అలా చేస్తే మీకూ రూ.కోటి ఛాన్స్

Update: 2016-12-16 07:53 GMT
కస్టమర్లను ఆకట్టుకోవటానికి కొంగొత్త ఆఫర్లను ప్రకటించటం చూస్తుంటాం. అయితే.. ప్రభుత్వాలు ఇలాంటి ఆఫర్లు ప్రకటించటం చాలా చాలా తక్కువగా ఉంటుంది. తాజాగా ఆ లోటును తీర్చేలా మోడీ సర్కారు ఒక ఆఫర్ ను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ప్రజల్ని నగదు రహిత చెల్లింపులకు ప్రోత్సహించేలా చేయటంతో పాటు.. వ్యాపారులు సైతం తమ వ్యాపార లావాదేవీల్ని మొత్తంగా ఆన్ లైన్లో చేసేందుకు ప్రోత్సహించేందుకు వినూత్నమైన పథకాల్ని ప్రకటించింది.

ఇందుకోసం భారీ ఆఫర్ నే ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్ విధానంలో చెల్లింపులు జరుపుతూ ఉంటే.. అదృష్టం తలుపు తడితే ఏకంగా రూ.కోటి సొంతమయ్యే బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. వాణిజ్య సంస్థలు తమ బ్రాండ్ ను ప్రమోట్ చేసేందుకు వీలుగా ఎలాంటి పద్దతుల్ని అనుసరిస్తారో అదే రీతిలో.. లక్కీ డ్రాలను ప్రకటించటం విశేషం.

ఈ లక్కీ డ్రాలలో బంపర్ డ్రా.. మెగా బంపర్ డ్రా అంటూ ప్రకటించటమే కాదు.. ఇందుకోసం ఇచ్చే మొత్తాన్ని భారీగా ఉంచి అందరి దృష్టిని ఆకర్షించేలా చేసింది. క్రిస్మస్ రోజు స్టార్ట్ అయ్యే ఈ ఆఫర్ వంద రోజులు సాగనుంది. ఈ బంపర్ ఆఫర్ ను ఏప్రిల్ 14 తర్వాత ముగిస్తుందని ప్రకటించినా.. ప్రజల నుంచి వస్తున్న ఆదరణను పరిశీలించి.. ఈ పథకాన్ని కొనసాగించాలా? లేదా? అన్న అంశంపై తదుపరి నిర్ణయాన్ని తీసుకుంటారని చెబుతున్నారు.

ఇంతకీ ఈ ఆఫర్ ఏమిటి? ఇందుకోసం ఏం చేయాలి? కోటి రూపాయిల భారీ మొత్తం సొంతం చేసుకునే ఛాన్స్ ఎలా వస్తుంది? లాంటి అంశాలతో పాటు.. అసలీ ఆఫర్ ను ఎందుకు  ప్రవేశ పెట్టారన్నది చూస్తే ఆసక్తికరఅంశాలు కనిపిస్తాయి.

ఈ ఆఫర్ ఎందుకు?

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో.. నగదురహిత చెల్లింపుల్ని దేశ వ్యాప్తంగా ప్రోత్సహించాలన్నది అసలు ప్లాన్. అలా అని నగదు రహితంగా.. డిజిటల్ చెల్లింపులు చెల్లించమంటే ప్రజల దృష్టిని ఆకర్షించదు కాబట్టి.. కోటి రూపాయిలు మెగా డ్రా పెట్టటం ద్వారా అందరి దృష్టి డిజిటల్ పేమెంట్ల మీదకు మళ్లేలా చేశారని చెప్పాలి. ఈ ఆఫర్ రెండు రకాలుగా ఉంటుంది. ఇందులో మొదటిది సామాన్యులకైతే.. రెండోది వ్యాపారస్తులకు సంబందించింది.

సామాన్యల ఆఫర్ ఏంటి?

క్రిస్మస్ రోజు నుంచి రూ.50 నుంచి రూ.3000 మధ్య వరకూ జరిగే డిజిటల్ చెల్లింపులకు ఈ పథకాన్ని వర్తిస్తారు. దీన్ని.. లక్కీ గ్రాహక్ యోజనగా పిలుస్తారు. తొలి డ్రాను డిసెంబరు25న నిర్వహిస్తారు. మెగా డ్రా ను 2017 ఏప్రిల్ 14న నిర్వహిస్తారు. డిసెంబరు25 నుంచి ప్రతి రోజు జరిపే డిజిటల్ చెల్లింపులు జరిపిన వారిలో అదృష్టవంతుల్ని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. అదృష్టవంతులకు గరిష్ఠంగా రూ.లక్ష వరకూ చెల్లిస్తారు. ప్రతి రోజు 15వేల మందిని డ్రా ద్వారా ఎంపిక చేసి.. ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున బహుమతి ఇస్తారు. వారానికి తీసే వీక్లీ డ్రాలో 7వేల మందిని ఎంపిక చేసి రూ.5వేల నుంచి రూ.లక్ష వరకూ బహుమతిగా ఇస్తారు. అయితే.. ఈ డ్రాలో అర్హులు కావాలంటే రూపే కార్డులు.. యూపీఐ.. ఎన్ ఎన్ ఎన్ డీ.. ఆధార్ ఆధారిత చెల్లింపులు జరిపే వారికి మాత్రమే ఈ ప్రోత్సాహకాల్ని అందిస్తారు. ప్రైవేటు డెబిట్.. క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే చెల్లింపుల్ని పరిగణలోకి తీసుకోరు.

వ్యాపారస్తుల విషయానికి వస్తే..

సామాన్యులకు ఏ విధంగా అయితే లక్కీ గ్రాహక్ యోజన అని పేరుపెట్టారో.. వ్యాపారులకు డిజి ధన్ వ్యాపారి యోజనగా ఆఫర్ ప్రకటించారు. ఈ ఆఫర్ లో భాగంగా ప్రతి వారం డ్రా నిర్వహిస్తారు. 7వేల మందికి కనిష్ఠంగా రూ.2500 నుంచి రూ.50వేల వరకూ బహుమతిగా అందిస్తారు. ఏప్రిల్ 14న నిర్వహించే మెగా డ్రాలో విజేతలకు వరుసగా రూ.50లక్షలు.. రూ.25 లక్షలు.. రూ.5 లక్షలు అందిస్తారు. ఇందుకోసం నవంబరు 8 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిపిన డిజిటల్ లావాదేవీలను పరిగణలోకి తీసుకుంటారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News