ఇప్పుడు ట్వీట్ చేయలేదెందుకు మోడీ సాబ్?

Update: 2019-11-27 04:48 GMT
అందుకే అంటారు టైం ఎప్పుడూ ఒకరి చేతుల్లోనే ఉండదని. తాజాగా మహారాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే.. రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయన్న నానుడి ఎందుకో ఇట్టే అర్థమైపోతుంది. అధికారాన్ని సొంతం చేసుకోవాలన్న అత్యాశతో మోడీషాలు కదిపిన పావులు చివరకు వారికి ఊహించని షాకులుగా మారాయన్నది మర్చిపోకూడదు.

ఎంతటోడినైనా పులుసులో ములక్కాయలా మార్చేసే ఎత్తులు తమకు మాత్రమే సొంతమన్న భావన ఎంత తప్పో మహారాష్ట్ర ఎపిసోడ్ వారికి అర్థమయ్యేలా చేసిందని చెప్పాలి. ఊహించని రీతిలో తెల్లవారు జామున దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినంతనే.. ఆపుకోలేని ఉత్సాహంతో ట్వీట్ చేసిన ప్రధాని మోడీపై ఇప్పుడు అందరూ వేలెత్తి చూపిస్తున్న పరిస్థితి.

బలం లేకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ద్వారా మోడీషాలు తొందరపడ్డారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే.. నమో వీరాభిమానులు మాత్రం మావోడి ఎత్తులు మీలాంటోళ్లకు అర్థం కావంటూ ఎటకారమాడేశారు. ఎలాంటి గేమ్ అయినా.. చివరకు తమకు అనుకూలంగా ఫినిష్ చేసే టాలెంట్ టన్నుల కొద్దీ మోడీషాలకే ఉందంటూ ఆకాశానికి ఎత్తేశారు.

ఇంతా చేస్తే.. నాలుగు రోజులు తిరిగేసరికి ముఖం కొట్టేసే పరిస్థితి. మరిక దారి లేక.. అన్ని దారులు మూసుకుపోయిన వేళ.. దిక్కుతోచని పరిస్థితిలో తాము డిసైడ్ చేసిన సీఎం తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి. ఏదైనా తమకు అనుకూలంగా జరిగిన వెంటనే ట్వీట్లతో జబ్బలు చరిచే మోడీ ఇప్పుడు అదే పని చేయగలరా? అని ప్రశ్నిస్తున్నారు. శివసేనకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారంటూ గొప్పలకు పోయినోళ్లు.. ఇప్పుడేమంటారంటూ నిలదీయటం గమనార్హం.
Tags:    

Similar News