ద్రౌప‌ది ముర్ముకు ఆ రాష్ట్రం నుంచి ఒక్క ఓటు కూడా రాదా?

Update: 2022-06-30 06:14 GMT
జూలై 18న జ‌రగ‌నున్నరాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మి త‌ర‌ఫున గిరిజ‌న అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ము ఎంపికైన సంగ‌తి తెలిసిందే. కాగా ప్ర‌తిప‌క్షాల త‌ర‌ఫున కేంద్ర మాజీ మంత్రి య‌శ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. అయితే బీజేపీకి ఎన్డీయే కూట‌మిలోని పార్టీల‌తోపాటు బ‌య‌ట నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఒడిశాలోని బిజూ జ‌నతాద‌ళ్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీలు కూడా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. దీంతో ద్రౌప‌ది ముర్ము గెలుపు ఖాయంగా క‌నిపిస్తోంది.

అయితే.. ద‌క్షిణ భార‌త‌దేశంలో కేర‌ళ నుంచి ద్రౌప‌ది ముర్ముకు ఒక్క ఓటు కూడా ప‌డ‌ద‌ని ప‌లు వార్తా క‌థ‌నాలు తెలుపుతున్నాయి. ఆ రాష్ట్రం నుంచి దాదాపుగా అన్ని ఓట్లు విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకే పడ‌తాయ‌ని చెబుతున్నారు.

కేర‌ళ‌లో 140 మంది ఎమ్మెల్యేలు, 29 మంది ఎంపీలు (లోక్ స‌భ‌, రాజ్య‌స‌భ క‌లిపి) ఉన్నారు. అయితే ఇందులో బీజేపీ వారు కానీ, ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ప‌క్షంలోని పార్టీల‌కు కానీ ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ కూడా లేరు.  

కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్, ప్ర‌తిప‌క్షంలో ఉన్న యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కూటములు రెండూ యశ్వంత్ సిన్హాకే ఓటు వేస్తాయని అంటున్నారు. దీంతో ఈ రాష్ట్రం నుంచి ఓట్లన్నీ గంపగుత్తగా య‌శ్వంత్ సిన్హాకే ప‌డ‌తాయ‌ని చెబుతున్నారు.

కేరళ అసెంబ్లీలో మొత్తం 140 మంది ఎమ్మెల్యేల ఓట్ల విలువ.. 21,280. అదేవిధంగా లోక్‌సభ 20, రాజ్యసభ 9 కలిపి 29 మంది ఎంపీల ఓట్ల విలువ.. 20,300. మొత్తంగా కేరళలో 41,580 ఓట్లున్నాయి. ఇందులో అధికార కూటమి ఎల్‌డీఎఫ్‌కు 22,048 ఓట్లు ఉండ‌గా, ప్ర‌తిప‌క్ష‌ కూటమికి యూడీఎఫ్‌కు 19,532 ఓట్లు ఉన్నాయి.

సీపీఎం, కాంగ్రెస్ పార్టీల నేతృత్వంలోని ఈ పార్టీల కూటముల ఓట్లు ద్రౌప‌ది ముర్ముకు ప‌డే ప్రసక్తే లేదని అంటున్నారు. ఇప్ప‌టికే సీపీఎం, కాంగ్రెస్ రెండూ యశ్వంత్ సిన్హాకే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. ఆయ‌న రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేసిన‌ప్పుడు పాల్గొన్నాయి. ఈ నేప‌థ్యంలో కేర‌ళ‌లో ఓట్ల‌న్నీ య‌శ్వంత్ సిన్హాకే ప‌డ‌తాయ‌ని చెబుతున్నారు. ఇదే జరిగితే ద్రౌప‌ది ముర్ముకి ఒక్క ఓటు కూడా ప‌డ‌ని రాష్ట్రంగా కేరళ నిలుస్తుంది.
Tags:    

Similar News