ఇన్ఫీ, విప్రో ఎందుకు ఇలా హెచ్చ‌రించాయి?

Update: 2017-01-03 17:27 GMT
ప్రపంచ‌వ్యాప్తంగా ఐటీ సేవ‌ల రంగంలో పేరున్న ఇన్ఫోసిస్ - విప్రో చేసిన హెచ్చ‌రిక‌లు ఇటు ఉద్యోగుల్లో అటు మార్కెట్ విశ్లేష‌కుల్లో విభిన్న‌మైన అంచ‌నాకు వ‌స్తున్నాయి. కొత్త సంవత్సరం సందర్భంగా ఇన్ఫోసిస్ సిబ్బందికి సీఈవో విశాల్ సిక్కా అనూహ్య సందేశం ఇచ్చారు. నూత‌న ఏడాదిలో ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉందని, భవిష్యత్ ప్రయాణం అంత సులువు కాదని హెచ్చ‌రించారు.  కంపెనీ విలువను పెంచడంలో అలసత్వ ధోరణి పనికిరాదని ఆయన ఉద్యోగులను హెచ్చరించారు. బ్రెగ్జిట్, అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు - నోట్ల రద్దు -  డిజిటైజేషన్  - సైబర్ సెక్యూరిటీ సమస్యలు - పెద్ద దేశాలను పట్టి పీడిస్తున్న వలసలు - ఉగ్రవాదం తదితర ఎన్నో సమస్యలు ఐటీ రంగంపై ప్రభావం చూపుతున్నాయని సిక్కా అభిప్రాయపడ్డారు.  బాధ్యతల నిర్వహణలో అత్యున్నత ప్రతిభ కనబర్చడం సంస్థలో ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అని లేఖలో పేర్కొన్నారు. క్లయింట్లకు అద్భుతమైన పరిష్కారాలందించేందుకు చతురత ప్రదర్శించాలని, చురుకుగా వ్యవహరించాలని సిక్కా సూచించారు.

ఇక విప్రో చైర్మ‌న్ అజీం ప్రేమ్ జీ త‌న ఖాతాదారుల‌కు వినూత్న సందేశాన్ని అందించారు. స‌మాజం, మార్కెట్ ప‌రిస్థితులు, ప‌రిణామాలు వంటివ‌న్నీ దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాల‌ని సూచించారు.  జీవితంలోని సమస్యలు, వాటి పరిష్కారాలు ఈ సంబంధాలను బలోపేతం చేసుకోవడంలోనే ఉందని ప్రేమ్ జీ పేర్కొన్నారు. ఇటీవ‌లే రాజస్తాన్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లివ‌చ్చిన ప్రేమ్ జీ ఈ సంద‌ర్భంగా క‌వితాత్మ‌కంగా త‌న అభిప్రాయ‌లకు ఈ విధ‌మైన ప్రకృతితో కూడిన సందేశం అందించార‌ని భావిస్తున్నారు.ప్రత్యీ ఉద్యోగి  విలువలకు  చిత్తశుద్ధితో కట్టుబడి ఉండాలని 2016 లో ఎదునైన అడ్డంకులను, సవాళ్లను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాల‌ని ప్రేమ్ జీ కోరారు.

ఐటీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా రాజకీయ మరియు ఆర్థిక సంఘర్షణలు ఎదుర్కుంటున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న నేపథ్యంలో ఈ ఇద్ద‌రు ఐటీ దిగ్గ‌జాలు చేసిన హెచ్చ‌రిక‌లు ఐటీ ఉద్యోగుల‌ను ఆందోళ‌న‌లో ప‌డేశాయి. ప‌రిశ్ర‌మ ఔత్సాహికుల‌ను కూడా ఆందోళ‌న‌లో ప‌డేశాయని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News