వార‌ణాసిలో మోడీపై పోటీకి ఆమె రెఢీ..!

Update: 2018-07-25 08:49 GMT
కొన్నిరోజులుగా వినిపిస్తున్న అంచ‌నాల‌కు భిన్నంగా 2019లోనే సార్వ‌త్రిక ఎన్నిక‌లు రానున్న విష‌యంపై క్లారిటీ వ‌చ్చేసింది. ఈ అక్టోబ‌ర్.. న‌వంబ‌రులోనే సార్వ‌త్రిక ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు వీలుగా మోడీ అండ్ కో రెఢీ అవుతుంద‌న్న మాట బ‌లంగా వినిపించింది. అయితే.. మారిన ప‌రిణామాల‌తో బీజేపీ వ్యూహం మారిన‌ట్లుగా చెబుతున్నారు. ప్ర‌జ‌లు త‌మ‌కు ఐదేళ్ల పాటు అధికారాన్ని ఇచ్చార‌ని.. త‌మ‌కిచ్చిన అధికారాన్ని ఒక్క గంట కూడా వ‌దులుకోవ‌టానికి తాను సిద్ధంగా లేన‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా స్ప‌ష్టం చేసిన వైనం తెలిసిందే.

దీంతో.. సార్వ‌త్రిక ఎన్నిక‌లు షెడ్యూల్ ప్ర‌కార‌మే జ‌రుగుతాయి త‌ప్పించి.. ముందుస్తుగా జ‌రిగేది లేద‌ని తేలిపోయింది. ఇదిలా ఉంటే..  ప్ర‌ధాని మోడీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వార‌ణాసిలో ఆయ‌న‌పై పోటీకి కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం స‌ర్ ప్రైజ్ కు ప్లాన్ చేస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఇంత‌కాలం త‌ల్లికి.. సోద‌రుడి ఎన్నిక‌ల ప్ర‌చారాల‌కు మాత్ర‌మే వ‌చ్చే కాంగ్రెస్ త‌రుపు ముక్క ప్రియాంక గాంధీ ఈసారి త‌న త‌ల్లికి బ‌దులుగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉందంటున్నారు. త‌న త‌ల్లి సోనియాగాంధీ ఆరోగ్యం స‌రిగా లేని నేప‌థ్యంలో.. ఈ సారి ఆమె ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వర‌ని చెబుతున్నారు. సోనియా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాయ‌బ‌రేలీ నుంచి ప్రియాంక పోటీ చేయ‌టానికి సిద్ధంగా లేర‌న్న మాట వినిపిస్తోంది.

రాయ‌బ‌రేలీకి బ‌దులుగా.. మోడీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వార‌ణాసి నుంచి పోటీకి దిగ‌నున్న‌ట్లుగా కాంగ్రెస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఎన్నిక‌ల్లో మోడీని ఓడించ‌టం ద్వారా త‌న రాజ‌కీయ అరంగ్రేటాన్ని సంచ‌ల‌నంతో స్టార్ట్ చేయాల‌న్న మాట వినిపిస్తోంది.

2014లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఘోర ప‌రాజ‌యం అనంత‌రం.. పార్టీలోకి ప్రియాంక రావాల‌ని.. ఆమె కీల‌క బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌న్న డిమాండ్ పెద్ద ఎత్తున వినిపించింది. అయితే.. ఈ విష‌యంలో ప్రియాంక సానుకూలంగా స్పందించ‌లేదు. చూసేందుకు దివంగ‌త ప్ర‌ధాని ఇందిర‌మ్మ పోలిక‌ల‌తో ఉన్న ప్రియాంక మీద కాంగ్రెస్ చాలానే ఆశ‌లు పెట్టుకుంది. రాహుల్ కు ప‌లు సంద‌ర్భాల్లో మెంటార్ గా ప్రియాంక వ్య‌వ‌హ‌రిస్తార‌న్న పేరు ఉంది. దీనికి తగ్గ‌ట్లే కీల‌క సంద‌ర్భాల్లో రాహుల్ వెన్నంటే ప్రియాంక ఉండ‌టం తెలిసిందే. ఒక‌వేళ‌.. ఇప్పుడు వినిపిస్తున్న అంచ‌నాలు నిజ‌మై.. ప్రియాంక కానీ వార‌ణాసి బ‌రిలో దిగి.. అక్క‌డ నుంచి మోడీ కానీ పోటీకి రెఢీ అయితే 2019 ఎన్నిక‌ల మొత్తంలో ఇదే భారీ అట్రాక్ష‌న్ గా మారుతుంద‌న‌టంలో సందేహం లేదు.
Tags:    

Similar News