కోహ్లీ సేనకు కొత్త కోచ్...రవిశాస్త్రి ప్లేస్ లో వచ్చేది ఎవరంటే

Update: 2021-09-18 02:30 GMT
క్రికెట్ టీం ఇండియాకు త్వరలో కొత్త కోచ్  రానున్నారు. అదేంటి ప్రస్తుతం కోచ్ పదవిలో రవిశాస్త్రి ఉన్నారుగా అనుకుంటున్నారు. త్వరలోనే రవిశాస్త్రి తన పదవికి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ తర్వాత రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. ఆ తర్వాత కోచ్ గా కొనసాగేందుకు ఆయన విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే పూర్తి క్లారిటీతో ఉన్న రవిశాస్త్రి తన నిర్ణయాన్ని బీసీసీఐ పెద్దలతో చెప్పినట్లు తెలుస్తోంది. రవిశాస్త్రి నిర్ణయంతో బీసీసీఐ కొత్త కోచ్ వేటలో పడింది.

త్వరలోనే కోచ్ సెలక్షన్ ప్రక్రియ ప్రారంభించి దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు సమాచారం. టీ20 ప్రపంచ కప్ ముగిసిన వెంటనే రవిశాస్త్రి రాజీనామా చేయనున్నాడు. రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ , ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ కూడా  తప్పుకోనున్నారు. టీమిండియా కోచ్ గా రవిశాస్త్రి 2017లో నియమితులయ్యారు. 2019 ఆగస్టులో ఆయన పదవీకాలం ముగియగా.. బీసీసీఐ మరో రెండేళ్లు పొడిగించింది. దీంతో ఆయన పదవీకాలం టీ20 ప్రపంచ కప్ అనంతరం ముగుస్తుంది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు టీ20 ప్రపంచ కప్ జరుగుతుంది. అనంతరం కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకుంటారు.

రవిశాస్త్రి నిర్ణయంతో బీసీసీఐ కోచ్ వేటను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచ కప్ ముగిసిన వెంటనే కోచ్ ను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. తొలుత దరఖాస్తులు ఆహ్వానించి అనంతరం ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయనుంది. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశముంది. కోచ్ రేసులో ఇప్పటికే పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత మాజీ కెప్టెన్, ది వాల్ రాహుల్ ద్రావిడ్  కోచ్ రేసులో ముందున్నాడు. ఎన్.సీ.ఏ డైరెక్టర్ గా, జూనియర్ టీమ్ కోచ్ గా సేవలందించిన ద్రావిడ్ హెడ్ కోచ్ అవడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. అలాగే మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్  కూడా రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే సౌతాఫ్రికా టూర్ నాటికి కొత్త హెడ్ కోచ్, అసిస్టెంట్ కోచ్ లు బాధ్యతలు తీసుకునే అవకాశముంది.
Tags:    

Similar News