'వర్క్ ఫ్రమ్‌ హోమ్‌' ఇకపై ఉద్యోగుల హక్కు.. పార్లమెంట్ లో చట్టం

Update: 2022-07-12 23:30 GMT
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా తీసుకొచ్చిన సంస్కరణలు ఎన్నో ఉన్నాయి. కరోనా వల్ల పలు దేశాల్లో ఇంకా కొత్త కొత్త సంస్కరణలు చాలానే వస్తున్నాయి.

అందులో భాగంగా వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ అనేది అత్యంత ప్రధానమైన విషయంగా చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగులు.. బ్యాంకింగ్ రంగానికి చెందిన ఉద్యోగులు ఇప్పుడు వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ కు అలవాటు పడ్డారు.

2020 సంవత్సరం ముందు వరకు కొన్ని సంస్థలు అప్పుడప్పుడు వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ కు అవకాశం ఇచ్చేవి. కొన్ని సంస్థలు తప్పనిసరిగా ఆఫీస్ కు రావాల్సిందే.. రాలేని పరిస్థితి ఉంటే సెలవు పెట్టుకోవాల్సిందే అనే రూల్‌ ను కలిగి ఉండేవి. కరోనా పీక్స్ లో ఉన్న సమయంలో ఆఫీస్ లు స్వయంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌ ను ఇవ్వడం జరిగింది. కరోనా కేసులు తగ్గినా కూడా కొన్ని సంస్థలు వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ ను కంటిన్యూ చేస్తున్నాయి.

వర్క్ అనేది ఎలాగైనా జరుగుతున్నప్పుడు వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ అయితే పోయేది ఏముంది అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు నెదర్లాండ్స్ దేశంలో వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ అనేది ఉద్యోగుల యొక్క ప్రాధమిక హక్కు అన్నట్లుగా ఆ దేశ పార్లమెంట్‌ లో చట్టం గా తీసుకు వచ్చారు. అక్కడి సెనెట్‌ ఆమోదం కూడా తెలపడంతో ఇక నుండి ఆ దేశ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ ను తమ హక్కుగా పొందవచ్చు.

దేశంలోని పలు సంస్థలు ఉద్యోగులను తప్పనిసరిగా ఆఫీస్ లకు రావాల్సిందే అంటూ ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఇష్టం లేకుంటే వర్క్ ఫ్రమ్‌ హోం చేస్తాం అంటూ ఉద్యోగులు చెప్పుకునే విధంగా వారికి హక్కుగా పార్లమెంట్‌ కల్పించడంతో ఉద్యోగస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం ఈ చట్టం ను తప్పబడుతున్నారు.

సంస్థలు తప్పని సరిగా వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుని ఆ అవకాశం కల్పిస్తుంది. కాని ఉద్యోగస్తులు తమకు హక్కు ఉంది.. చట్టం ఉంది అని రూల్స్ మాట్లాడితే సంస్థల యొక్క మనుగడ కష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి అనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి ఆదేశంలో తీసుకు వచ్చిన చట్టంను పలువురు ఉద్యోగస్తులు వారి వారి దేశాల్లో కూడా కోరుకుంటున్నారు.
Tags:    

Similar News