ఈసారి గాజువాకలో గెలిచేది ఎవరంటే...?

Update: 2022-03-23 10:32 GMT
గాజువాక. ఈ అసెంబ్లీ సీటుకు పొలిటికల్  గ్లామర్ చాలానే ఉంది. ఎందుకంటే దానికి ఆ తళుకుబెళుకులు అద్ద్దినది అచ్చంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. గాజువాకలో పవన్ 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన నామినేషన్ వేయడానికి వస్తే ఇసుక వేస్తే రాలనంతగా జనం వచ్చారు. దాంతో జనసేనాని విజయం తధ్యమని నాడే అంతా భావించారు. అయితే పవన్ మరో సీటుగా భీమవరం నుంచి పోటీ చేయడమే కొంత మైనస్ అయింది.

గెలిస్తే పవన్ గాజువాక సీటు ఉంచుకోరని ప్రత్యర్ధి పార్టీలు ప్రచారం చేశాయి. అదే విధంగా పవన్ ప్రచారం కోసం తక్కువ సమయం కేటాయించడం, నాన్ లోకల్ అంటూ మిగిలిన పార్టీలు భారీ ఎత్తున కాంపెయిన్ చేయడం వంటికి పవన్ కి ప్రతికూలంగా మారాయి. అంతే కాదు,  ఆ ఎన్నికల్లో ప్రలోభాలు కూడా బాగా పనిచేసి పవన్ ఓటమిని నిర్ణయించాయని చెబుతారు.

ఇవన్నీ ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ఓడిన తరువాత గాజువాక ఒకే ఒకసారి వచ్చారు. ఆయన మళ్లీ ఆ వైపుగా ఎందుకో రాలేదు. గట్టిగా చెప్పాలీ అంటే పవన్ విశాఖ టూర్లు కూడా పెద్దగా లేవు. పవన్ కి గాజువాక ఓటమి అంతలా బాధించింది అన్న వారూ ఉన్నారు. అయితే కాలం ఒక్కలా ఉండదు కదా. ఇపుడు గాజువాకలో రాజకీయంగా మార్పులు వచ్చాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ మీద గెలిచిన తిప్పల నాగిరెడ్డి మీద వ్యతిరేకత ఉంది.

ఆయనకు సొంత పార్టీలోనే ఇబ్బందులు ఉన్నాయి. అంతా తన వారికి,  అనుకూలురులకే ఆయన మద్దతుగా ఉంటున్నారు తప్ప ఎవరికీ ఏ పనీ చేయడంలేదు అన్న ఆరోపణలు ఉన్నాయి. దానికి తోడు ఆయన వారసులుగా కుమారులు సీన్ లోకి రావడంతో కుటుంబ పాలనగా మారింది అన్న విమర్శలు వస్తున్నాయి.

ఇక రాష్ట్ర స్థాయిలో వైసీపీ మీద వచ్చిన వ్యతిరేకత కూడా గాజువాకలో ప్రభావం చూపుతోంది. ఈ నేపధ్యంలో గాజువాకలో పవన్ కళ్యాణ్ తిరిగి పోటీ చేస్తే కచ్చితంగా గెలిపించుకుంటామని ష్తానికుల నుంచి వస్తున్న మాట. నాడు పవన్ జనసేన సిద్ధాంతాలు ఏమిటో పెద్దగా  తెలియదని, ఇపుడు మాత్రం ఆయనకు జనాదరణ పెరిగిందని అంటున్నారు.

పవన్ పోటీ చేస్తే గాజువాక నుంచి లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమని కూడా అంటున్నారు. రెండు లక్షలకు పైగా ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో పవన్ కి లక్ష ఓట్ల మెజారిటీ వస్తుంది అనుకుంటే ప్రత్యర్ధులు ఇక్కడ చిత్తు అనుకోవాల్సిందే మరి. మొత్తానికి గాజువాకలో పవన్ ఫీవర్ బాగా కనిపిసోంది. జనసైనికులు కూడా పవన్ పోటీ చేయాలని గట్టిగా కోరుతున్నారు.

ఇక మరోవైపు చూస్తే  2009ల ఏర్పడిన గాజువాక సీట్లో తొలిసారి ప్రజారాజ్యం విజయం సాధించింది. 2014 ఎన్నికలో టీడీపీ గెలిచింది. 2019లో వైసీపీ విజయపతాక ఎగరేసింది. అందువల్ల ప్రతీ సారి కొత్త పార్టీని గెలిపించే గాజువాక  ఓటర్లు ఈసారి కచ్చితంగా జనసేనకు పట్టం కడతారు అన్న విశ్లేషణలు అయితే గట్టిగానే ఉన్నాయి మరి.
Tags:    

Similar News