కేసీఆర్ నోట వచ్చే రాహుల్ ఎవరు? ఏం చేస్తుంటారు?

Update: 2020-05-22 01:30 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే మీడియాకు మాత్రమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇంపార్టెంట్ గా మారింది. మాయదారి రోగం పుణ్యమా అని.. ఆయన ప్రెస్ మీట్ ను అసాంతం చాలా సీరియస్ గా చూసేటోళ్లు విపరీతంగా పెరిగిపోయారు. ఆడ.. మగ అన్న తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఫాలో అవుతున్న వైనం మీడియా వర్గాలకు మాత్రమే కాదు.. సాక్ష్యాత్తు టీఆర్ఎస్ నేతలకు ఆశ్చర్యంగా మారింది. సారు నోటి మాటలు ఎవరినైనా కట్టిపారేస్తాయన్నది నిజమే అయినా.. మిగిలిన ప్రోగ్రాంలు బంద్ పెట్టి మరీ కేసీఆర్ ప్రెస్ మీట్ ను దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారు ఫాలో కావటం హాట్ టాపిక్ గా మారింది.

కేసీఆర్ ప్రెస్ మీట్ అన్నంతనే.. గుర్తుచ్చే మరొకరు.. రిపోర్టర్ రాహుల్. సామాన్య జనాలకు రాహుల్ పేరు మాత్రమే తెలుసు. ఆయన ఏ మీడియా సంస్థలో పని చేస్తారు? ఎలా ఉంటారు? ఆయన తీరు ఏమిటి? లాంటివేమీ కూడా బయటకు రాలేదు. కేసీఆర్ తిట్టుడు దగ్గర నుంచి రాహుల్ గారు.. మీరిది తప్పకుండా రాయాలండి. హైలెట్ చేయాలండి.. ప్రజలందరికి తెలియాలండి.. లాంటి మాటలు తరచూ వినిపిస్తుంటాయి.

కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే.. కనీసం ఒక్కసారైనా ఆయన నోటి నుంచి రాహుల్ ప్రస్తావన తేకుండా ఉండలేరు. దీంతో.. అందరికి ఈ రాహుల్ ఎవరు? అన్న ఆసక్తి పెరిగిపోతోంది. సీనియర్ జర్నలిస్టు అయిన రాహుల్ మితభాషి. తన పని ఏదో తాను చూసుకోవటం తప్పించి మిగిలిన విషయాల్ని పెద్దగా పట్టించుకోరన్న పేరుంది. అందరితోనూ స్నేహభావంతో ఉండే అయన.. రాసుకుపూసుకు తిరగటం లాంటి వాటికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు.

ది హిందూ పత్రికలో ఏళ్లకు ఏళ్లుగా పని చేస్తున్నారు. ఉద్యమ సమయానికే సీనియర్ జర్నలిస్టుగా సుపరిచితులైన రాహుల్ కాస్త భిన్నమైన వ్యక్తి. ప్రెస్ మీట్లో ఎక్కువ ప్రశ్నలు సంధించే రిపోర్టర్ గా ఆయనకు పేరుంది. అధికార యంత్రాంగంతోనూ.. పెద్ద పెద్ద నేతలతో ఉండే పరిచయాల్ని వినియోగించుకొని పెద్ద స్థానాలకు వెళ్లే చాలామందికి భిన్నమైన వ్యక్తిత్వం రాహుల్ దని చెబుతారు. జర్నలిస్టుగా ఆయన కమిట్ మెంట్ ను ఎవరూ వంక పెట్టలేరు. ముక్కుసూటిగా ఉండటమే కాదు.. నిజాయితీగా ఉండటం ఆయనకున్న మరో ప్రత్యేకత.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికి సుపరిచితుడైన రాహుల్.. మీడియా సర్కిల్స్ లోని వారికి బాగా తెలిసిన వాడే. మాయదారి రోగం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అదే పనిగా ప్రెస్ మీట్లు పెట్టటం.. ఆ సందర్భంగా రాహుల్ ను పేరును అదే పనిగా ప్రస్తావించటంతో ఆయన పాపులర్ అయ్యారు. బయట ప్రజలకు ఆయన ఎలా ఉంటారో తెలీదు. ఏమైనా.. తెలుగు జర్నలిస్టుల్లో విలువలతోనూ.. కమిట్ మెంట్ తోనూ పని చేసే కొద్దిమంది రిపోర్టర్లలో ఆయన ఒకరుగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News