ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ కలలు ఫలిస్తాయా?

Update: 2022-12-14 00:30 GMT
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ను రెండుగా విభజించి కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ లో నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది. 2014, 2019ల్లో ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ సీటూ, ఎంపీ సీటునూ గెలుచుకోలేకపోయింది. ఇంకా గట్టిగా చెప్పాలంటే అసలు ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి ఏ స్థానంలోనూ డిపాజిట్లు కూడా రాలేదు.

రాష్ట్రాన్ని విభజించడం, మరోవైపు వైఎస్‌ జగన్‌ కొత్త పార్టీని ఏర్పాటు చేసుకోవడం వంటి కారణాలతో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న నేతలంతా టీడీపీ, వైసీపీ, జనసేన వంటి పార్టీల్లో చేరిపోయారు. ఒకరిద్దరు బీజేపీలో సైతం చేరారు. ఇక కాంగ్రెస్‌ లో మిగిలింది కేవీపీ రామచంద్రరావు, సాకే శైలజానాథ్, రఘువీరారెడ్డి, పల్లంరాజు, తులసిరెడ్డి, చింతా మోహన్, సాయిప్రతాప్, జేడీ శీలం, ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ వంటి నేతలే. వీరిలోనూ చాలామంది క్రియాశీలకంగా లేరు. కాంగ్రెస్‌ కార్యకలాపాల్లో కనిపించడం లేదు.

కాగా ఇటీవల కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన వచ్చాక ఏపీకి కూడా గిడుగు రుద్రరాజును పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో 2024 నాటికి కాంగ్రెస్‌ ను బలోపేతం చేయాలనే లక్ష్యంతో గిడుగు రుద్రరాజు ఉన్నారని చెబుతున్నారు.

కాంగ్రెస్‌ ను బలోపేతం చేసే క్రమంలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు రెండు లక్ష్యాలను తన ముందు పెట్టుకున్నారని చెబుతున్నారు. అందులో ఒకటి పాదయాత్ర చేయడం, రెండోది కాంగ్రెస్‌ లో పాత నేతలందరినీ కలసి మళ్లీ పార్టీలో చేరాలని కోరడం.

ఇప్పటికే జనసేనాని పవన్‌ కల్యాణ్‌ బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. మరోవైపు జనవరి నెల చివరి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాదయాత్రకు రెడీగా ఉన్నారు. మరోవైపు వైసీపీ ఉండనే ఉంది. బీజేపీ సైతం ఏపీ వ్యాప్తంగా 5 వేల వీధి సభలు నిర్వహిస్తామని చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని గిడుగు రుద్రరాజు పెద్ద లక్ష్యాలే పెట్టుకున్నారు.

కాంగ్రెస్‌ కు వచ్చే ఎన్నికల్లోనూ ఎలాంటి ఆశలు కనిపించడం లేదు. అయితే గిడుగు రుద్రరాజు మాత్రం పాదయాత్ర చేస్తానని, గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తానని చెబుతున్నారు.

పార్టీకి దూరమయినవారిని, పార్టీలో చురుగ్గా లేనివారిని సైతం యాక్టివ్‌ చేయాలని కంకణం కట్టుకున్నారు. మరి ఆయన ఆశలు ఎంతవరకు ఫలిస్తాయో వేచిచూడాల్సిందే!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News