తెలుగు సీఎంలకు ఇలాంటి ఐడియాలు రావట్లేదెందుకు?

Update: 2020-08-06 23:30 GMT
దేశంలోని సరికొత్త సంక్షేమ పథకాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఊహించని రీతిలో తీసుకొచ్చే సంక్షేమ కార్యక్రమాల కోసం వందలాది కోట్లు.. కొన్ని పథకాలకు వేల కోట్లు ఖర్చు పెట్టే ట్రాక్ రికార్డు వారి సొంతం. అంతేనా.. ఎవరైనా తమ వద్దకు వచ్చి అడగటం ఆలస్యం వరాలు ఇచ్చేయటం కూడా వారికి అలవాటే. ఈ విషయంలో ఏపీ సీఎం జగన్ తో పోలిస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత ముందుంటారని చెప్పాలి. అలాంటి వారు.. ఇటీవల కాలంలో తమ జోరు తగ్గించినట్లుగా కనిపిస్తోంది.

కరోనా వేళ.. మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే.. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల డీజిల్.. పెట్రోల్ ధరలు తగ్గేందుకు వీలుగా వ్యాట్ ను భారీగా తగ్గించటం తెలిసిందే. తాజాగా ఆయన మరో వినూత్నమైన నిర్ణయాన్ని తీసుకొన్నారు. కరోనా వేళ.. పేషెంట్లకు సేవలు అందించే క్రమంలో తమ ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా నిజాయితీగా పని చేసిన వారి కుటుంబాలకు జరిగిన కష్టాల మీద ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది.

తాజాగా కరోనాతో మరణించిన డాక్టర్ జోగిందర్ చౌదరి కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయాన్ని అందించి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఇంతకూ జోగిందర్ చౌదరి ఎవరు? కరోనాతో ఎందుకు మరణించాల్సి వచ్చిందన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. అతడి గొప్పతనం ఏమిటో అర్థమవుతుంది. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ మెడికల్కాలేజీ అండ్ హాస్పిటల్ లో జూనియర్ డాక్టర్ గా పని చేస్తుంటాడు. అతగాడి స్వస్థలం మధ్యప్రదేశ్ లోని నీముచ్ జిల్లాకు చెందిన వాడు.

ఉద్యోగంలో భాగంగా ఢిల్లీలో పని చేస్తున్న అతడు.. కరోనా వేళ తన ప్రాణాల్ని లెక్క చేయకుండా రోగులకు సాయం చేసేందుకు విపరీతంగా తపించేవాడు. కరోనా బారిన పడిన వారి పట్ల మిగిలిన వారి కంటే మిన్నగా శ్రద్ధ చూపించేవాడు. వారికి సరైన వైద్యం అందించటం కోసం తపించేవాడు. అలాంటి జోగిందర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. తీవ్రత ఎక్కువ కావటంతో ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ ఇచ్చినా.. కరోనాను జయించే విషయంలో ఫెయిల్ అయ్యాడు. దీంతో.. జూన్ 27న అతడు కరోనా చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

అతడి మీదనే ఆధారపడిన కుటుంబానికి.. చెట్టంత కొడుకు తిరిగి రాని లోకాలకు పయనం కావటం తీరని వేదనగా మారింది. జోగిందర్ గురించి తెలుసుకున్న ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా పిలిపించి మరీ.. అతడి త్యాగానికి ప్రభుత్వ సాయంగా కోటిరూపాయిల మొత్తాన్ని చెక్కురూపంలో అందించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. కరోనా వారియర్స్ గా పలువురు మరణించారు. డ్యూటీలో భాగంగా మరణించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ ను గుర్తించి.. వారి కుటుంబాలకు దన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది కదా? వరాల దేవుళ్లకు ఇలాంటి ఆలోచనలు ఇటీవల కాలంలో ఎందుకు రానట్లు.? అన్నది ప్రశ్నగా మారింది.  
Tags:    

Similar News