చైనాలో తిరిగిందంతా ఆ నివేదికతో పోయిందా?

Update: 2015-09-15 04:52 GMT
గత వారం రోజులుగా ఊపిరి సలపనంత బీజీ షెడ్యూల్ లో పలు ప్రాంతాలు.. పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇమేజ్ ను దెబ్బ తీసేలా వరల్డ్ బ్యాంక్ నివేదిక ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక పాలసీ అంటూ ఉదరగొట్టేస్తున్న కేసీఆర్ మాటలకు భిన్నంగా.. వరల్డ్ బ్యాంక్ తాజాగా ఇచ్చిన నివేదికలో.. భారత్ లో వ్యాపారాలు చేసేందుకు అనువుగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ పదమూడో స్థానంలో ఉంటే.. ఏపీ రెండో స్థానంలో ఉండటం ఆయనకు మింగుడుపడనిదిగా మారుతుందని చెప్పక తప్పదు.

బోలెడంతమందితో చర్చలు జరిపి.. విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు కిందామీదా పడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి చైనా నుంచి కొత్త ఉత్సాహంతో తిరిగి వస్తున్న సమయంలో.. ప్రపంచబ్యాంకు నివేదిక ఆయన కష్టాన్ని బూడిదలోపోసిన పన్నీరుగా మార్చిందని చెప్పక తప్పదు.

భారత దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నామని.. పరిశ్రమల అనుమతుల విషయంలో పారదర్శకంగా వ్యవహరించటమే కాకుండా.. తన కార్యాలయంలోనే ప్రత్యేక వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేసినట్లు చెబుతున్న మాటల్లో పెద్ద పస లేదని ప్రపంచ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదిక తేల్చినట్లయ్యింది. దేశంలో పరిశ్రమల స్థాపనకు అనువుగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు 13వ స్థానం ఇవ్వటం కేసీఆర్ కు ఇబ్బంది కలిగించేదే.

మొత్తంగా చూస్తే.. తన వారం రోజుల చైనా పర్యటన నుంచి బోలెడన్ని తీపివార్తలతో వస్తున్న కేసీఆర్ కు ప్రపంచబ్యాంకు విడుదల చేసిన నివేదిక నిరుత్సాహానికి గురి చేయటమే కాదు.. ఆయన చెప్పే మాటలకు పెద్ద ప్రాధాన్యత లేకుండా చేస్తుందన్న వాదన వినిపిస్తోంది. మరి.. ప్రపంచ బ్యాంక్ నివేదికపై కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News