ఎమ్మెల్యేల అక్రమాస్తుల కేసులో కేసీఆర్ కు సీబీఐ షాకిస్తుందా?

Update: 2022-12-30 11:39 GMT
నలుగురు భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన కేసును తెలంగాణ హైకోర్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)కు అప్పగించడంతో కేసు ఆసక్తికర మలుపు తిరిగింది.

భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని బట్టబయలు చేయడంలో అత్యుత్సాహం కారణంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఇప్పుడు మంచి అవకాశాన్ని చేజార్చుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో  ఉచ్చు బిగించే అవకాశం ఉందని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు భయపడుతున్నారు.

ఎమ్మెల్యేలు, ముగ్గురు నిందితుల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు, ఇతర పత్రాలతో సహా దర్యాప్తు అంశాలు ముఖ్యమంత్రికి ఎలా చేరాయనే కీలకమైన అంశాన్ని హైకోర్టు న్యాయమూర్తి బీ విజయసేన్ రెడ్డి తన తీర్పులో లేవనెత్తారు. ముఖ్యమంత్రికి ఎవరు ఆధారాలు ఇచ్చారనే ప్రశ్నలకు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు సమాధానం చెప్పలేకపోయారని న్యాయమూర్తి గమనించారు.

మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పైలట్ రోహిత్ రెడ్డి కూడా కేసీఆర్ పత్రాలను ఎలా పొందుతారనే దానిపై సమాధానం ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఇది కేంద్రానికి ఆయుధంగా మారింది. సాక్ష్యాధారాలు ముఖ్యమంత్రి వద్దకు ఎలా చేరాయని సీబీఐ ఇప్పుడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ప్రశ్నించనుంది. వారు సమాధానం ఇవ్వకపోతే, సాక్ష్యాలు ఎలా సంపాదించాయో తెలుసుకోవడానికి సిబిఐ ముఖ్యమంత్రికి సమన్లు కూడా జారీ చేసే అవకాశం ఉంది.

"సాక్ష్యాలను పోలీసులు లేదా ఎమ్మెల్యేలు అందించాలి. అయితే బీజేపీ ఎమ్మెల్యేలపై స్టింగ్ ఆపరేషన్‌కు ఎందుకు ఆదేశించారని కేసీఆర్‌ను సీబీఐ ప్రశ్నించనుంది. చివరగా ఇది బీఆర్ఎస్ కు పెద్ద తలనొప్పిగా మారుతుంది " అని  బీజేపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

గురువారం సంతోష్ మాట్లాడుతూ తనపై ఆరోపణలు చేసిన వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. "ఇప్పటి వరకు నేను తెలంగాణలో చెప్పుకోదగ్గ వ్యక్తిని కాదు. కానీ ఇప్పుడు కేసీఆర్ నన్ను పాపులర్ చేశారు. దానికి అతను మూల్యం చెల్లించకతప్పదు "అని బీఎల్ సంతోష్ హెచ్చరించడంతో ఇప్పుడు కేసీఆర్ మెడకు సీబీఐ చుట్టుకుంటుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News