గ్రౌండ్ రిపోర్ట్: మచిలీపట్నం.. ఎవరి పట్నం..?

Update: 2019-03-27 06:30 GMT
పార్లమెంట్ నియోజకవర్గం: మచిలీపట్నం (బందరు)
టీడీపీ:కొనకళ్ల నారాయణ
వైసీపీ: వల్లభనేని బాలశౌరి
జనసేన: బండ్రెడ్డి రాము

కృష్ణాజిల్లాలో ముఖ్య పట్టణంగా ఉన్న మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గంలో రాజకీయం విభిన్నంగా ఉంటుంది. మచిలీపట్టణానికి బందరు అనే పేరు కూడా ఉంది. ఏడు శాసనసభ నియోజకవర్గాలున్న ఇక్కడ గత  రెండు పర్యాయాలుగా టీడీపీ నేత కొనకళ్ల నారాయణ గెలుస్తూ వస్తున్నారు. ఈసారి కూడా టీడీపీ టికెట్‌ దక్కడంతో హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తున్నారు.  వైసీపీ నుంచి కొత్త నేత వల్లభనేని బాలాశైరి బరిలో ఉన్నారు. ఇక జనసేన నుంచి బండ్రెడ్డి రాము బరిలో ఉన్నారు.

మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గం చరిత్ర
అసెంబ్లీ నియోజకవర్గాలు: మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెడన, గుడివాడ, పెనమలూరు,  గన్నవరం
ఓటర్లు: 13లక్షల 69వేలు

1952లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. సనక బుచ్చికోటయ్య సీపీఐ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక్కడ మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ పార్టీ నుంచి కావూరి సాంబశివరావు అత్యథిక సార్లు విజయం సాధించారు. నటుడు కైకాల సత్యనారాయణ సైతం 1996లో ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు. బందరులో సింధులు చేసే లడ్డూలకు ప్రత్యేకత ఉంది. ఇక్కడి లడ్డూ శ్రేష్ఠమైనదిగా భావిస్తారు.

* మూడోసారి కొనకళ్ల నారాయణ హైట్రిక్ కొట్టేనా?
2009,2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి కొనకళ్ల నారాయణ ఎంపీగా గెలుపొందారు. మరోసారి గెలిచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వివాదరహితుడిగా పేరున్న నారాయణ బందరు పోర్టు ఏర్పాటుకు కృషి చేశారు. ప్రత్యేక హోదా విషయంలో నారాయణ పార్లమెంట్‌ లో జరిగిన చర్చల్లో ప్రశ్నలు సంధించారు. మొత్తం పార్లమెంట్‌లో ఆయన 219 ప్రశ్నలు సంధించారంటే ఆయన ఏ స్థాయిలో పోరాడుతున్నారో అర్థమవుతోంది. అధికార టీడీపీలో ఉండడం.. చంద్రబాబు సంక్షేమ పథకాలు బలంగా ప్రజల్లోకి వెళ్లడంతో అవే గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు.

* అనుకూలతలు:
-నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడడం
-పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఆరు అసెంబ్లీ ప్రాంతాల్లో టీడీపీ గెలవడం
-బందరు పోర్టు ఏర్పాటుకు కృషి చేయడం

* ప్రతికూలతలు:
-నియోజకవర్గంలో ఎక్కువగా కనిపించడనే ఆరోపణ
-టీడీపీపై వస్తున్న వ్యతిరేకత
-వైసీపీ బలపడడం

* వల్లభనేని బాలశౌరికి వైసీపీ గాలే దిక్కు..
2014 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆ తరువాత జగన్‌ అతనిని బందరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించారు. ఇప్పుడు ఆయనకే సీటు కేటాయించి బరిలో నిలబెట్టారు. జగన్‌ పాదయాత్ర చేపట్టిన తరువాత వైసీపీ పుంజుకుంది. అంతేకాకుండా ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడంలో బాలశౌరి సఫలీకృతుడయ్యారు. మొత్తానికి ఈసారి గెలుపు తనదేననే కోవలో ప్రచారం చేస్తున్నారు. గుంటూరు నుంచి మచిలీ పట్నంకు మార్చడంతో ఇక్కడ స్థానికేతరుడన్న ముద్ర బాలశౌరిపై పడింది. ఇదే ఈయనకు మైనస్ గా మారింది. అయితే వైసీపీ గాలిలో గెలుస్తాడన్న నమ్మకం పెట్టుకున్నారు.

* అనుకూలతలు:
-నియోజకవర్గంలో పార్టీ బలపడడం
-కొనకళ్లపై పెరిగిన అసంతృప్తి
-ఆర్థికంగా బలంగా ఉండడం

* ప్రతికూలతలు:
-స్థానిక నేత కాకపోవడం
-పార్టీ బలంగా ఉన్నా కేడర్‌ లేకపోవడం

* కొనకళ్లకే కాస్త మొగ్గు..
ఇక జనసేన నుంచి బండ్రెడ్డి రాము సైతం బరిలో ఉండడంతో ఇక్కడ త్రిముఖ పోరు సాగనుంది. మచిలీపట్నం నియోజకవర్గంలో కాపు సామాజిక ఓట్లు, మత్స్యకారుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో జనసేన ప్రధానంగా పోటీ లేకున్నా కాపు సామాజిక ఓట్లు చీల్చే అవకాశం ఉంది. దీంతో  కొనకళ్ల నారాయణ, బాలశౌరికి మెజారిటీ తగ్గవచ్చు. అయితే టీడీపీ చేపడుతున్న పథకాలు గెలిపిస్తాయని నారాయణ చెబుతున్నారు. ఇక మూడు పార్టీల అభ్యర్థులు ఒకే సామాజిక వర్గానికే చెందినవారు కావడంతో పోరు రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ముగ్గురులో టీడీపీ అభ్యర్థి కొనకళ్లకే కాస్త మొగ్గు కనిపిస్తోంది.
   
   
   

Tags:    

Similar News