లోకేష్ మీద గెలిచినా ఇవ్వలేదు... రేపు భరత్ కి ఇస్తాడా...?

Update: 2022-08-05 07:30 GMT
జగన్ మాటల వరకే తప్ప చేతల మనిషి కాదు  అన్న మాట సొంత పార్టీలోనే ఉందిపుడు. మాట తప్పను మడప తిప్పను అన్న జగన్ ఆచరణలో చాలాసార్లు మడప తిప్పేశారు, మాట తప్పేసారు అన్న విమర్శలు అయితే గట్టిగా ఉన్నాయి. ఇదిలా ఉండగా జగన్ లేటెస్ట్ గా కుప్పం వైసీపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ భరత్ ని గెలిపించడండి, చంద్రబాబుని ఓడించండి అంటూ పిలుపు ఇచ్చారు. అలా కనుక చేస్తే వచ్చేసారి వైసీపీ అధికారంలోకి వచ్చినపుడు భరత్ కి మంత్రి పదవి ఇస్తాను అని భారీ హామీ ఇచ్చేశారు.

ఇక్కడే జగన్ హామీ మీద సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి అంటున్నారు. జగన్ తాను ఇచ్చిన మాటను ఇంతకు ముందు నిలబెట్టుకుని ఉంటే ఇపుడు భరత్ కి మంత్రి పదవి అంటే అంతా నమ్మేవారు. కానీ జగన్ గతంలో అనేక మందికి మంత్రి పదవి హామీ ఇచ్చారు. తీరా ఫలితాలు వచ్చి అధికారం దక్కాక వాటిని ఆయన సునాయాసంగా మరచిపోయారు అని అంటున్నారు.

మూడేళ్ళ క్రితం మంగళగిరి ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్ అన్న మాట గుర్తుండే ఉంటుంది. నాటి టీడీపీ మంత్రి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ని ఓడించి వైసీపీ అభ్యర్ధి ఆళ్ళ రామక్రిష్ణారెడ్డిని గెలిపిస్తే మంత్రిని చేస్తాను అని జనాల సాక్షిగా హామీ ఇచ్చారు. మీకు ఓడిపొతున్న మంత్రి కావాలా గెలిచే మంత్రి కావాలా అని కూడా జగన్ ప్రజలను సూటిగానే  ప్రశ్నించారు. తీరా ఆళ్ళ రామక్రిష్ణారెడ్డిని జనాలు గెలిపించారు. లోకేష్ ని ఓడించి పరాభవం చేశారు.

కానీ జగన్ మాత్రం రెండు సార్లు మంత్రి వర్గాన్ని విస్తరించినా కూడా  ఆళ్ళకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఇదీ ఆయన ఇచ్చిన హామీ వెనక ఉన్న అసలైన  డొల్లతనం. మరో వైపు చూస్తే ఇదే గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా విడదల రజనీని గెలిపిస్తే అక్కడ ఉన్న సీనియర్ నేత మర్రి రాజశేఖర్ కి మంత్రి పదవి ఇస్తాను అని జగన్ మరో హామీ ఇచ్చేశారు. దానికి తగినట్లుగానే ఆయన బాగా కష్టపడి రజనీ గెలుపునకు కృషి చేశారు.

చిత్రంగా బయట నుంచి టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి జగన్ని నానామాటలు ఒకనాడు అన్న విడదల  రజనీని మంత్రిని చేసిన జగన్ పార్టీ పుట్టిన నాటి నుంచి ఉన్న మర్రి రాజశేఖర్ కి మాత్రం ఉత్త చేతులే చూపించారు. దాంతో మర్రి వర్గం కుమలని సందర్భం  అంటూ లేదు. ఇపుడు ఆ మర్రి రాజశేఖ‌ర్ ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియదు. అంటే జగన్ హామీలు అలా నీటిమూటలు అయ్యాయని వైసీపీలోనే అనుకుంటున్న మాట.

ఇపుడు కుప్పంలో బాబుని ఓడిస్తే భరత్ కి మంత్రి పదవి అని జగన్ చెబుతూంటే కామెడీగానే ఉంది అని అంటున్నారు. ఇది నిజంగా క్యాడర్ తో పాటు జనాల చెవిలో పువ్వులు పెట్టే కార్యక్రమం అని అంటున్నారు. జగన్ తన హామీలను నిలబెట్టుకోలేదని తేలిపోయింది. ఇపుడు భరత్ కి మంత్రి అంటూ ఊరించినా జనాలు నమ్ముతారా అంతకంటే ముందు క్యాడర్ నమ్ముతుందా అన్నదే ఇక్కడ చూడాలి.

నిజానికి జగన్ కి అనేక అవకాశాలు ఉండి కూడా మర్రికి కానీ ఆళ్ళకు కానీ న్యాయం చేయలేకపోయారు అని కూడా అంటున్నారు. ఎందరికో పదవులు ఇచ్చిన జగన్ తాను హామీ ఇచ్చిన వారిని పక్కన పెట్టడం ద్వారా నిందలు మోస్తున్నారు. అంతే కాదు తన విశ్వసనీయతను కూడా తగ్గించుకున్నారు. ఈ నేపధ్యంలో జగన్ నోటి వెంట ఇలాంటి హామీలు రాకుండా ఉంటేనే మేలు అని కూడా అంటున్నారు.
Tags:    

Similar News