మ‌న చ‌దువుల‌పై ప్ర‌పంచ‌బ్యాంక్ సిల్లీ కామెంట్

Update: 2017-09-29 07:00 GMT
భార‌త‌దేశంలోని చ‌దువులు - అందులోని నాణ్య‌త‌పై ఇప్ప‌టికే మేధావుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌న‌వ‌న్నీ బ‌ట్టీ చ‌దువుల‌ని - మార్కులు సంపాదించే యంత్రాలుగా పిల్ల‌ల్ని మార్చేశార‌ని ప‌లువురు విశ్లేషిస్తుంటారు. అలాంటి ఆందోళ‌న‌లు - ఆవేద‌న‌ల స‌మ‌యంలో తాజాగా మ‌రో షాకింగ్ వార్త‌ తెరమీదకు వచ్చింది. భారత్‌ లాంటి అత్యల్ప లేదా మధ్యస్థాయి ఆదాయం కలిగిన దేశాల్లో విద్యారంగ సంక్షోభం తలెత్తే ప్రమాదముందని ప్రపంచబ్యాంకు హెచ్చరించింది. బడికి వెళ్లే పిల్లలు జీవితానికి అవసరమైన నైపుణ్యాలు నేర్చుకోకపోవడం వల్ల అభివృద్ధి అవకాశాలు వారికి చేజారడమే కాకుండా...పిల్లలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ప్రపంచబ్యాంకు తెలిపింది.

జీవితంలో విజయం సాధించేందుకు అవసరమైన విద్యను అందించడంలో ప్రాథమిక - సెకండరీ పాఠశాలలు విఫలమవుతున్నాయని ప్ర‌పంచ‌వ్యాంకు నివేదిక విశ్లేషించింది. రెండో తరగతి విద్యార్థి ఓ చిన్న పేరాలో ఒక్క పదాన్ని కూడా చదువలేని 12 దేశాల జాబితాలో ఆఫ్రికాలోని మాలావీ తర్వాత రెండోస్థానంలో భారత్ ఉందని నివేదిక సూచిస్తోంది. ఇక రెండంకెల తీసివేత చేయలేని 12 దేశాల జాబితాలో భారత్ ప్రథమ స్థానంలో నిలిచింది. మూడోతరగతి విద్యార్థులు 46 నుంచి 17 తీసేస్తే ఏమొస్తుందో చెప్పలేకపోతున్నారు.  ఐదో తరగతిలో సగం మంది పరిస్థితి అదేనని నివేదిక వెల్లడించింది. ఏళ్ల‌ తరబడి బడికి వెళ్లి చదువుకున్న పిల్లలు కూడా చదవడం, రాయడం, కనీస లెక్కలు చేయడం వంటివి కూడా అలవర్చుకోలేకపోతున్నారు. చదువులో అంతరాలు తగ్గాల్సిందిపోయి పెరుగుతున్నాయి అని నివేదిక పేర్కొంది.

పేదరికం - అంతర్యుద్ధం - లింగ అసమానతలు లేదా వైకల్యం కారణంగా చాలామంది పిల్లలు కనీస నైపుణ్యాలు ఒంటపట్టించుకోకుండానే బడుల నుంచి బయటికి వస్తున్నారని ప్రపంచబ్యాంకు తెలిపింది. పిల్లలకు మంచి చదువును అందిస్తే ఉపాధి -  మంచి ఆదాయం - చక్కని ఆరోగ్యం - పేదరికం లేని జీవనం సమకూరుతాయని ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు జిమ్ యోంగ్‌ కిమ్ వివరించారు. అభివృద్ధి చెందిన జాబితాలో చోటు సంపాదించుకునేందుకు భార‌త్ చేస్తున్న ప్ర‌య‌త్నానికి ఇలాంటి సామ‌ర్థ్యాల లేమి అడ్డంకిగా మారుతుంద‌ని పేర్కొన్నారు.


Tags:    

Similar News