గన్న'వరం'.. ఇప్పుడు ఎవరికి 'వరం'..!

Update: 2019-10-30 04:19 GMT
గన్నవరం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది. ఎన్నికల ఫలితాలు వచ్చి ప్రభుత్వం ఇంకా సరిగ్గా కుదురుకోక ముందే టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రాజీనామా అస్త్రాన్ని సంధించడంతో  ఏపీ లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో గన్నవరం హాట్ టాపిక్ అయి కూర్చుంది. ఇప్పటికే తెలంగాణలో లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే హుజుర్ నగర్  ఉపఎన్నిక రావటం, అధికార పార్టీ ఏకంగా 43 వేల కోట్ల భారీ తేడాతో విజయం సాధించడం తో  ఇప్పుడు అందరి దృష్టి గన్నవరం పై పడింది.

వంశీ  టీడీపీకి.. తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆ రాజీనామా ఆమోదం పొందితే ఆరు నెలల్లో గన్నవరానికి ఉప ఎన్నిక వస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వంశీ రాజీనామాను ఉపసంహరించుకునే పరిస్థితులు కనపడటం లేదు. టిడిపికి రాజీనామా చేస్తున్నానని ఇంత హడావుడి చేసి మళ్లీ ఇప్పుడు అదే పార్టీలో ఉంటే ఆ తర్వాత వంశీకి వైసీపీలో దారులు మూసుకు పోవడం ఖాయం. రాజ‌కీయంగా భ‌విష్య‌త్తు ఉండాలంటే వైసీపీలోకే వెళ్లాలి.. అన్న ధోరణిలో ఉన్న‌ వంశీ ఎన్నికలకు ముందే వైసీపీలోకి జంప్ చేసి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తాడని అందరూ భావించారు.

ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నా వచ్చే నాలుగు ఏళ్ళు  పాటు ఎలాంటి ఉపయోగం ఉండదు.. అన్న నిర్ణయానికి వచ్చి వైసీపీలో ఉన్న తన మిత్రుడైన మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని రాయభారంతో జగన్ తో ఏకంగా 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. గన్నవరంలో వంశీ పై ఓడిపోయినా వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు నాలుగు రోజులుగా జగన్  అపాయింట్మెంట్ దొరకడం లేదు. అలాంటిది ఏకంగా 45 నిమిషాల టైం ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు.. వంశీ  విషయంలో జగన్ సైతం ఎంత పాజిటివ్ గా ఉన్నారో చెప్పేందుకు ఇదే నిదర్శనం.

ఇక గన్నవరంకు ఉప ఎన్నిక వస్తే అది మూడు ప్రధాన పార్టీల అధినేతలకు అందివచ్చిన అవకాశం అని  చెప్పుకోవాలి. ఓ వైపు చంద్రబాబు జగన్ పాలనపై అప్పుడే విమర్శలు ప్రారంభించారు. జగన్ ని ఎన్నుకుని జనం తప్పు చేశామని భాధ పడుతున్నారంటోన్న చంద్రబాబు మాటకు ఉన్న విలువ ఏంటో ?తెలియచెబుతోంది. మరో వైపు అదృష్టవశాత్తు వైసీపీ గెలిచిందని సెటైర్లు వేస్తోన్న జనసేనకు కూడా ఈ ఎన్నిక వాస్తవం ఏంటో చూపిస్తుంది. జగన్ ముప్పయేళ్ళ సీఎం అని ధీమా పడుతున్న అధికార పార్టీకి అసలైన లెక్కలు చెబుతుంది.

ఉప ఎన్నికలు ఎదుర్కోవాల్సి వస్తే చంద్రబాబుకు ఇది పెద్ద అగ్ని పరీక్ష అవుతుంది. పైగా గన్నవరం టీడీపీ కంచుకోట. ప్రస్తుతం ఇది ఆ పార్టీ సిట్టింగ్ సీటు.. ఇక్కడ గెలిస్తే చంద్రబాబు పరువు నిలబడడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి కొత్త పునరుత్తేజం లభించినట్లు అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే వైసిపి ఏకంగా 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది.. ఆ పార్టీకి గన్నవరం గెలిచినా, ఓడినా నష్టం ఉండదు. అదే టీడీపి ఓడిపోతే సిట్టింగ్  సీటుతో పాటు పైగా కంచుకోటలో ఓడిపోవడం పెద్ద మైనస్ అవుతుంది.

ఇక గన్నవరం ఉప ఎన్నిక జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కూడా బంగారు అవకాశం లాంటిదే..! ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక ఓట్ల‌తో పాటు కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా బలంగానే ఉన్నాయి. పవన్ ఇప్పటికీ తన పార్టీకి బలం ఉందని చెప్పుకుంటున్నారు.. దాన్ని నిరూపించుకోవాలంటే ఇక్కడ తప్పనిసరిగా పోటీ చేయాలి. అలాగే మొన్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పరోక్షంగా టిడిపికి సపోర్ట్ చేశారన్న‌  అపవాదు ఎదుర్కొన్నారు. ఇప్పుడు దాన్ని పోగొట్టుకోవాలంటే జనసేన ఇక్కడ పోటీ చేయాలిసిఉంది.

ఇక వైసీపీ విషయానికి వస్తే మొన్న ఎన్నికల్లో జగన్ విజయం సునామీలా  ప్రతిపక్షాలను ముంచేసింది.. గన్నవరం సీటు గెలిస్తే వైసిపి పట్టు ఎంత మాత్రం తగ్గలేదని జగన్ జనాకర్షణ మరింతగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఇది వైసిపికి మరి కొద్ది రోజుల పాటు పెద్ద బూస్ట‌ప్ లా ఉంటుంది. ఏదేమైనా గన్నవరంలో ఉప ఎన్నికలు వస్తే మూడు ప్రధాన పార్టీల అధినేతలకు తామేంటో ప్రూవ్ చేసుకునేందుకు మంచి అవకాశం.. మరి గన్నవరం రాజకీయం ఎలా మలుపులు  తిరుగుతుందో ? చూడాలి.
Tags:    

Similar News