గంగూలీ కూతురు సన ఎందుకింత హాట్ టాపిక్ అయ్యింది?

Update: 2019-12-19 08:14 GMT
మాజీ టీమిండియా కెప్టెన్ అంతకు మించి అలాంటి వారిని సైతం డిసైడ్ చేసే బీసీసీఐ చీఫ్ పదవిని చేపట్టిన సౌరభ్ గంగూలీ ఇప్పుడు వార్తల్లోకి వచ్చారు. ఇటీవల కాలంలో పౌరసత్వ సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా సాగుతున్న నిరసనలు.. ఆందోళనలతో పాటు.. ఈ చట్టానికి అనుకూలంగా సంబరాలు సాగుతున్న సంగతి తెలిసిందే. నిరసనలకు మీడియా ఇస్తున్న ప్రాధాన్యత సంబరాలకు పెద్దగా ఇవ్వకపోవటం దేనికి నిదర్శనం? అన్నది మరో ప్రశ్న.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా సౌరవ్ గంగూలీ కుమార్తె సనా గంగూలీ ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఇప్పుడామె సంచలనంగా మారారు. ఎందుకిలా? అంటే.. పౌరసత్వ సవరణ చట్టంపై ఆమె పెట్టినట్లుగా చెబుతున్న ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఆమె అకౌంట్లో ఆ పోస్టు కనిపించనప్పటికి.. దానికి సంబంధించి స్క్రీన్ షాట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.

మోడీ ప్రభుత్వాన్ని సూటిగా విభేదించటంతో పాటు.. విమర్శలు చేసిన ఆమె ధైర్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. అయితే.. తన వాదన మొత్తాన్నిప్రముఖ  రచయిత కుష్వంత్ సింగ్ చేసిన వ్యాఖ్యల్ని.. యథాతధంగా కోట్ చేయటం ద్వారా తానేం చెప్పాలనుకుంటున్నారో చెప్పేసినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఆమె పోస్టు చేసినట్లుగా చెబుతున్న పోస్టుకు సంబంధించిన వివరాలేమీ ఇప్పుడామె సోషల్ మీడియా ఖాతాలో లేకపోవటం గమనార్హం.

2003లో కుష్వంత్ సింగ్ రాసిన ది ఎండ్ ఆఫ్ ఇండియా పుస్తకం నుంచి కొన్ని వ్యాఖ్యల్ని తీసుకున్నారు వాటిని యథాతధంగా ఇన్ స్టాలో పోస్టు రూంలో సనా గంగూలీ పెట్టినట్లుగా చెబుతున్నారు. ఆ పోస్టులో ఉన్న కీలక వ్యాఖ్యలు చూస్తే..

%  ‘‘ప్రతీ నియంత ప్రభుత్వానికి కొన్ని గ్రూపులు, సమూహాలు కావాలి. ఎందుకుంటే వాటిని బూచిగా చూపుతూ భయాందోళనలు పెంచడం వారి నైజం. ఇది ఒక సమూహంతో మొదలు కావొచ్చు.. లేదా రెండు. కానీ అక్కడితో ఆగిపోదు.

%  విద్వేషపు పునాదులపై నిర్మాణమైన ఉద్యమం.. భయాందోళనలు కలిగిస్తూ ఉంటేనే.. ఎక్కువ కాలం మనగలగులుతుంది. ఎవరైతే తాము ముస్లింలు, క్రిస్టియన్లు కావని సంతోషిస్తుంటారో.. వారంతం మూర్ఖుల స్వర్గంలో విహరిస్తున్నవారి కింద లెక్క.

%  వామపక్షవాద రచయితలపై, పశ్చిమదేశాల సంస్కృతిని అనుసరిస్తున్న యువతపై ఇప్పటికే సంఘ్ పరివార్ దృష్టిపెట్టింది. రేపది మహిళలపైకి మళ్లొచ్చు. స్కర్ట్స్ వేసుకునే మహిళలు, మాంసం తినేవారు, మద్యం సేవించే వారు, విదేశీ సినిమాలు చూసేవారు.. ఇలా ఆ జాబితా పెరుగుతూ పోతుండొచ్చు.

%  పళ్లపొడి బదులు పేస్ట్ వాడండి, ఏటా వెళ్లే తీర్థయాత్రలకు వెళ్లడం మానేయండి. జై శ్రీరామ్ బదులు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోండి, ఆలింగనాలు చేసుకోండి. అలోపతి మందులను వాడండి. ఇక్కడ ఎవరూ సురక్షితంగా లేరు. ఈ దేశాన్ని సజీవంగా ఉంచాలంటే.. మనం కచ్చితంగా మేల్కోవాలి.

ఈ పోస్టు పెట్టిన దానికి సనా ధైర్యాన్ని పలువురు అభినందిస్తున్నారు. దాదా కూతుర్ని బాగా పెంచారంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ పోస్టు తన కుమార్తె పెట్టింది కాదని.. ఆమె చాలా చిన్న పిల్లని.. ఆమెకు రాజకీయాలు అర్థం చేసుకునే శక్తి లేదని చెప్పటం విశేషంగా మారింది.
Tags:    

Similar News