అమెరికాలో లాక్ డౌన్ ఎందుకు లేదో చెప్పారు

Update: 2020-04-07 05:00 GMT
నిన్నటి కేసీఆర్ మీడియా సమావేశాన్ని లైవ్ లో చూసిన వారందరికి.. ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కరోనాను కంట్రోల్ చేయాలంటే లాక్ డౌన్ కు మించిన మందు లేనే లేదని.. అందుకే అందరూ ఇంటికే పరిమితం కావాలని చెప్పటం కనిపిస్తుంది. సాంకేతికత.. మౌలిక సదుపాయాలు అంతంతమాత్రంగా ఉండే మన దేశంలో లాక్ డౌన్ అనే మందుతోనే కరోనాను కంట్రోల్ చేయగలమని.. అంతకు మించిన మార్గం మరొకటి లేదన్న మాట ఆయన పదే పదే చెప్పారు.

ఇదంతా విన్నప్పుడు అమెరికాలో ఇప్పటివరకూ లాక్ డౌన్ ఎందుకు విధించలేదు? దేశాలకు దేశాలు లాక్ డౌన్ విధిస్తే.. ట్రంప్ సర్కారు మాత్రం ఆ నిర్ణయాన్ని ఎందుకు అమలు చేయటం లేదు ఎందుకు? లాక్ డౌన్ లేని కారణంగానే అమెరికాలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నట్లుగా ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటివేళ.. ప్రవాసాంధ్రుడు కమ్ అమెరికాలోని అలబామా రాష్ట్రంలోని సౌత్ ఈస్ట్ హాస్పిటల్స్ డైరెక్టర్  డాక్టర్ రవి నల్లమోతు కీలక అంశాన్ని చెప్పుకొచ్చారు.

అమెరికాలో లాక్ డౌన్ ను ఎందుకు విధించలేదన్న విషయంపై ఆయన స్పందిస్తూ..అమెరికన్లు జీతంగా వచ్చే సంపాదన మొత్తాన్ని పైసా మిగల్చకుండా ఖర్చు చేయటానికి అలవాటు పడ్డారని.. జీతాలు రాకపోతే అక్కడి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని.. అందుకే లాక్ డౌన్ విధించలేదన్నారు. ఈ పరిస్థితి కారణంగానే అమెరికా లాక్ డౌన్ విధించలేక పోతుందన్నారు. అదే.. అమెరికాకుసమస్యగా మారిందన్న ఆయన.. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో జన జీవనం స్తంభించిపోయినట్లు చెప్పారు.

తాను ఉంటున్న అలబామా తో పాటు పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నట్లు చెప్పారు. నెల రోజుల సెలవుల కోసం తాను మార్చిలో భారత్ కు వచ్చారనని.. అయితే.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తనను వెంటనే అమెరికాకు రావాలని ఆసుపత్రి నుంచి వచ్చిన పిలుపుతో తాను వచ్చేసినట్లు చెప్పారు. వైద్య సౌకర్యాలు నామమాత్రంగా ఉండే భారత్ లో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించి చాలా మంచి పని చేసిందని.. అమెరికాలాంటి పరిస్థితి భారత్ లో ఏర్పడితే ఏమీ చేయలేని తీరుతో పరిస్థితులు ఉంటాయన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాలో కరోనా కేసు ఒక్కటి కూడా లేకుండా ఉండే పరిస్థితి రావాలంటే కనీసం నెల రోజులు పడుతుందని చెప్పారు.
Tags:    

Similar News