శత్రువు కాస్తా మిత్రుడై చాలా కాలమైంది మోడీజీ

Update: 2019-04-10 04:57 GMT
ఎదుటోడి గురించి అదే పనిగా మాట్లాడే ముందు మన సంగతి చెప్పుకోవటం కనీస ధర్మం. పేరుకు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నా.. అందుకు భిన్నమైన రీతిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించే నరేంద్ర మోడీ ప్రత్యర్థి విషయంలో ఎంత కఠినంగా ఉంటారనటానికి తాజా వ్యాఖ్యలే నిదర్శనంగా చెప్పాలి.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలో పోటీ చేస్తున్న వేళ.. మోడీ సౌత్ లో ఎందుకు పోటీ చేయరన్న వాదన తెర మీదకు వచ్చింది. దీనిపై ఆయన కానీ ఆయన వర్గం కానీ సమర్థవంతంగా సమాధానం చెప్పలేని పరిస్థితి. దీంతో.. ఆయన తన వాదనను వినిపించే కంటే ఎదురుదాడి షురూ చేశారు. కేరళలో పోటీ చేస్తున్న రాహుల్ కర్ణాటకలో ఎందుకు పోటీ చేయటం లేదు? అంటూ క్వశ్చన్ విసిరారు.

అక్కడితో ఆగని ఆయన కర్ణాటకలో ఓడిపోతానన్న భయంతోనే కేరళలో రాహుల్ పోటీ చేసినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. దీనికి ఆసక్తికరమైన అంశాన్ని తెర మీదకు తెచ్చారు. అప్పట్లో దేవెగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచి ఆయన్ను పదవి నుంచి తొలగించారని.. నాటి ఘటనకు దేవెగౌడ ఇప్పుడు బదులు తీర్చుకుంటారన్న భయంతోనే కర్ణాటకలో పోటీకి దిగలేదని చెప్పుకొచ్చారు.

ఇన్ని మాటలు చెప్పే మోడీ.. తాను దక్షిణాదిలో ఎందుకు పోటీ చేయటంలేదో కూడా వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది. ఒకవేళ మోడీ చెప్పినట్లుగా దేవెగౌడ తో అంత పెద్ద పంచాయితీ ఉండి ఉంటే.. రెండు పార్టీల మధ్య సంకీర్ణ సర్కారు కర్ణాటకలో ఎందుకు ఉంటుందన్నది ప్రశ్న. రాజకీయాల్లో శాశ్విత మిత్రుడు.. శాశ్విత శత్రువు ఎవరూ ఉండరన్న విషయాన్ని మర్చిపోకూడదు.

మరి.. మోడీ మాటల మర్మం ఏమిటంటారా?  కేరళలో రాహుల్ పోటీ చేస్తున్న నేపథ్యంలో తనపై సౌత్ సందేహాలు వ్యక్తం చేయటమే కాదు.. పోటీ చేయకపోవటాన్ని అదే పనిగా ప్రశ్నిస్తున్న వారికి సూటిగా సమాధానం చెప్పలేక తాజా వాదనను వినిపించినట్లుగా చెప్పాలి. మోడీ తాజా మాటలతో కేరళలో రాహుల్ విజయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని.. అదే ఆయన కర్ణాటకలో పోటీ చేసి గెలవాల్సిందన్న భావన వ్యక్తమయ్యేలా మాట్లాడారని చెప్పాలి. తాను సౌత్ లో ఎందుకు పోటీ చేయటం లేదన్న విమర్శకు జవాబు ఇవ్వకుండా రాహుల్ మీద విమర్శలు చేసి మోడీ భలేగా తప్పించుకున్నారని చెప్పక తప్పదు.


Tags:    

Similar News