బతికున్న ఆ ఎంపీని వికీపీడియా చంపేసింది

Update: 2016-03-10 03:56 GMT
ఆమె ఒక ఎంపీ. కానీ.. ఆమెకు వచ్చి పడిన సమస్యకు పరిష్కారం తోచక.. ఆమె పార్లమెంటులోనే తన గోడును వెళ్లబోసుకుంది. ఆమె ఎదుర్కొంటున్న సమస్య విన్న ఎంపీలంతా విస్మయం చెందిన పరిస్థితి. ఇలాంటి ఇబ్బంది ఎవరికో కాదు.. అధికారపక్షానికి చెందిన బీజేపీ ఎంపీ అంజుబాలకు ఎదురైంది. తన గురించి వికిపీడియాలో ఉన్న పేజీని ప్రస్తావించిన ఆమె.. అందులో తాను చనిపోయినట్లు ఉందన్నారు.

ప్రశ్నోత్తరాల సమయంలో తాను ఎదుర్కొంటున్న సమస్యను ప్రస్తావించిన ఆమె.. తాను చనిపోయినట్లుగా వికీపీడియాలో ఉందని.. ఆ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే తనకు సిగ్గుగా ఉందని ఆమె పేర్కొన్నారు. తన మరణం గురించిన ఫోన్ కాల్స్ తన సెక్రటరీకి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం ఏమిటని సూటిగా అడిగిన ఆమె ప్రశ్నకు స్పీకర్ సుమిత్రా మహాజన్ కేంద్రన్యాయమంత్రి సదానందగౌడ దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో స్పందించిన మంత్రి సదానంద.. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తామని.. సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒక ఎంపీకి సంబంధించి వికీపీడియాలో తప్పుడు సమాచారం అందించటం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని.. దీనిపై చర్యలు తప్పవని తేల్చారు. మరి.. సదానంద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
Tags:    

Similar News