ఎంపీల‌కు ఖ‌ర్చు చేయ‌టం కూడా క‌ష్టమేన‌ట‌!

Update: 2018-08-26 06:44 GMT
ప్ర‌జాసేవ చేయ‌టానికి ఎంత‌కైనా సిద్ధ‌మంటూ ఎన్నిక‌ల వేళ మాట‌లు చెప్పే రాజ‌కీయ‌నేత‌లు ప్ర‌జ‌ల జీవితాల్ని ఎంత‌గా బాగు చేస్తారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. వారి ప‌ని తీరు ఎంత అధ్వానంగా ఉంటుందో చెప్ప‌టానికి తాజా ఉదాహ‌ర‌ణ స‌రిగ్గా స‌రిపోతుంది.

ప్ర‌జాసేవ చేయ‌ట‌మే త‌మ ప్ర‌ధ‌మ క‌ర్త‌వ్యంగా చెప్పే ఎంపీలు (లోక్ స‌భ‌..రాజ్య‌స‌భ‌) వాస్త‌వంలో వారు ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో తెలిస్తే న‌మ్మ‌బుద్ధి కాదంతే. ప్ర‌తి ఎంపీకి ఏటా రూ.5కోట్ల నిధుల‌నురెండు వాయిదాల్లో విడుద‌ల చేస్తారు. ఆ మొత్తాన్ని స్థానికంగా అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టే వీలు ఉంటుంది.

దేశ వ్యాప్తంగా ఉన్న లోక్ స‌భ‌..రాజ్య‌స‌భ స‌భ్యుల‌కు అందించే ఎంపీలాడ్స్ లో నేత‌లు ఖ‌ర్చు చేయాల్సిన మొత్తం లెక్క‌ను వింటే ఆశ్చ‌ర్య‌పోవ‌ట‌మే కాదు.. ఖ‌ర్చు చేయ‌టానికి కూడా మ‌రీ అంత ఒళ్లు బ‌ద్ధ‌కం ఏమిట్రా బాబు అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. స్థానిక అభివృద్ధి కోసం ఉద్దేశించిన ఎంపీ లాడ్స్ ను వినియోగించ‌టంలో ఎంపీలు వెనుక‌బ‌డిపోతున్నార‌ని.. అతి కొద్దిమంది మిన‌హా మిగిలిన వారు నిధుల ఖ‌ర్చు విష‌యంలో ఎంత అల‌స‌త్వంతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న‌ది తాజా నివేదిక చెప్పక‌నే చెప్పేసింది.  

మ‌రికొద్ది నెల‌ల్లో 16వ లోక్ స‌భ ప‌ద‌వీకాలం ముగిసిపోతున్న వేళ‌.. ఎంపీ ల్యాడ్స్ నిధుల వినియోగం జోరుగా లేని విష‌యాన్ని చెబుతున్నారు. ఇప్ప‌టికి దేశ వ్యాప్తంగా రూ.4,768 కోట్లు ఖ‌ర్చు చేయ‌ని నిధులు ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇందులో తెలుగు ఎంపీలు ఖ‌ర్చు చేయ‌ని లెక్క చూస్తే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాటా రూ.226కోట్లు అయితే.. తెలంగాణ రాష్ట్ర వాటా రూ.101 కోట్లుగా చెబుతున్నారు.  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపీ ల్యాడ్స్ కింద వ‌చ్చిన నిదుల్లో 90 శాతానికి మించి ఖ‌ర్చుచేసిన నేత‌ల్లో తెలంగాణ‌కు చెందిన ముగ్గురు ఎంపీలు ఉంటే.. ఏపీకి చెందిన ఐదుగురు ఎంపీలు ఉన్నట్లుగా తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. ఖ‌ర్చు చేయ‌టానికి నిధులు సిద్ధంగా ఉన్నా.. వాటిని అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు మ‌ళ్లించ‌టానికి సైతం సిద్ధంగా లేని ఎంపీల తీరు చూస్తే.. ఖ‌ర్చు చేయ‌టానికి కూడా మ‌రీ ఇంత ఒళ్లు బ‌ద్ధ‌క‌మా? అన్న విమ‌ర్శ ప‌లువురి నోట వినిపిస్తోంది.
Tags:    

Similar News