క‌మ‌ల్ ఎమ్మెల్యే అవుతారా..?

Update: 2021-03-13 09:26 GMT
అదేంటీ.. ఓ పార్టీ అధ్య‌క్షుడు, ఏకంగా ముఖ్య‌మంత్రి అవ్వ‌డానికి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తుంటే.. ఎమ్మెల్యే అవుతారా? అని అడుగుతున్నారేంటీ? అంటారా..! గ‌తానుభ‌వాలు.. త‌మిళ‌నాట ప్ర‌స్తుత‌ ప‌రిస్థితి చూస్తే.. ఇలాగే ఉంది మ‌రి! సినిమా స్టార్లు రాజ‌కీయాల్లో రాణించేలా ఒక‌ప్ప‌టి ప‌రిస్థితులు ఇప్పుడు లేవ‌న్న‌ది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. వెండితెర‌పై వెలుగొందిన వారు పొలిటిక‌ల్ స్క్రీన్ పై ఫ్లాప్ కావ‌డం చాలాసార్లు చూశాం.

త‌మిళ‌నాట ఇది ఇంకా స్ప‌ష్టం. అక్క‌డ రాజ‌కీయాల్లో ఉన్నంత మంది సినీస్టార్లు మ‌రే రాష్ట్రంలోనూ లేరంటే అతిశ‌యోక్తి కాదు. అయితే.. స‌క్సెస్ సాధించింది చాలా త‌క్కువ మంది. ర‌జ‌నీకాంత్ యుద్ధం మొద‌లు పెట్ట‌కుండానే వెన‌క్కి వెళ్లిపోగా.. మ‌రికొంద‌రు మ‌న‌కెందుకులే ఈ గోల అని సైలెంట్ గా ఉన్నారు.

అయితే.. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు డీఎంకే పార్టీకే ప‌ట్టం క‌ట్ట‌బోతున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. క‌మ‌ల్ పార్టీ ప‌రిస్థితి చూస్తే.. ఎక్క‌డా పెద్ద‌గా ఊపు క‌నిపించ‌ట్లేదు. దీంతో.. ప‌రిస్థితిని గ‌మ‌నించిన క‌మ‌ల్.. సింగిల్ గా ఏమీ చేయ‌లేమ‌ని డిసైడ్ అయ్యారు. వెంట‌నే పొత్తులకు సిద్ధ‌మ‌య్యారు. మ‌రో న‌టుడు శ‌‌ర‌త్ కుమార్ కు చెందిన ఆల్ ఇండియా స‌మ‌తువ మ‌క్క‌ల్ క‌ట్చి (ఏఐఎస్ఎంకే) తోపాటు, ఇండియ‌న్ జ‌న‌నాయ‌క క‌ట్చి (ఐజేకే) పార్టీల‌తో పొత్తు పెట్టుకున్నారు.

ఈ మేర‌కు మూడు పార్టీల మ‌ధ్య కుదిరిన ఒప్పందాన్ని వెల్ల‌డించారు. ఈ ఒప్పందం ప్ర‌కారం.. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాల్లో 154 చోట్ల క‌మ‌ల్ ఎంఎన్ఎం పోటీ చేయ‌నుంది. మిగిలిన 80 స్థానాల్లో ఐజేకే, ఏఐఎస్ఎంకే చెరో 40 చోట్ల బ‌రిలో నిల‌వనున్నాయి.

ఎన్ని చేసినా.. గెలుపు అంత ఈజీకాద‌ని, అస‌లు క‌మ‌ల్ ఒక్క‌డు ఎమ్మెల్యేగా గెలిచినా గొప్ప విష‌య‌మే అనే విశ్లేష‌ణ‌లు తెర‌పైకి వ‌చ్చాయి. అయితే.. మారిన ప‌రిస్థితుల ప్ర‌కారం ముఖ్య‌మంత్రి కావ‌డం సంగ‌తి అటుంచితే.. ఎమ్మెల్యేగా మాత్రం గెలిచే ఛాన్స్ ఉందంటున్నారు.

దీనికి కార‌ణం ఏమంటే.. కోయంబ‌త్తూర్ ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌ధాన పార్టీలేవీ బ‌రిలో లేవు. అన్నాడీఎంకే పొత్తులో భాగంగా బీజేపీకి ఆ సీటు ఇచ్చింది. డీఎంకే కాంగ్రెస్ కు వ‌దులుకుంది. దీంతో.. క‌మ‌ల్ ఈ సీటును ఎంచుకున్నారు. ఈ ప‌రిస్థితి త‌న ఇమేజ్ తోడైతే ఖ‌చ్చితంగా గెలుస్తాన‌నే ధీమాలో ఉన్నారు క‌మ‌ల్‌. అయితే.. దిన‌క‌ర‌న్ పార్టీ కూడా గ‌ట్టిపోటీ ఇచ్చే స్టేజ్ లో ఉంది. అన్నాడీఎంకే నుంచి చీలిన పార్టీనే కాబ‌ట్టి.. ఆ పార్టీ ఓట్లు కూడా ప‌డొచ్చ‌ని అంటున్నారు.

ఇలాంటి ప‌రిస్ధితుల్లో క‌మ‌ల్ ఎమ్మెల్యేగా గెలుస్తారా? లేదా? అన్న‌ది ఉత్కంఠ‌గా మారింది. మ‌రి, ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి.
Tags:    

Similar News