చంద్రబాబు డిమాండ్ ను ప్రభుత్వం పట్టించుకుంటుందా ?

Update: 2020-11-29 10:37 GMT
ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై తనదైన స్టైల్లో డిమాండ్లు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలను పదిరోజులు నిర్వహించాలని, మీడియాను అనుమతించాలని, సమస్యలపై చర్చించాలంటూ అనేక డిమాండ్లు చేస్తున్నారు. నాలుగు రోజుల పాటే సమావేశాలు నిర్వహించాలని అనుకోవటం అంటే అసెంబ్లీలో సమస్యలు చర్చించకుండా పారిపోవటమేనంటున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చంద్రబాబు డిమాండ్ చేయటమే వృధా. ఎందుకంటే తాను అధికారంలో ఉన్నపుడు అప్పట్లో ప్రతిపక్షంగా వైసీపీ ఉన్నపుడు చేసిన డిమాండ్లను ఏరోజూ పట్టించుకోలేదు. అంతా తనిష్టం వచ్చినట్లే చేసుకున్నారు. చంద్రబాబే కాదు ఏ అధికారపక్షమైన తనిష్ట ప్రకారమే చేసుకుపోతుంది.

ఇంతచిన్న విషయాన్ని కూడా చంద్రబాబు మరచిపోవటమే ఆశ్చర్యంగా ఉంది. మరచిపోలేదంటే కావాలనే రచ్చ చేయటానికి మాత్రమే ఈ అంశంపై డిమాండ్ చేస్తున్నట్లుగా అనుకోవాలి. సభను ఎన్ని రోజులు నడపాలి, ఏ పద్దతిలో నడపాలన్నది పూర్తిగా అధికార పార్టీ ఇష్టమన్నదాంట్లో సందేహమే లేదు. కాబట్టి ఇఫుడు కూడా చంద్రబాబు అనవసరమైన డిమాండ్లను మానేసి సభ ఎన్ని రోజులు నడిపినా ఉన్నంతలోనే ప్రజాసమస్యలను ప్రస్తావించేందుకు ప్రయత్నించాలి. పైగా ప్రతిపక్షానికి సమయం, స్వేచ్చ ఇవ్వాలని డిమాండ్ విడ్డూరంగా ఉంది. తాను అధికారంలో ఉన్నపుడు వైసీపీ విషయంలో ఎలా వ్యవహరించింది గుర్తు చేసుకుంటే చాలు మళ్ళీ ఇటువంటి డిమాండ్ చేయరు.

ఇక మీడియాను అనుమతించాలనే డిమాండ్ విచిత్రంగా ఉంది. మీడియాను ఎవరు అడ్డుకోలేదు. కాకపోతే పరిమితుల ప్రకారమే మీడియాను అనుమతిస్తున్నారు. ఎందుకంటే మీడియా సభ్యులు ఎక్కువమంది వస్తే కూర్చునేందుకు సరైన సౌకర్యం లేకుండా కట్టింది తానే అన్న విషయాన్ని బహుశా చంద్రబాబు కన్వీనియంట్ గా మరచిపోయినట్లున్నారు. మీడియాకే కాదు కనీసం మంత్రుల చాంబర్లకు కూడా అటాచుడు బాత్ రూములు లేకుండా అసెంబ్లీని కట్టించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది.
Tags:    

Similar News