లగడపాటి రీ ఎంట్రీ..: నరసరావుపేట నుంచేనా..?

Update: 2019-03-10 05:28 GMT
లగడపాటి రాజగోపాల్‌. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. ఆయన మాజీ ఎంపీ మాత్రమే కాదు. మాజీ రాజకీయ నాయకుడు కూడా.. రాజకీయాల్లో నాయకులను మాజీ అని ఎవరిని సంభోందించరు. కానీ లగడపాటికి మాత్రం ఆ బిరుదు వచ్చింది. ఎందుకంటే ఆయన చెప్పిన విధంగానే రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో లగడపాటి రాజగోపాల్‌ పాలిటిక్స్‌ నుంచి తప్పుకొన్నారు. ఈ పరిణామక్రమంలో ఐదేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు మళ్లీ ఎలక్షన్స్‌ వచ్చాయి. ఈ తరుణంలో లగడపాటి రాజగోపాల్‌ మరో సంచలనానికి సిద్ధమవుతున్నాడా..? అన్న చర్చ జోరుగా సాగుతోందట. ఎందుకంటే లగడపాటి రాజగోపాల్‌ మళ్లీ పాలిటిక్స్‌ వైపు చూస్తున్నారట. ఎంపీగా ఎన్నికల బరిలోకి దిగి ఓట్లు అడగబోతున్నారట.

గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి లగడపాటి రాజగోపాల్‌ ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడట. కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయ సన్యాసం తీసుకున్న ఆయన మళ్లీ టీడీపీలో చేరి పోటీ చేయనున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. గత కొంతకాలంగా లగడపాటి టీడీపీకి దగ్గరగా ఉంటున్నారు.సీఎం చంద్రబాబును అనేక పర్యాయాలు అమరావతిలో కలిశారు. అప్పటి నుంచి లగడపాటి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తాడా..? అన్న అనుమానాలకు బలం చేకూరుతోంది.

తాజాగా ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ తో లగడపాటి భేటి అయ్యారు. దీంతో ఆయన నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీకి సిద్ధమే అన్న వాదన వినిపిస్తోంది. నరసారావుపేట వైసీపీ సమన్వయ కర్తగా లాగు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. దీంతో ఆయనకే ఎంపీ టికెట్‌ ఇచ్చే సంకేతాలు వైసీపీ ఇస్తోంది. దీంతో ఆయనకు పోటీగా సరైన నాయకుడి కోసం టీడీపీ వెతుకుతోంది. ఈ తరుణంలో లగడపాటి ఖచ్చితంగా కృష్ణదేవరాయులుకు పోటీగా ఉంటారని చర్చ జోరుగా సాగుతోంది.

నరసరావుపేటలో మంచి పట్టున్న కోడెల శివప్రసాద్‌ తో లగడపాటి భేటి కావడంతో ఈ చర్చలకు బలం చేకూరుతోంది. రాజకీయాలకు దూరమైనా తన సర్వేలతో ప్రజల్లో ఆయన పేరు నిత్యం మారుమోగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లగడపాటి సర్వే అడ్డంగా అడ్డం పడింది. ఏపీ సీఎంకు అది బూస్ట్ అయ్యింది. ఫలితం మాత్రం తేడా కొట్టడంతో తెలంగాణ ప్రజల దృష్టిలో లగడపాటి విలన్ అయినా బాబుకు మాత్రం సన్నిహితుడయ్యారు. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో లేకపోయినా తన ఉనికిని చాటుకున్న లగడపాటిని చంద్రబాబు  నరసరావుపేట నుంచి పోటీ చేయించనున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది.
Tags:    

Similar News