జగన్‌ తో మహిళా మంత్రి కీలక భేటీ అందుకేనా?

Update: 2022-10-27 04:36 GMT
వైసీపీ నుంచి ప్రత్యర్థులపై విరుకుచుపడే నేతల్లో ఆర్కే రోజా ఒకరు. వైసీపీ ఫైర్‌ బ్రాండ్‌గా పేరొందిన రోజా గత రెండు పర్యాయాలు 2014, 2019ల్లో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

వైసీపీ కోసం చాలా కష్టపడే పనిచేశారు. దీంతో జగన్‌ మొదటి మంత్రివర్గ విస్తరణలోనే మంత్రి పదవి ఖాయమని అందరూ ఊహించేవరకు రోజా ప్రభ వెలిగింది. అయితే సమీకరణాలతో ఆమెకు పదవి దక్కలేదు. కేబినెట్‌ హోదా ఉన్న ఏపీఐఐసీ చైర్మన్‌ పదవి లభించిన సంగతి తెలిసిందే. ఈ పదవిలో ఉంటూనే రోజా టీవీ షోలు, జబర్దస్త్‌ చేసుకుంటూ వచ్చారు.

ఇక ఎట్టకేలకు రెండో మంత్రివర్గ విస్తరణలో పర్యాటక శాఖ మంత్రిగా చాన్సు కొట్టేశారు. అయితే రోజాకు సొంత నియోజకవర్గంలోనే అసమ్మతి పోరు తీవ్రంగా ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ చక్రపాణిరెడ్డి, నగరి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కేజే కుమార్, ఆయన భార్య ఈడిగ కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్‌పర్సన్‌ కేజే శాంతి, వడమాలపేట జెడ్పీటీసీ రాజశేఖరరెడ్డి తదితరులతో రోజాకు తీవ్ర విభేదాలున్నాయి.

ఇప్పటికే అసమ్మతిపై ఆర్కే రోజా పలుమార్లు వైసీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే అసమ్మతి నేతలకు జగన్‌ కేబినెట్‌లో కీలక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలు ఉండటంతో వారిపై ఈగ కూడా వాలడం లేదని సమాచారం.

కాగా అక్టోబర్‌ 16న స్థానిక ఎమ్మెల్యే అయిన రోజా లేకుండానే అసమ్మతి వర్గం రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్లకు శంకుస్థాపనలు చేసింది. ఈ కార్యక్రమంలో అసమ్మతి నేతలంతా పాల్గొన్నారు. ఈ చర్య రోజాలో తీవ్ర అసంతృప్తి, ఆవేదనకు కారణమైంది. ఏకంగా ఆమె తన ఆవేదనను వ్యక్తం చేస్తూ మాట్లాడిన ఒక ఆడియో కాల్‌ రాష్ట్రమంతా వైరల్‌ అయ్యింది.

ఈ నేపథ్యంలో తన భర్త సెల్వమణితో కలిసి మంత్రి రోజా తాజాగా ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో పరిస్థితులను ఏకరవు పెట్టారని తెలుస్తోంది. అసమ్మతి నేతలు స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు తెలియకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన దృష్టికి తెచ్చారని సమాచారం.

అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో తనకు కాకుండా చక్రపాణిరెడ్డికి సీటు వస్తుందని ప్రచారం చేస్తున్నారని జగన్‌ దృష్టికి తెచ్చారు. అయితే జగన్‌ ఏమి చెప్పారనేది బయటకు రాలేదు. రోజా కూడా మీడియాతో మాట్లాడకుండా తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ ఆఫీసు నుంచి వెళ్లిపోయారు.

కాగా ఇటీవల అసమ్మతి నేతలను వైఎస్‌ జగన్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పొన్నూరు మాజీ ఎమ్మెల్యే రావి వెంకట రమణ, పామర్రు మాజీ ఎమ్మెల్యే డీవై దాస్, నర్సాపురం మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడులను వైసీపీ నుంచి జగన్‌ బహిష్కరించారు.

ఈ నేపథ్యంలో తనను ఇబ్బందిపెడుతున్న అసమ్మతి నేతలను పార్టీ నుంచి బహిష్కరించాలని రోజా సీఎంను కోరినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే అసమ్మతి నేతలంతా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు కావడంతో సీఎం చూసిచూడనట్టు వదిలేస్తున్నారని చెబుతున్నారు. అందులోనూ ఎన్నికల ట్రబుల్‌ షూటర్‌ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకు ఎంత కీలకమో జగన్‌కు తెలుసని.. అందువల్ల ఆయన అనుచరులపై చర్యలు తీసుకునే సాహసం జగన్‌ చేయబోరని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News