సీపీఎం బ్యాడ్ ల‌క్‌... 135 ఖాళీ చేయ‌క త‌ప్ప‌దంతే!

Update: 2019-06-13 10:33 GMT
వామ‌ప‌క్షాల బ‌లం దేశంలో అంత‌కంత‌కూ త‌గ్గిపోతోంది. గెలిచినా, ఓడినా కూడా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం అలుపెర‌గ‌కుండా పోరాటం సాగిస్తున్న లెఫ్ట్ పార్టీలు చ‌ట్ట స‌భల్లో పెద్ద‌గా రాణించ‌లేకున్నా... ఆ స‌భల నుంచి మాత్రం పూర్తిగా అదృశ్యం కాలేదు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై నాన్ స్టాప్ వార్ కొన‌సాగిస్తున్న లెఫ్ట్ పార్టీల‌కు అంత‌కంత‌కూ సీట్లు పెర‌గ‌డానికి బ‌దులుగా సీట్ల సంఖ్య క్రమంగా త‌గ్గిపోతోంది. ఈ త‌గ్గుద‌ల ఆ పార్టీల‌కు ప్ర‌త్యేకించి సీపీఎంకు ఇప్పుడు పెద్ద క‌ష్టాన్నే తెచ్చిపెట్టింది. పార్ల‌మెంటులో ఆ పార్టీ పార్ల‌మెంట‌రీ పార్టీ కార్యాల‌యంగా కొన‌సాగుతున్న రూం నెంబ‌రు 135ని సీపీఎం ఖాళీ చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి వ‌చ్చింది.

ఏళ్ల త‌ర‌బ‌డి పార్ల‌మెంటు భ‌వ‌నంలోని మూడో అంత‌స్తులో ఉన్న రూం నెంబ‌రు 135లోనే సీపీఎం పార్ల‌మెంట‌రీ పార్టీ కార్యాల‌యం కొన‌సాగుతోంది. అస‌లు ఆ గ‌ది పేరు చెబితే చాలు... అది సీపీఎం వ్యూహాల‌కు కేంద్రం క‌దా అన్న మాట వినిపిస్తోంది. అలాంటి కీల‌క గ‌దిని ఆ పార్టీ ఇప్పుడు ఖాళీ చేయ‌క త‌ప్ప‌డం లేదు. ప్ర‌స్తుతం సీపీఎంకు లోక్ స‌భ‌లో ముగ్గురు స‌భ్యులు, రాజ్య‌స‌భ‌లో ఐదుగురు స‌భ్యులు మాత్ర‌మే ఉన్నారు. ఇంత మేర త‌క్కువ స్థాయిలో స‌భ్యులు క‌లిగిన పార్టీకి రూం నెంబ‌రు 135 లాంటి గ‌దుల‌ను కేటాయించ‌డం కుద‌రదు. 2014లోనే సీపీఎం చేతిలో నుంచి ఈ గ‌ది జారిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతున్న సీతారాం ఏచూరీ రాజ్య‌స‌భ‌లో స‌భ్యుడిగా ఉండ‌టంతో పార్ల‌మెంట‌రీ సెక్ర‌టేరియ‌ట్ ఓ ప్ర‌త్యేక కేసుగా ప‌రిగ‌ణించి రూం నెంబ‌ర్ 135ను సీపీఎంకు కొన‌సాగించింది.

అయితే ఇప్పుడు ఆ పరిస్థితి క‌నిపించ‌డం లేదు. స‌భ‌లో కొత్త చాలా పార్టీలు కొత్త‌గా వ‌చ్చి చేరాయి. అంతేకాకుండా ఆయా పార్టీలు తాజా ఎన్నిక‌ల్లో హ్యాండ్ ఫుల్ ఆఫ్ సీట్ల‌నే కాకుండా సీపీఎం కంటే కూడా చాలా అధిక సీట్ల‌నే చేజిక్కించుకున్నాయి. ఈ క్ర‌మంలో ఆయా పార్టీల‌కు ఉన్న సంఖ్యాబ‌లాం ఆధారంగా ఆ పార్టీల పార్ల‌మెంట‌రీ విభాగాల‌కు గ‌దుల‌ను కేటాయించాల్సి ఉంది. ఈ క్ర‌మంలో రూం నెంబ‌రు 135 నుంచి సీపీఎంను ఖాళీ చేయించి, సీపీఎం కంటే అధిక సీట్లున్న పార్టీల‌కు ఆ గ‌దిని కేటాయించేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఇదే జ‌రిగితే ఏళ్ల త‌ర‌బ‌డి త‌న‌కు అచ్చొచ్చిన రూం నెంబరు 135ని సీపీఎం కోల్పోక త‌ప్ప‌ద‌న్న మాట‌.


Tags:    

Similar News