హైబ్రిడ్ మోడల్ కే అమ్మాయిల ఓటు.. కరోనా తర్వాత కొత్త మార్పు!

Update: 2022-08-04 23:30 GMT
ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపిన కరోనా తర్వాత చాలానే మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అలాంటి విషయమే ఒకటి బయటకు వచ్చింది. ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో కొత్త అంశం వెలుగు చూసింది. కరోనాకు ముందు ఉద్యోగాలు చేసే అమ్మాయిలు.. మహిళలు ఆఫీసులకు వచ్చేవారు.

ప్రత్యేక సందర్భాల్లో ఇంటి నుంచి పని చేసే విధానానికి అతి కష్టమ్మీదా కంపెనీలు ఒప్పుకునేవి. కరోనా పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల కంపెనీలు తమ ఉద్యోగుల చేత ఇంటి నుంచే పని చేయించాయి. తప్పనిసరిగా ఆఫీసులకు రావాల్సిన వాటి విషయంలో పొదుపుగా మానవ వనరుల్ని ఉపయోగించేవారు.

ఎప్పుడూ లేనిది కరోనా టైంలోనే మీడియా సంస్థల్లోనూ ఇంటి నుంచి పని చేసే విధానం అమల్లోకి రావటం తెలిసిందే. కరోనా తర్వాత ఇప్పుడు అలాంటి విషయంలో మార్పు వచ్చినట్లుగా చెబుతున్నారు. చాలామంది అమ్మాయిలు.. మహిళలు తాము చేస్తున్న ఉద్యోగాన్ని ఇంటి నుంచి పని చేసే అప్షన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. వర్కు ఫ్రం హోం సదుపాయం ఉన్న కంపెనీల వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తేలిసింది.

ఇంటి నుంచి పని చేయటం ద్వారా ఇంటిని.. ఆఫీసుకు సంబంధించిన అంశాల్ని తేలిగ్గా మేనేజ్ చేయటం వీలువుతుందని తేలింది. పలు కంపెనీలు ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తుండటం గమనార్హం.ఇటీవల చోటు చేసుకున్న మార్పులతో..చాలా కంపెనీల్లో స్త్రీ.. పురుషుల మధ్య సమానత్వానికి అవకాశాలు పెరిగినట్లుగా చెబుతున్నారు. ఇంటి నుంచి పని చేసే విధానానికి మొగ్గు చూపటం ద్వారా తమ కంపెనీలో ఉద్యోగాలు చేయటానికి దరఖాస్తు చేసుకునే మహిళల సంఖ్య 15-20 శాతం పెరిగినట్లుగా ఆర్ పీజీ గ్రూపు చెబుతోంది.

ముంబయికి చెందిన ఈ సంస్థ.. తమ ఉద్యోగుల విధుల ఆధారంగా వివిధ కేటగిరీలుగా విభజించింది. ఈ సందర్భంగా వారు ఆసక్తికర అంశాల్ని గుర్తించారు. కొన్ని కేటగిరీల్లో వారికి 50 శాతం సమయాన్ని ఇంటి నుంచి పని చేసే అవకాశం కల్పిస్తే.. కొన్ని కేటగిరీలకు వంద శాతం ఇంటి నుంచి పని చేసే అనుమతి ఇచ్చారు. దీంతో.. వివిధ విభాగాల్లో గతంలో పోలిస్తే.. మహిళల సంఖ్య ఎక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించారు.

ఒక్క ఆర్పీజీ కంపెనీనే కాదు.. పలు కంపెనీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లుగా చెబుతున్నారు. తాజా విధానం వల్ల టైర్ 2.. టైర్ 3 పట్టణాల నుంచి నిపుణులు ఇంటి నుంచి పని చేసేందుకు వీలు కలిగిన విషయాన్ని తాము గుర్తించినట్లుగా యాక్సిస్ బ్యాంకు సైతం చెప్పటం చూస్తే.. రానున్న రోజుల్లో ఈ హైబ్రిడ్ విధానానికి మరిన్ని కంపెనీలు మొగ్గు చూపటం ఖాయమంటున్నారు.
Tags:    

Similar News