వందేళ్ల క్రితం హైదరాబాద్ లో ఉన్నవి 118 కార్లే ...తోలి కారు ఎవరు నడిపారంటే ?

Update: 2020-11-24 16:30 GMT
కారు ..లగ్జరీ లైఫ్ కి కేరాఫ్. ప్రస్తుత రోజుల్లో అయితే, ప్రతి ఒక్కరు కారును కొంటున్నారు. కానీ, గత కొన్నేళ్ల క్రితం కారు ఉంది అంటే వారు మహారాజులే. కారు ను అప్పట్లో ఎదో రాకెట్ చూసినట్లు చూసేవారు. ఎందుకంటే మోటార్ వాహనాలు అప్పట్లో భాగ్యనగరంలో తిరిగిన దాఖలాలు లేవు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరు పొందిన ఏడో నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్ ఆలీఖాన్‌ కు కార్లంటే మహా ఇష్టం. అయితే, దేశంలో తొలిసారిగా మోటారు కారు రోడ్డెక్కింది మాత్రం 1897లో, అది కూడా లండన్‌ నుంచి దిగుమతి అయింది. తర్వాత కొద్ది రోజులకే భాగ్యనగరంలోనూ కారు షికారు చేసినట్లు చరిత్ర ఆధారాల ద్వారా తెలుస్తోంది.

హైదరాబాద్‌ లో తొలిమోటారు కారును వినియోగించిన వ్యక్తి పైగా కుటుంబానికి చెందిన ఇక్బాలుద్దౌలా. ఆయన ఆరో నిజాం పాలనలో ప్రధానమంత్రిగానూ సేవలు అందించారు. ఇక్బాల్‌ ఫలక్ ‌నుమాతో పాటు సుమారు ఇరవై భవనాలను నిర్మించారు. నిజాం సంస్థానంలో విద్యారంగ అభివృద్ధికి బాటలు వేశారు. అఫ్జల్‌గంజ్‌ గ్రంథాలయంను కట్టించింది కూడా ఈయనే. పోలో ఆటను నగరానికి పరిచయం చేసిందీ ఆయనే. అదే పైగా ఫ్యామిలీకి చెందిన జాఫర్‌ జంగ్‌ కొత్త కారు కొనుగోలు చేసి, మహబూబ్‌ అలీఖాన్ ‌కు బహూకరించినట్లు రయ్యత్‌ పత్రిక నిర్వాహకుడు మందుమల నరసింహారావు రచనల్లో పేర్కొన్నారు.

1905-1910 మధ్యకాలంలో ముస్లంజంగ్‌, కమాల్‌ యార్‌ జంగ్‌ తదితర రాజకుటుంబీకులు కొద్దిమంది మోటారుకార్లు కొనుగోలు చేశారు. ఆరో నిజాం సైతం 1905లో స్కాటిష్‌ కంపెనీకి చెందిన ఆర్గిల్‌ మోటారు కారును వినియోగించారు. 1911లో రోల్స్‌ రాయిస్‌ సిల్వర్‌ ఘోస్ట్స్‌ కారును నిజాం కరెన్సీలో పాతిక వేలకు బ్రిటీష్‌ రెసిడెంట్‌ ద్వారా ఆరో నిజాం కొనుగోలు చేశారు. 1912నాటికే సికింద్రాబాద్‌లో బాంబాయి సైకిల్‌ అండ్‌ మోటార్‌ ఏజన్సీ పేరుతో షోరూమ్‌కూడా ప్రారంభమైంది. అయితే ,1911లో అధికారిక లెక్కల ప్రకారం అప్పటి నగర జనాభా నాలుగు లక్షలమంది. నగరంలోని మోటారు వాహనాల సంఖ్య 118 మాత్రమే. సరిగ్గా 110ఏళ్ల తర్వాత నగర జనాభా కోటికి చేరువైతే, మోటారు వాహనాల సంఖ్య అరవై లక్షలు దాటాయి.
Tags:    

Similar News