వీళ్ళిద్దరి మధ్య భేటీ జరుగుతుందా?

Update: 2022-10-26 04:59 GMT
ఇపుడిదే అంశంపై పార్టీలో సీనియర్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. విశాఖపట్నం లోక్ సభ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి మధ్య నివురుగప్పిన నిప్పులాగున్న వివాదాలు ఒక్కసారిగా రోడ్డునపడిన విషయం తెలిసిందే. చాలాకాలంగా ఇద్దరి మధ్య విభేదాలున్నా  ఇంతకాలం ఒకళ్ళ జోలికి మరొకళ్ళు వెళ్ళని కారణంగా వివాదాలు రోడ్డున పడలేదు. కానీ ఇపుడు ఏకంగా మీడియా సమావేశాలు పెట్టుకుని ఒకళ్ళపై మరొకళ్ళు ఆరోపణలు, విమర్శలు మొదలుపెట్టారు.

ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో ఏ పార్టీ అయినా నేతల మధ్య విభేదాలను పరిష్కరించుకోవాలనే అనుకుంటుంది. కానీ వైసీపీలో మాత్రం దానికి రివర్సులో నడుస్తోంది. ఒకళ్ళపై మరొకళ్ళు చేసుకున్న ఆరోపణల కారణంగా పార్టీ పరువు బజారున పడినట్లయ్యింది. దీంతో జగన్మోహన్ రెడ్డి ఇద్దరి విషయంలో సీరియస్ అయ్యారు. ఇద్దరికీ ఫోన్ చేసి బాగా క్లాసు పీకినట్లు సమాచారం. దాంతో మళ్ళీ ఇద్దరు నోరిప్పలేదు.

క్లాసు పీకటమే కాకుండా వాళ్ళ మధ్య వివాదాలను కూర్చుని పరిష్కరించుకోమని సూచించారట. రాబోయే ఎన్నికల్లో ఇద్దరు కలిసి  పని చేయాల్సిన వాళ్ళు గొడవలు పడుతు పార్టీపరువు తీసేయటం ఏమిటని నిలదీసినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.

ఎంవీవీ ఏమో మొదట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిల్డర్ గా ఉంటు రాజకీయాల్లోకి దూకారు. కాబట్టి రాజకీయాల్లో ఎంపీ కంటిన్యూ అవదలచుకుంటే సాయి రెడ్డితో భేటీ విషయంలో ఆసక్తి చూపుతారు. లేకపోతే తనదారి తాను చూసుకోవటం ఖాయం.

మరి ఎంపీ మనసులో ఏముందో ఎవరికీ తెలీటంలేదు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేద్దామని అనుకుంటున్నారా ? లేకపోతే ఒకసారి ఎంపీ అయ్యాను కాబట్టి ఇక రాజకీయాలు అవసరం లేదని అనుకుంటున్నారా అన్నదే తేలటం లేదు.

నేతల మధ్య వివాదాల కారణంగా పార్టీకి నష్టం జరిగేట్లుగా ఉంటే జగన్ ఏమాత్రం సహించటంలేదు. ఈ కారణంగానే కొత్తపల్లి సుబ్బరాయుడు, రావి వెంకటరమణ, డీవై దాసులను పార్టీ నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మరి ఎంపీలిద్దరు కూర్చుని మాట్లాడుకుంటారా ? అన్నదే ఆసక్తిగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News