కోట్లకు కోట్లు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడం.. రంగుటద్దాల్లో వ్యాపారాభివృద్ధిని చూపించడం.. పొరపాటున అప్పిచ్చిన బ్యాంకు చెల్లింపు నోటీసు ఇచ్చేసరికి ఏ లండన్‌కో.. ఆస్ట్రేలియాకో చెక్కేయడం.. ఇదీ ఇవాళ పరిస్థితి. ఒక మధ్యతరగతి వ్యక్తి ఓ ఇల్లు కట్టుకోవడానికి రుణమడిగితే.. భూతద్దాలు పెట్టుకొని మరీ తప్పులు వెతుకుతూ.. నెలలపాటు తిప్పుకొనే బ్యాంకు అధికారులకు మాల్యాలు.. మోదీలు - కొఠారీలకు అప్పులివ్వడంలో ఎలాంటి లొసుగులు కనిపించవు.. నిబంధనలు వర్తించవు. మామూలు వ్యక్తి ఒక నెల డిఫాల్ట్ అయితే.. ఎస్సెమ్మెస్ - మెయిల్ - ఫోన్ సందేశాలు ఠంచన్ గా వచ్చేస్తాయి. అవసరమైతే ఎగ్జిక్యూటివ్ లు వచ్చి మరీ డబ్బులు వసూలు చేసుకొని పోతారు. కానీ వేల కోట్ల అప్పు తీసుకొన్న వాడివైపు కన్నెత్తిచూసే సాహసం బ్యాంకులు చెయ్యవు. ఎవరో ఒకరి పేరు మీడియాలో హల్‌చల్ అయితే.. అప్పుడు తీరిగ్గా కేసులు - దాడులు - సోదాలు.. ఇవి బ్యాంకులు కామన్ గా చేసే తంతు. ఇండ్లల్లో మామూలు కన్నమేసే దొంగలను మించిన బందిపోట్లు వీళ్లు. దేశం మొత్తంమీద అన్ని బ్యాంకుల్లో వీళ్లు కుచ్చుటోపీ పెట్టిన మొత్తం ఎంతో తెలుసా? అక్షరాలా పది లక్షల కోట్ల రూపాయలు. అంటే భారత దేశ సాధారణ వార్షిక బడ్జెట్ లో సగమన్నమాట. ఇదంతా ప్రజలది. అంటే మనందరిది. మన సొమ్మును బ్యాంకుల నుంచి దర్జాగా దోచుకొనిపోయినవాళ్లు జల్సా చేస్తున్నారు. కోట్లకు కోట్లు దోచిపెట్టిన బ్యాంకులు ఇందులో తమ వంతు బాధ్యతను పక్కనపెట్టి.. ఓ కేసు వేసి చేతులు దులిపేసుకొంటున్నాయి. కామన్ మ్యాన్ మాత్రం అప్పులతిప్పలు పడుతూనే ఉన్నాడు. బ్యాంకుల నోటీసులకు జడుసుకుంటూనే ఉన్నాడు.
తాజా పరిస్థితి గురించి స్పందిస్తూ `బ్యాంకుల్లో ఖాతాలు మొదలుపెట్టండని ప్రధానమంత్రి పిలుపునిస్తారు. ఇంట్లో సొమ్మంతా తెచ్చి బ్యాంకుల్లో పెట్టేందుకు పెద్దనోట్లను రద్దు చేసేస్తారు. చెమటోడ్చి సంపాదించిన డబ్బు బ్యాంకుల్లో సురక్షితం గా ఉంటుందని నమ్మి జమచేస్తే.. ఆ సొమ్ముతో మరొకడు సోకు చేసుకొంటాడు. ప్రజలు తమపై ఉంచిన అపార నమ్మకాన్ని బ్యాంకులు కంపెనీలకు తాకట్టు పెడుతున్నా యి. జనం సొమ్మును బడాబాబులకు ధారాదత్తం చేస్తున్నాయి. సామాన్యుడు అప్పుకోసం వస్తే సవాలక్ష ఆంక్షలు పెట్టే బ్యాంకు అధికారులు సూటుబూటు వ్యాపారులను మాత్రం గుడ్డిగా నమ్మేస్తున్నారు. సామాన్యుడు దాచుకొన్న డబ్బు అప్పనంగా బడా కంపెనీల ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నారు. రాజుల సొమ్ము రాళ్ల పాలన్న సామెత ఇప్పు డు తిరగబడింది. సామాన్యుడు రాళ్లు కొట్టి కూడబెట్టిన సొమ్ములు కార్పొరేట్ బడాబాబుల పాలయిపోతున్నాయి` అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
లిక్కర్ డాన్ విజయ్ మాల్యా బ్యాంకులను తొమ్మిదివేల కోట్లకు పైగా ముంచి లండన్ పారిపోయిన క్రమంలోనే తాజాగా వెలుగుచూసిన పీఎన్బీని ముంచిన నీరవ్ మోడీ వ్యవహారం దేశ బ్యాంకింగ్ వ్యవస్థ పనితీరును ప్రశ్నార్థకం చేసింది. మాల్యాలు - మోడీలకు తోడు కొత్తగా విక్రమ్ కొఠారీ బాగోతం తెరమీదకు వచ్చింది. ఇట్లాంటి వాళ్లు చాలామందే ఉన్నారంటూ ఆర్బీఐ ప్రకటించింది. వీళ్లంతా కలిసి బ్యాంకులను ముంచిన మొత్తం సొమ్ము దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు. అంటే.. మన దేశ వార్షిక బడ్జెట్ (రూ. 24 లక్షల కోట్లు) మొత్తంలో దాదాపు నలభై శాతం అన్నమాట. దేశంలో పది రాష్ర్టాల వార్షిక బడ్జెట్ తో ఇది సమానం. తాజాగా బయటపడ్డ నీరవ్ మోడీ - విక్రం కొఠారీల లెక్కలు కాకుండా భారత రిజర్వ్ బ్యాంకు తేల్చిన లెక్కలివి.
మన తెలుగు రాష్ర్టాల్లోనూ నీరవ్ మోడీల్లాంటి ప్రబుద్ధులు ఉన్నారు. తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు బ్యాంకులను ముంచిన మొత్తం రూ. 50వేల కోట్ల పైమాటేనని లెక్కతేల్చింది. ఇందులో సింహభాగం హైదరాబాద్ కేంద్రంగా వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న ల్యాంకో ఇన్ ఫ్రాటెక్ దే. ల్యాంకో ఇన్ ఫ్రాటెక్ బ్యాంకులకు ఎగవేసిన రుణం మొత్తం రూ.44 వేల కోట్లుగా ఆర్బీఐ పేర్కొంది. నీరవ్ మోడీ - విక్రమ్ కొఠారీల ఉదంతంతో మరింత అప్రమత్తమైన ఆర్ బీఐ ఇప్పటివరకు మూడు జాబితాలను విడుదల చేసింది. మూడో జాబితాలో రూ.100 కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు రుణాలను ఎగవేసినవారి పేర్లను వెల్లడించింది. అందులో తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు - కంపెనీలు ఎగవేసిన రుణాలు దాదాపు రూ. ఆరువేల కోట్ల వరకు ఉన్నట్లు ప్రాథమిక అంచనా. ఈ జాబితాలో ఎగవేతదారుల మొండి బకాయిలు రూ.49 వేల కోట్లుగా తేలింది.
దేశవ్యాప్తంగా తాము చెల్లించలేమని పూర్తిగా చేతులెత్తేసిన సుమారు 36 కంపెనీల నుంచి సొమ్మును వసూలు చేసే బాధ్యతను ఆర్బీఐ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కు అప్పగించింది. ఆ రుణాల విలువ.. అక్షరాలా ఎనిమిదిన్నర లక్షల కోట్లు. ఈ పరిస్థితి దేశ ఆర్థిక వ్యవస్థనే కుదిపేసేలా మారింది. కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన సమయంలో మొత్తం దేశంలో చలామణీలో ఉన్న నగదు రూ.15 లక్షల కోట్లు.. కానీ బడావ్యాపారులు బ్యాంకులకు ఎగవేసిన మొత్తం ఎంతో తెలుసా? అక్షరాలా రూ.పది లక్షల కోట్లు. బ్యాంకులలో దాచుకున్న ప్రజల సొమ్మును రుణాల రూపంలో ఘరానా మోసగాళ్లకు అప్పనంగా అప్పజెప్పి బ్యాంకులు నెత్తిన చేతులు పెట్టుకుంటున్నాయి. మొండిబకాయిలు ఎటూ తేలక ఆర్బీఐ 36 కేసులను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు అప్పగించింది. 36 కేసుల్లో విల్ ఫుల్ డిఫాల్టర్ల సంఖ్యే ఎక్కువ. ఇది దేశ బ్యాంకింగ్ రంగానికే పెద్ద సవాల్‌గా మారింది.