ర‌హ‌స్య ప‌ర్య‌ట‌న‌లో కిమ్‌..ట్రంప్‌ కు క‌ల‌వ‌రం

Update: 2018-03-28 06:40 GMT
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ విష‌యంలో ఊహించిందే నిజమైంది. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చైనాలో రహస్య పర్యటనకు వెళ్లారు. పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్‌ తో కిమ్ సమావేశమయ్యారు. సౌత్ కొరియా - అమెరికా అధ్యక్షులతో సమావేశాలకు ముందు కిమ్ చైనా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదివారం నుంచి బుధవారం వరకు కిమ్ చైనాలో అనధికారికంగా పర్యటించినట్లు చైనాకు చెందిన జినువా న్యూస్ వెల్లడించింది. 2011లో నార్త్ కొరియా పగ్గాలు చేపట్టిన తర్వాత కిమ్ తొలిసారి దేశం దాటి బయటకు వచ్చారు.ఈ విషయాన్ని రెండు దేశాలు ఆల‌స్యంగా ధృవీకరించాయి.

నార్త్ కొరియాకు చైనా ఎప్పటి నుంచో గట్టి మద్దతుదారుగా ఉంది. అయితే ఆ దేశం చేపట్టిన అణు కార్యక్రమాలతో ఈ బంధం కాస్త బలహీన పడింది. ఐక్యరాజ్య సమితి ఉత్తర కొరియాపై విధించిన ఆంక్షలను కూడా చైనా సమర్థించింది. అయితే ప్రస్తుతం కొరియాలో పరిస్థితులు చక్కబడుతున్నాయని - శాంతి చర్చల కోసం ఉత్తర కొరియా ముందుడుగు వేసిందని చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ తో కిమ్ చెప్పినట్లు జినువా న్యూస్ తెలిపింది. అణ్వాయుధాల నిరోధానికి కట్టుబడి ఉన్నామని కూడా కిమ్ హామీ ఇచ్చారు. అమెరికాతో చర్చలకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. చైనా - నార్త్ కొరియా మధ్య ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయని, వాటిని అలాగే కొనసాగించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా జిన్‌ పింగ్ అన్నారు. ఇద్దరు దేశాధినేతలు చేతిలో చేయి వేసి ఫొటోలకు పోజులిచ్చారు. నార్త్ కొరియాలో పర్యటించాల్సిందిగా కిమ్ కోరగా.. జిన్‌ పింగ్ సానుకూలంగా స్పందించారు.

అయితే అత్యంత ఆస‌క్తిక‌రంగా ముందు రోజు తమ దేశంలో  అసాధారణ - రహస్య పర్యటనపై చైనా అధికారికంగా స్పందించలేదు. చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి హువా చున్‌ యింగ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తమదేశంలో కిమ్ పర్యటన గురించి సమాచారం లేదని చెప్పారు. అయితే అనంత‌రం మాట మార్చి చైనాలో కిమ్ పర్యటనను అధికార వర్గాలు ధ్రువీకరించాయి.

Tags:    

Similar News