జగన్ పార్టీ ప్రశ్నలు అడిగితే జనసేన జవాబులు ఎందుకివ్వాలి?

Update: 2022-08-17 04:56 GMT
ఎక్కడ వినని.. చూడని చోద్యాలు ఏపీ రాజకీయాల్లో దర్శనమిస్తున్నాయి. సాధారణంగా ఒక పార్టీ విధానం గురించి మరో పార్టీ ప్రశ్నించటం కొంతమేర సబబే. అయితే.. పార్టీ వ్యూహాన్ని వెల్లడించాలని నిలదీయటం.. సమాధానం చెప్పేయాల్సిందేనంటూ విపక్షాన్నిఅధికారపక్షం విరుచుకుపడటం మాత్రం భారత రాజకీయాల్లో ఇప్పటివరకు చూడని అంశంగా చెప్పాలి. జగన్ పార్టీకి  వచ్చే సందేహాల్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు తీర్చాలి? ఆయనేం జగన్ పార్టీకి పనోడు కాదు కదా? వాళ్లు అడిగే ప్రశ్నలకు ఎందుకు సమాధానం ఇవ్వాలి?

ఒక రాజకీయ పార్టీగా సమాధానం చెప్పాల్సింది ప్రజలకు మాత్రమే తప్పించి.. అధికార పక్షానికి కాదు కదా? ఆ చిన్న లాజిక్ ను మిస్ అవుతున్న వైసీపీ నేతలు.. ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను.. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తారా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలని కోరిన వైనం విచిత్రంగా ఉందని చెప్పాలి.

ఒక టెండర్ ను సొంతం చేసుకోవటం కోసం దాన్నిపోటీ పడే వారంతా తమ తమ ప్రయత్నాల్లో ఉంటారు. అలాంటి వేళ.. పోటీకి వచ్చే వారిలో బలమైన వారిని టార్గెట్ చేసి.. నీకు దమ్ముంటే టెండర్ ఎంతకు వేస్తావో చెప్పు అంటే ఎంత ఛండాలంగా ఉంటుందో.. ఒక రాజకీయ పార్టీ ఎన్నికల వేళ..

తన వ్యూహం ఏమిటి? అన్నది ఎందుకు చెప్పాలి? అలా చెబితే.. అంతకుమించిన అమాయత్వం మరొకటి ఉండదు. ఇలాంటి తీరును తెలివిగా తెర మీదకు తీసుకొచ్చి.. దానికి మసాలా అద్ది.. జనసేన అధినేత పవన్ పై ప్రెజర్ తెచ్చేలా చేస్తున్న ప్రయత్నాల్ని చూస్తుంటే.. జనసేన.. టీడీపీ అస్సలు కలవకూడదన్నదే వారి లక్ష్యమన్నట్లుగా ఉందన్నమాట వినిపిస్తోంది.

జనసేన 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందన్న మాట పవన్ ను చెప్పాలని డిమాండ్ చేస్తున్న వైసీపీనేతలు.. ఇప్పుడీ అంశాన్ని ఒక వాదంగా వినిపిస్తున్నారు. ఏ మాత్రం విలువ లేని ఈ వాదనను విని.. వారు కోరినట్లుగా సమాధానం ఇవ్వటానికి పవన్ ఏమీ వారి పనోడు కాదు కదా? అయినా..

వైసీపీ నేతలకు పవన్ విషయంలో అంత ఆసక్తి ఏమిటి? ఆయన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్నది పవన్ నిర్ణయం. దానికి వైపీపీకి ఏం సంబంధం? అయినా.. ఎంత తమ వ్యూహాల్ని అమలు చేయాలని భావించినా..దాన్ని పక్కనోడ్ని దెబ్బ తీసేలా చేసి.. మాట్లాడటంలో అర్థం లేదు. చప్పున నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచిన చిన్న పిల్లాడి మాదిరి.. పవన్  పార్టీ ఏపీలో ఎన్ని సీట్లలో సొంతంగా పోటీ చేస్తుందన్న లెక్కను జగన్ పరివారానికి ఎందుకు చెప్పాలి? అన్నది ప్రశ్న.
Tags:    

Similar News