ఎవరీ హిడియో కొజిమా? జక్కన్న షేర్ చేసిన ఈ జపాన్ ప్రముఖుడెవరు?

Update: 2022-10-22 04:40 GMT

ప్రేక్షకుల మనసుల్ని దోచే సినిమాల్ని చాలామంది దర్శకులు తీస్తుంటారు. సినిమా విడుదలయ్యాక ఆ మూవీ విజయవంతమైతే దాన్ని ఆస్వాదిస్తారు. అంతేకానీ.. కొత్త మార్కెట్ ఓపెన్ అయ్యేలా ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవటం.. దానికి అనుగుణంగా తన సినిమాకు ప్రచారం జరిగేలా వ్యూహాల్ని అమలు చేయటం.. అందుకు అవసరమైన ప్రముఖుల్ని కలవటం లాంటివి చాలామంది చేయరు. మూడు.. నాలుగేళ్లకు ఒక సినిమా చేసినా.. దాన్ని ఎంతవరకు పిండి.. సొమ్ము చేసుకోవచ్చో.. అంత పిండేసే లెక్కలు దర్శక ధీరుడు రాజమౌళికి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి.

తాను తీసిన ఆర్ఆర్ఆర్ మూవీని తాజాగా జపాన్ లో విడుదల చేసిన రాజమౌళి.. సినిమాను ప్రచారం చేసుకునేందుకు చిత్ర టీంతో కలిసి జపాన్ లో సందడి చేస్తున్న వైనం తెలిసిందే. సినిమా విడుదలైన ఏడు నెలల తర్వాత మరో భాషలో సినిమాను డబ్ చేసి.. దానికి గ్రాండ్ ఓపెనింగ్ కు ప్లాన్ చేయటం చూస్తే.. జక్కన్న మార్కెటింగ్ స్కిల్స్ ఎంతన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. సుమారు రూ.550కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ.. ఇప్పటికే రూ.1100 కోట్లకు పైనే కలెక్షన్లను కొల్లగొట్టింది.

తాజాగా జపనీస్ లో ఈ మూవీని విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు రాజమౌళి. ఈ సందర్భంగా తన సినిమాను జపాన్ లో బాగా మాట్లాడుకునేలా చేసేందుకు ఆయన వేస్తున్న ఎత్తులు.. తీస్తున్న అస్త్రాల్ని చూస్తున్నప్పుడు.. ఆయన తెలివిని చూసి వావ్ అనాల్సిందే. తాజాగా జపాన్ కు చెందిన ప్రముఖుడు హిడియో కొజిమాతోకలిసి దిగిన ఫోటోను దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇతగాడి గురించి.. ఇతడి గొప్పతనం గురించి తెలిసిన వారంతా రాజమౌళి ఇంటెలిజెన్స్ కు వావ్ అనకుండా ఉండలేరు.

ఇంతకీ ఈ హిడియో కొజిమా ఎవరు? జపాన్ లో అతనెంత తోపు? లాంటి ప్రశ్నలకు సమాధానాల్ని వెతికితే.. అతడికి ఆ దేశంలో ఉన్న పలుకుబడి.. ఆర్ఆర్ఆర్ కు అదనపు పెట్టుబడిగా మారినట్లే. జపాన్ లో ఈ శుక్రవారం ఆర్ఆర్ఆర్ విడుదలైంది. ఈ మూవీ గురించి హిడియో కొజిమా ట్వీట్ చేస్తూ.. బాహుబలి క్రియేటర్ ఎస్.ఎస్. రాజమౌలి తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ విడుదలైంది.. టాప్ గన్.. మావెరిక్ లా ఎంటర్ టైన్ చేస్తుంది.. తప్పక చూడండి అంటూ పోస్టు చేశారు.

ఇంతకీ ఈ ప్రముఖుడి వెనకున్న బ్యాక్ గ్రౌండ్ చూస్తే.. అతగాడు ప్రముఖ వీడియో గేమ్ డైరెక్టర్ కమ్ క్రియేటర్. మెటల్ గేర్.. స్నాచర్.. మెటల్ గేర్ 2.. సాలిడ్ స్నేక్.. పోలీస్ నాట్స్.. మెటల్ గేర్ ఆన్ లైన్.. డెత్ స్ట్రాడింగ్ లాంటి ఎన్నో పాపులర్ గేమ్స్ ను క్రియేట్ చేసిన వ్యక్తి.

అతడి గేమ్స్ జపాన్ లో చాలా పాపులర్. అలాంటి వ్యక్తి ఆర్ఆర్ఆర్ మూవీ బాగుందన్న మాట.. సినిమాకు మరింత క్రేజ్ తీసుకొస్తుందని చెబుతున్నారు. భారతీయ సినిమాల్నిఅమితంగా ఇష్టపడే ఆయన్ను.. గుర్తించి.. అతన్ని కలవటం ద్వారా తన సినిమాను మరింత ప్రమోట్ చేసుకుంటున్న రాజమౌళి తెలివిని ఎంత ప్రశంసించినా తక్కువే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News