వ‌ర‌ల్డ్ స్లీప్ డేః ప్ర‌పంచ‌మా.. సుఖంగా నిద్రించుమా..!

Update: 2021-03-19 23:30 GMT
ప్ర‌కృతి ధ‌ర్మం ప్ర‌కారం.. జీవులు పొద్దంతా మెల‌వ‌కువ‌గా ఉండాలి. రాత్రివేళ నిద్ర‌పోవాలి. దాదాపు అన్ని ప్రాణులూ ఈ సూత్రాన్ని ఖ‌చ్చితంగా పాటిస్తున్నాయి ఒక్క మ‌నిషి త‌ప్ప‌! పెరుగుతున్న సాంకేతిక‌త‌, అవ‌స‌రాల నేప‌థ్యంలో ఏ మ‌నిషి ఎప్పుడు తింటున్నాడో..? ఎప్పుడు ప‌డుకుంటున్నాడో..? ఎప్పుడు నిద్ర లేస్తున్నాడో? అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది ప్ర‌పంచంలో!

అయితే.. స‌రిప‌డా నిద్ర‌లేక‌పోతే ఆరోగ్యం దెబ్బ‌తింటుంద‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. కానీ.. చేస్తున్న ప‌నులు, ప‌రిస్థితులు మ‌నిషికి సుఖ‌మైన నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ తీవ్ర‌త‌ను గుర్తించిన ప్ర‌పంచం.. నిద్ర అవ‌స‌రాన్ని తెలియ‌జేస్తూ.. వ‌ర‌ల్డ్ స్లీప్ డేను ప్ర‌చారంలోకి తెచ్చింది. మార్చి 19వ తేదీన ఈ దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నారు. నిద్ర అవ‌స‌రం ఎంత‌? చ‌క్క‌టి నిద్ర‌కు ఏం చేయాల‌నేది చ‌ర్చించుకోవ‌డం.. పాటించ‌డ‌మే ఈ ప్ర‌పంచ నిద్ర దినోత్స‌వం ల‌క్ష్యం.

నిజంగా.. మ‌నిషి నిద్ర‌లేమితో ఎంత అవ‌స్థ‌లు ప‌డుతున్నారో తెలియాలంటే.. జ‌పాన్ వాసుల‌ను చూస్తే తెలుస్తుంది! వాళ్లు రోడ్లమీద న‌డుస్తూనే నిద్ర‌పోతారు. వీధుల్లో కూర్చున్న చోట‌నే గాఢ నిద్ర‌లోకి జారిపోతారు. అక్క‌డ మితిమీరిన ప‌నిగంట‌ల వ‌ల్లే ఈ ప‌రిస్థితి త‌లెత్తింది. ఇలాంటి ప‌రిస్థితి ప్ర‌పంచం మొత్తం విస్త‌రిస్తోంది. అందుకే.. స్లీప్ డే ఆవ‌శ్య‌క‌త రోజురోజుకూ పెరుగుతోంది.

కాబ‌ట్టి.. ప్ర‌తి ఒక్క‌రూ చ‌క్క‌గా క‌నీసం 6 గంట‌లు నిద్ర‌పోయేలా ప్లాన్ చేసుకోవాలి. అదికూడా వీలైనంత వ‌ర‌కూ రాత్రివేళ‌లోనే ఉండేలా చూసుకోవాలి. నైట్ డ్యూటీల వ‌ల్ల చాలా రోగాలు రావ‌డంతోపాటు.. క్యాన్స‌ర్‌, డీఎన్ఏ బ‌ల‌హీన‌ప‌డ‌టం వంటి దుష్ప్ర‌భావాలు కూడా ఉంటాయ‌ని చెబుతోంది తాజా అధ్య‌య‌నం.

రాత్రివేళ‌లో టీ,కాఫీలు తాగ‌డం మానేయాల‌ని, మ‌ద్యం అతిగా సేవించ‌డం కూడా మంచిది కాద‌ని నిపుణులు సూచిస్తున్నారు. నిద్ర‌పోవ‌డానికి రెండు గంట‌ల ముందే భోజ‌నం ముగించ‌డం, రోజూ ప‌డుకోవ‌డానికి స‌మ‌యం సెట్ చేసుకోవ‌డం, నిత్యం వ్యాయామం చేయ‌డం వంటి ప‌నుల ద్వారా సుఖ నిద్ర‌ను పొందవ‌చ్చ‌ని సూచిస్తున్నారు. మీకు గ‌న‌క నిద్ర‌స‌మ‌స్య‌లు ఉంటే మాత్రం.. వెంట‌నే వాటిని ప‌రిష్క‌రించుకునే ప్ర‌య‌త్నం చేయండి. సుఖంగా నిద్రించండి.. ఆరోగ్యంగా ఉండండి.
Tags:    

Similar News