స్క‌ర్ట్ వేసుకుంద‌ని... అరెస్ట్ చేశారే!

Update: 2017-07-19 07:09 GMT
ఇస్లామిక్ చ‌ట్టాల‌ను ప‌క్కాగా అమ‌లు చేస్తున్న దేశాల్లో మ‌హిళ‌లు దుర్భ‌ర జీవితాల‌ను గ‌డుపుతున్న వైనం మ‌న‌కు తెలియ‌నిదేమీ కాదు. ఎందుకంటే.. ఎప్ప‌టిక‌ప్పుడు తాము ఎంత దుర్భ‌ర జీవితాన్ని గ‌డుపుతున్నామో తెలుపుతూ ప‌లువురు ముస్లిం మ‌హిళ‌లు చేస్తున్న ఆందోళ‌న‌లు ఇటీవ‌లి కాలంలో మ‌రింత‌గా పెరిగాయి. గ‌తంలో ఈ త‌ర‌హా ఆందోళ‌న‌లు పెద్ద‌గా జ‌రిగిన దాఖ‌లా లేద‌నే చెప్పాలి. ఆ కార‌ణంగానే గ‌తంలో ఇస్తామిక్ కంట్రీస్‌ లో మ‌హిళ‌ల జీవ‌న స్థితిగతులు మ‌న‌కు పెద్ద‌గా తెలిసేవి కావు. మీడియా మ‌రింత క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం - సోష‌ల్ మీడియా విస్తృతి మ‌రింత‌గా పెరిగిన నేప‌థ్యంలో ఆయా దేశాల్లో ముస్లిం మ‌హిళ‌ల‌పై కొన‌సాగుతున్న ఆంక్ష‌లు - నిషేదాజ్ఞ‌లు ఇప్పుడు ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తూనే ఉన్నాయి.

తాజాగా ముస్లిం స‌మాజంతో పాటు అన్ని వ‌ర్గాల జ‌నం కూడా విస్తుపోయే ఓ ఘ‌ట‌న చోటుచేసుకుంది. సోష‌ల్ మీడియా కార‌ణంగానే వెలుగులోకి వ‌చ్చిన ఈ వార్త ఇప్పుడు వైర‌ల్‌ గా మారిపోయింద‌ని చెప్పాలి. సౌదీ అరేబియాలో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకెళితే... ఓ ప‌ర్యాట‌క ప్ర‌దేశానికి వెళ్లిన ఓ యువ‌తిని ఆ దేశ పోలీసులు ఏకంగా అరెస్ట్ చేసేశారు. అయినా కేవ‌లం టూరిజం స్పాట్‌ కు వెళితేనే అరెస్ట్ చేస్తారా అంటే... కేవ‌లం అక్క‌డికి వెళితేనే కాదు కానీ.. ఆ వెళ్లిన‌ప్పుడు ఆ యువ‌తి ధ‌రించిన దుస్తులు - కేశాలంక‌ర‌ణ‌లే ఆమెను ఇబ్బందుల్లోకి నెట్టాయి. ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌కు వెళ్లేట‌ప్పుడు మ‌నం కాస్తంత కేర్ ఫ్రీగానే కాకుండా... ఉల్లాసంగా గ‌డిపేందుకు అనువుగా వెళ‌తాం క‌దా. ఆ యువ‌తి కూడా అలాగే భావించి కేశాల‌ను దువ్వ‌కుండా వ‌దిలేసి, స్క‌ర్ట్ - క్రాప్ టాప్ ధ‌రించి వెళ్లింద‌ట‌.

అలా వెళ్లి ఇలా వ‌చ్చేసినా స‌రిపోయేదేమో... తాను చూసింది చారిత్ర‌క ప‌ర్యాట‌క ప్ర‌దేశాన్ని అని ఆ యువ‌తి ప్ర‌పంచానికి చెప్పాల‌నుకుంది. అంతే... తాను ఆ ప్ర‌దేశాన్ని సంద‌ర్శిస్తున్న సంద‌ర్భంగా తీసిన వీడియోను ఆమె సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన సౌదీ వాసులు ఆమెపై ఆగ్ర‌హోద‌గ్రుల‌వుతున్నారు. ఎందుకంటే...ఇస్లామిక్‌ రాజ్యమైన సౌదీ అరేబియాలో వస్త్రధారణపై కఠినమైన ఆంక్షలు ఉంటాయి. ముఖ్యంగా మహిళలు తల నుంచి కాళ్ల వరకు కనిపించకుండా ఉండేలా, ముఖం కనిపించకుండా దుస్తులు ధరించాలి. ఈ నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించింద‌న్న కార‌ణంగా ఆమెపై ఆ దేశ వాసులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అంతేనా... ఏకంగా పోలీసులు కూడా రంగంలోకి దిగిపోయారు. బ‌హిరంగ ప్ర‌దేశంలో కాళ్లు క‌న‌ప‌డేలా స్క‌ర్ట్ వేసుకోవ‌డ‌మే కాకుండా... వెంట్రుక‌లు కూడా క‌నిపించేలా వేష‌ధార‌ణ ఇస్లామిక్ చ‌ట్టాల‌కు వ్య‌తిరేక‌మేన‌ని చెప్పిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఆమె ఆ దేశ కోర్టులో విచార‌ణ ఎదుర్కోక త‌ప్ప‌ని ప‌రిస్థితులు నెలకొన్నాయి.

Full View
Tags:    

Similar News