంఖ్యను 35 శాతం తగ్గించినట్లు గుర్తించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. పరిశోధనలు ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నప్పటికీ.. డెక్సమిథాసోన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల ప్రాణాలను రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉందని తెలిపారు. అందుకే ఈ ఔషధం వాడటానికి అనుమతిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఈ ఔషధ ఉత్పత్తిని పెంచాల‌ని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా.. దీని అవసరం ఉన్న దేశాలకు సమానంగా పంపిణీ చేయడం.. ఎక్కువ అవసరమైన చోట దృష్టి సారించడం వంటి వాటిపై దృష్టి సారించాల‌ని తెలిపారు.

డెక్సామిథాసోన్ అనే ఔష‌ధం 60 సంవత్సరాలుగా ఉంది. మంటను తగ్గించడానికి ఈ మందు ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుతం వైర‌స్‌తో తీవ్రమైన అనారోగ్యానికి గురైన రోగులకు మాత్రమే డెక్సామిథాసోన్ వాడాలని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. తేలికపాటి వైర‌స్ లక్షణాలు ఉన్న రోగులకు ఈ ఔషధం పని చేస్తుందనడానికి ఎటువంటి ఆధారం లేదు. హాని కలిగించే ప్రమాదం కూడా ఉంది అని టెడ్రోస్ హెచ్చరించారు. దీని సరఫరాలో అధిక సంఖ్యలో వైరస్ రోగులు ఉన్న దేశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటన ఫలితంగా నాణ్యత లేని లేదా తప్పుడు ఉత్పత్తులు మార్కెట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉండ‌డంతో ఉత్పత్తిదారులు నాణ్యతకు సంబంధించి హామీ ఇవ్వాల‌ని కోరారు.
Tags:    

Similar News