పోలవరం ఫెయిల్ స్టోరీ 1: ఈ ప్రశ్నలకు జవాబులు చెబుతారా జగన్?

Update: 2022-09-20 10:30 GMT
ఒకటి తర్వాత ఒకటి చొప్పున ప్రతి అంశంపై తన వాదనను వినిపిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వాస్తవాల్ని తనకు అనుకూలంగా.. వాదనల్లో తనది మాత్రమే వినిపిస్తున్న ఆయన.. అందులోని విషయాల్ని.. వివరాల్ని తనదైన రీతిలో చెబుతున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. మొన్నటికి మొన్న రాజధాని అమరావతి విషయంలో తన వాదనను వినిపించిన జగన్ తీరుతో చాలామంది విస్మయానికి గురయ్యారు. అందరికి తెలిసిన చాలా విషయాల్ని తనకు అనుకూలంగా వాదనలు వినిపించిన టాలెంట్ చూసినోళ్లు జగనా మజాకా? అని ఆశ్చర్యపోతున్నారు. అమరావతిపై తన అడ్డగోలు వాదనను అసెంబ్లీని వేదికగా చేసుకున్న సీఎం జగన్.. తాజాగా పోలవరంపై కూడా ఇదే తీరులో వ్యవహరించారన్న విమర్శ వినిపిస్తోంది.

పోలవరం ప్రాజెక్టును ఫలానా తేదీలోపు నిర్మించేస్తామంటూ సినిమాల్లో మాదిరి సినిమాటిక్ డైలాగుల్ని చెప్పిన మాజీ మంత్రి.. ఆ తర్వాత ఏమైందో అందరికి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి చంద్రబాబు హయాంలో కనిపించిన వేగం.. జగన్ పాలనలో ఏమైందన్న సామాన్యుడి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇలాంటివేళ.. సీఎం జగన్ మాత్రం.. తనదైన వాదనతో పోలవరం ప్రాజెక్టు ఆలస్యం మొత్తం మూడున్నరేళ్ల క్రితం ముగిసిన చంద్రబాబు సర్కారుదే అంటూ చెప్పిన మాటలు కొత్త చర్చకు తెర తీశాయి.

నిజంగానే చంద్రబాబు ప్రభుత్వంలో తప్పులు జరిగి.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైతే.. తాను అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఈ విషయాల్ని ఎందుకు చెప్పలేదు? అన్నది ఒక ప్రశ్న అయితే.. ఒకవేళ నిజంగానే డ్యామేజ్ జరిగితే.. చంద్రబాబు హయాంలో జరిగిన డ్యామేజ్ ను సరిదిద్దటానికి సమర్థుడైన సీఎం జగన్ కు చేత కాలేదా? అన్నది మరో ప్రశ్న. తన వాదనను వినిపించిన జగన్.. పలువురు సంధిస్తున్న ఈ ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పగలరా? అని ప్రశ్నిస్తున్నారు. అవేమంటే..

- పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్ డ్యాం గ్యాప్ లను పూడ్చాల్సింది ఎవరు?

-  కేవలం 380 మీటర్ల గ్యాప్ ఒక చోట.. 300 మీటర్ల గ్యాప్ మరో చోట పూడ్చి ఆ మేరకు పునరావాసం పూర్తి చేసి ఉంటే ఇంత విధ్వంసం జరిగేదా?

-  ఎగువ కాఫర్ డ్యాం గ్యాప్ లను సకాలంలో పూడ్చకపోవటం వల్లే తప్పు జరిగిందన్నది జగన్ చెబుతున్న తటస్థ నిపుణులు తేల్చారు. మరి.. ఈ చిన్నపాటి గ్యాప్ లను ముందు చూపు ఉన్న జగన్ సర్కారు ఎందుకు మిస్ అయినట్లు?

-  2019 మే లో పోలవరం అథారిటీ సమావేశంలో గ్యాప్ లను వదిలేయాలని చెప్పింది. ఆ తర్వాత వరదలు వచ్చి వెళ్లాయి. 2019 వరదల్లో గ్యాప్ ల ద్వారా నీళ్లు ప్రవహించినా ప్రధాన డ్యాం నిర్మించాల్సిన ప్రాంతంలో ఏమీ కోతలు పడలేదు. 2020లో వరదలు వచ్చే సమయానికి 8 నెలలు పనులు చేసుకునే వీలుంది. ఆ సమయంలో ఎగువ కాఫర్ డ్యాం గ్యాప్ లను పూడ్చి పూర్తి చేయాల్సిన బాద్యత ఎవరిది? ఫెయిల్యూర్ మరెవరిది?

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News